ఈ పిల్ వేసుకుంటే కండోమ్ అవసరం ఉండదు.. కానీ అది మార్కెట్‌లోకి రావట్లేదు?

  • 5 ఏప్రిల్ 2019
ਸੰਕੇਤਕ ਤਸਵੀਰ Image copyright REBECCA HENDIN/BBC THREE

పురుషుల కుటుంబ నియంత్రణ మాత్రలకు (పిల్) సంబంధించి ప్రాథమిక ప్రయోగాలు విజయవంతం అయ్యాయని తాజాగా నిపుణులు వెల్లడించారు.

ఆ మాత్ర వేసుకుంటే పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తాత్కాలికంగా ఆగిపోతుంది. దాన్ని రోజూ వేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం కుటుంబ నియంత్రణ కోసం పురుషులు కండోమ్ వినియోగించాలి, లేదంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వాసెక్టమీ) చేయించుకునే వెసులుబాటు ఉంది.

అయితే, ఈ మాత్ర ద్వారా కండోమ్‌కు, వాసెక్టమీకి అదనంగా పురుషులకు మరో ప్రత్యామ్నాయ మార్గం అవుతుందని ఎండోక్రైమ్ సొసైటీ అనే సంస్థ నిపుణులు తెలిపారు.

కానీ, దాన్ని బహిరంగ మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ఇంకా దశాబ్దకాలం పట్టే అవకాశం ఉందని ఆ సంస్థ వైద్యులు చెబుతున్నారు.

మహిళల పిల్‌‌ను దాదాపు 50 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో అందుబాటులోకి తెచ్చారు. మరి, పురుషుల పిల్‌కు ఎందుకు ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి?

Image copyright Getty Images

లైంగిక సామర్థ్యం

పురుషుల పిల్‌కు మార్కెట్‌లో పెద్దగా ఆదరణ ఉండదేమో అన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అయితే, ఆ పిల్ అందుబాటులోకి వస్తే అనేక మంది పురుషులు దాన్ని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఒక అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.

మరోవైపు, పిల్‌ వేసుకోవడంలో పురుషులు నిర్లక్ష్యం వహిస్తారన్న ఆందోళన కూడా మహిళల్లో ఉంది.

2011లో బ్రిటన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో 134 మంది మహిళలు పాల్గొనగా.. 70 మంది తమ భర్తలు పిల్ వేసుకోవడం మరచిపోతారన్న ఆందోళన వ్యక్తం చేశారు.

హార్మోన్ ఆధారిత పిల్‌ను అభివృద్ధి చేయాలంటే దాన్ని వినియోగించే పురుషుల్లో లైంగిక కోరికల మీద, అంగ స్తంభన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి.

Image copyright Science Photo Library

వీర్యం ఉత్పత్తి

సంతాన యోగ్యమైన పురుషుల వృషణాలలో హార్మోన్ల ప్రభావంతో నిరంతరం వీర్య కణాలు ఉత్పత్తి అవుతుంటాయి.

అయితే, ఆ హార్మోన్ల మోతాదు తగ్గితే అది కొన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల హార్మోన్‌ స్థాయి మరీ పడిపోకుండా చూస్తూనే, వీర్య కణాల ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేయాల్సి ఉంటుంది.

తాజాగా పరీక్షలు జరిపిన మాత్ర అలాంటిదేనని, ప్రస్తుతానికి ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావంతో ఉన్నామని కాలిఫోర్నియాకు చెందిన ఎల్‌ఏ బయోమెడ్ అనే పరిశోధనా సంస్థ, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.

Image copyright Getty Images

తొలి దశలో 40 మంది పురుషులపై ఈ పిల్‌ను పరీక్షించగా ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు.

28 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ మాత్రను వాడినన్ని రోజులు వారిలో వీర్యం ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. పరీక్షలు ఆపేసిన తర్వాత వీర్యం ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి వచ్చింది.

అంగస్తంభన సమస్యలు

పరీక్షల సమయంలో కొద్దిపాటి సమస్యలు (సైడ్ ఎఫెక్ట్స్‌) కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న వారిలో అయిదుగురు పురుషులు తమలో లైంగిక ఉత్సాహం కొద్దిగా తగ్గిందని చెప్పారు. మరో ఇద్దరేమో కాస్తం అంగస్తంభన సమస్యలు ఎదుర్కొన్నామని తెలిపారు.

అయితే, వారిలో శృంగార చర్యలను ఎవరూ తగ్గించలేదు. సైడ్ ఎఫెక్ట్స్ కారణంతో ఎవరూ ఆ మాత్రలను తీసుకోకుండా ఉండలేదు. అందరూ పరీక్షల్లో పాసయ్యారు.

Image copyright iStock

బాడీ జెల్

పురుషుల కుటంబ నియంత్రణ కోసం ఈ పరిశోధకులు మరో బాడీ జెల్‌ను కూడా తయారు చేశారు. ఆ జెల్‌ను పురుషులు శరీరం వెనుక భాగంలో, భుజాలకు రాసుకోవాలి, చర్మం ద్వారా అది శరీరంలోపలికి వెళ్తుంది.

ఆ జిగురు పదార్థంలో ఉండే ప్రొజెస్టిరాన్ హార్మోన్ వృషణాలాల్లో సహజమైన టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కాకుండా చేస్తుంది. దాంతో, వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది.

అయితే, ఆ జెల్‌లో కృత్రిమ టెస్టోస్టిరాన్ హార్మోన్ మాత్రం ఆ వ్యక్తిలో లైంగిక ఉత్సాహంతో పాటు, ఆ హార్మోన్‌ మీద ఆధారపడి పనిచేసే ఇతర క్రియలు యథావిధిగా జరిగేలా చూస్తుంది.

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ వాంగ్, డాక్టర్ స్టెఫనీ పేజ్‌తో పాటు మరికొందరు సహచరులు కలిసి మరో మాత్రను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.

ప్రాథమిక దశలో దానిని 100 మంది పురుషులతో పరీక్షించగా సానుకూలమైన ఫలితాలు వచ్చాయని వారు తెలిపారు.

Image copyright THINKSTOCK

నెల రోజులకు ఒకేసారి

మరికొందరు శాస్త్రవేత్తలు ఒక్కసారి వేసుకుంటే నెల రోజులపాటు పనిచేసే మాత్రలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రాథమిక పరీక్షల సమయంలో కుంగుబాటు, మూడ్ చెడిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయని కొందరు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని ఆపేశారు.

ఇంకొందరు పరిశోధకులు పురుషాంగం దాటి వీర్యం బయటకు రాకుండా చేసే దిశగానూ కసరత్తులు చేస్తున్నారు. అయితే, ఆ విధానాన్ని ఇప్పటివరకు జంతువుల మీద మాత్రమే పరీక్షించారు. త్వరలో మనుషుల మీద కూడా పరీక్షించే అవకాశం ఉంది.

పురుషుల పిల్స్ మీద ఫార్మా సంస్థలు పెద్దగా దృష్టి సారించడంలేదని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బ్రాకు చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ ఆండర్సన్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు

నిందితులను చంపేస్తే దేశమంతటా ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు

విషపూరిత కప్పలు... వాటిని నేర్పుగా తినే ఎలుకలు

ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...

పెళ్లి వేడుకలో డాన్స్ మధ్యలో ఆపినందుకు యువతి ముఖంపై తుపాకీతో కాల్చారు

BBC Exclusive: ఎయిర్‌టెల్ సమాచార వ్యవస్థలో లోపం.. 32 కోట్ల మంది సమాచారం లీకయ్యే ప్రమాదాన్ని సరిదిద్దామన్న సంస్థ

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి