పాకిస్తాన్‌లో బలవంత మతమార్పిడి నిరోధక చట్టం - పాక్ హిందూ నేత రమేష్ కుమార్‌తో బీబీసీ ఇంటర్వ్యూ..

  • 31 మార్చి 2019
Ramesh Kumar Vankwani Image copyright Ramesh Kumar Vankwani
చిత్రం శీర్షిక డా.రమేష్ కుమార్ వన్క్వానీ

పాకిస్తాన్‌లో బలవంత మతమార్పిడులను అడ్డుకునేలా చట్టం తేవాలని, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన జాతీయ అసెంబ్లీ సభ్యుడు, హిందువు అయిన డా.రమేష్ కుమార్ వన్క్వానీ నిర్ణయించారు.

రీనా, రవీనా అనే ఇద్దరు మహిళలను బలవంతంగా మతమార్పిడి చేయించారన్న వివాదం నేపథ్యంలో రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

డా.రమేష్ కుమార్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. బీబీసీతో మాట్లాడుతూ, బలవంత మతమార్పిడులకు సంబంధించి ఇప్పటికే జాతీయ అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టామని రమేష్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్

''ఆడపిల్లల పెళ్లి వయసు 18కు పెంచడం మొదటి బిల్లు ఉద్దేశం. బలవంత మత మార్పిడిని అడ్డుకోవాలని రెండో బిల్లు చెబుతోంది'' అన్నారు.

ప్రస్తుత చట్టాల ప్రకారం, పాకిస్తాన్‌లో ఆడపిల్లల కనీస వివాహ వయసు 16. కానీ సింధ్ దక్షిణ ప్రాంతంలో మాత్రం, ఆడపిల్లల కనీస వివాహ వయసు 18 గా ఉంది.

గతంలో ఆడపిల్లల కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పెంచడానికి చేసిన ప్రయత్నాలను పాకిస్తాన్‌లోని రాజకీయనాయకులు, 'ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ ఐడియాలజీ' సంస్థ కూడా అడ్డుకుంది.

వివాహ వయసును 18 కు పెంచడం అన్నది ఇస్లాం మతానికి వ్యతిరేకం అన్నది వారి వాదన.

రీనా, రవీనా కేసు వెలుగు చూసిన సందర్భంలో, బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ ఐడియాలజీ చైర్మన్ డా.క్విబ్లా అయాజ్ అన్నారు.

ఇక రెండో బిల్లు గురించి మాట్లాడుతూ..

''కేవలం రెండుమూడు మతపరమైన సంస్థలు మాత్రమే బలవంత మతమార్పిడులకు ప్రసిద్ధిగాంచాయి. అందులో 'మియాన్ మిథు' సంస్థ ఒకటి. వీరు వృద్ధులను మతమార్పిడికి ప్రోత్సహించరు. యువతులు మాత్రమే వీరి లక్ష్యం. ఒక ఏడాది వెయ్యి మందిని మతమార్పిడి చేశారని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆ ఏడాది కేవలం 200 మందిని మాత్రమే అలా చేశారని చెబుతున్నారు. ఇది అలవాటుగా మారిపోయింది'' అన్నారు.

‘మతమార్పిడి, తర్వాత వ్యభిచారం..’

''బలవంత మతమార్పిడులకు పాల్పడ్డాక, ఈ అమ్మాయిలకు వివాహం చేస్తారు. చాలా కేసుల్లో, అప్పటికే పెళ్లయిన మగవారికే ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిచేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తారు. ప్రతిపాదనలోని బిల్లు.. అలాంటి సంస్థలను అడ్డుకుంటుంది. వాటిని నిషేధిత సంస్థల జాబితాలోకి చేర్చి, శిక్షిస్తుంది'' అన్నారు.

కొన్నిరోజుల క్రితం పీర్ అబ్దుల్ హక్‌(మియాన్ మిథు) కుమారుడు మియాన్ మొహమ్మద్ అస్లామ్ ఖాద్రి బీబీసీతో మాట్లాడుతూ, గతంలో చాలామంది మతం మార్చుకున్న ఆడపిల్లలు..

''మా ఇష్టప్రకారమే మతం మారాము. ఎవ్వరూ మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు. హిందూ ప్రజల ఓట్ల కోసమే అంతా రాజకీయం చేస్తున్నారు'' అని సుప్రీంకోర్టులో చెప్పారని అన్నారు. బలవంత మతమార్పిడులను ఇస్లాం మతం అంగీకరించదని ఆయన అన్నారు.

తాజాగా రీనా, రవీనా కూడా.. ఇష్టప్రకారమే తాము ఇస్లాం మతాన్ని స్వీకరించామని, మతమార్పిడికి ఎవ్వరూ బలవంతం చేయలేదని మీడియాకు తెలిపారు.

కానీ చట్టపరమైన ధృవపత్రాలేవీ లేకపోవడంతో ఈ అమ్మాయిల వయసు గురించి స్పష్టత లేదు.

రీనా, రవీనా చెప్పిన అంశాలనే వారి తరపు లాయర్ రావ్ అబ్దుర్ రహీమ్ పునరుద్ఘాటిస్తూ.. ఇద్దరమ్మాయిలూ తమ ఇష్టప్రకారమే ఇస్లాం మతాన్ని స్వీకరించారని, మియాన్ మిథుకు చెందిన సంస్థలోనే ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు.

చిత్రం శీర్షిక సింధ్ ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల మంత్రి హరి రామ్ కిశోరీలాల్‌

‘కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి’

మతం మార్చుకున్నాక, వీరు తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు పోలేరని, చట్టపరమైన రక్షణ అవసరం కాబట్టి, తమ కుటుంబానికి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నట్లు లాయర్ తెలిపారు.

స్వచ్ఛందంగా ఇస్లాం స్వీకరిస్తున్న అంశంపై డా.రమేష్ కుమార్ వాన్క్వానీ మాట్లాడుతూ..

''ఈ బిల్లు ప్రకారం 18 ఏళ్లలోపు వారెవ్వరూ తమ మతాన్ని మార్చుకోవడానికి వీలు ఉండదు. ఒకవేళ స్వచ్ఛందంగా ఇతర మతాన్ని స్వీకరించాలనుకుంటే, తాము మారాలనుకున్న మత ప్రభావం తమపై ఎలావుంది, ఆ మతానికి సంబంధించి ఏమేరకు జ్ఞానసముపార్జన జరిగింది.. అన్న విషయాలతోపాటు, తాము స్వచ్ఛందంగా మతాన్ని మార్చుకుంటున్నామని కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి'' అన్నారు.

''అమ్మాయిలను, అబ్బాయిలను కిడ్నాప్ చేసి, వారి చేత బలవంతంగా మతమార్పిడి చేయించి, ఆవెంటనే వారికి పెళ్లిళ్లు చేసి, వారు మతం మారారు అని నిర్ధరించడం.. స్వచ్ఛంద మతమార్పిడి కాదు'' అని రమేష్ కుమార్ అన్నారు.

ముస్లిమేతర ప్రజలను బలవంత మతమార్పిడి నుంచి కాపాడటానికి, సింధ్ ప్రాంతంలోని స్థానిక ప్రభుత్వం కూడా 2016 చివర్లో ఇలాంటి బిల్లునే ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మతపరమైన పార్టీలన్నీ పెద్దఎత్తున నిరసనలు చేశాయి. ఫలితంగా, ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు