డ్రైవర్ లేని బస్సు: ఇలాంటి బస్సులో ఎప్పుడైనా ప్రయాణించారా

  • 2 ఏప్రిల్ 2019
డ్రైవర్ రహిత బస్సు
చిత్రం శీర్షిక డ్రైవర్ రహిత బస్సు

ఇప్పటి వరకు డ్రైవర్ రహిత కార్లు, బస్సుల గురించి చాలామంది వార్తల్లోనే చూసి ఉంటారు. అయితే, స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన షఫౌజెన్ పట్టణానికి వెళ్తే మీరు డ్రైవర్‌ లేని బస్సులో ప్రయాణించొచ్చు.

చిన్న వ్యాను పరిమాణంలో ఉండే ఈ బస్సు డ్రైవర్‌ లేకుండానే రోడ్లపై పరుగులు పెడుతోంది. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు. పూర్తిగా విద్యుత్‌తోనే నడుస్తుంది.

ఈ బస్సులో అత్యాధునిక కెమెరాలు, సెన్సర్లు ఉంటాయి. వాటితో రోడ్డుమీద వెళ్లే పాదచారులను, ఇతర వాహనాలను గుర్తిస్తుంది.

గరిష్ఠంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఉన్నట్టుండి ఏదైనా అడ్డొస్తే వెంటనే దానంతట అదే బ్రేక్ వేసుకుంటుంది. అలాంటి సమయాల్లో ఒక్కోసారి కాస్త ఇబ్బంది పడుతుంది.

ఈ బస్సులో ప్రయాణించేందుకు సందర్శకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

డ్రైవర్ రహిత బస్సులో ప్రయాణించడం చక్కని అనుభూతి అని పర్యటకులు అంటున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇక్కడికి టూర్‌కు వెళ్తే డ్రైవర్‌లెస్ బస్సులో వెళ్లొచ్చు

ఈ బస్సులో డ్రైవర్ ఉండరు. కానీ, ప్రస్తుతం ఒక సహాయకురాలు ఉంటున్నారు. రోడ్డు మరమ్మత్తుల్లాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు... ఆమె ఈ బస్సును దారి మళ్లిస్తారు.

ఇతర రవాణా వ్యవస్థలతోనూ ఈ బస్సును అనుసంధానం చేశారు. పర్యటకులను బస్టాపులు, రైల్వే స్టేషన్ల వద్దకు తీసుకెళ్తుంది.

సాధారణ బస్సులకు బదులుగా వీటిని పూర్తిస్థాయిలో నడిపే ఆలోచన లేదని నిర్వాహకులు అంటున్నారు.

"ప్రజా రవాణా వ్యవస్థను ఇది ఓ కుదుపు కుదిపేసే మార్పు. ప్రజా రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో వీటిని వాడొచ్చు. ఇది చిన్న చిన్న కాలనీల్లోకి సులువుగా వెళ్తుంది. అవసరమైనప్పుడు ఇంటి దగ్గరికే వచ్చి పికప్ చేసుకుంటుంది. దగ్గర్లోని బస్టాండు లేదా రైల్వే స్టేషన్ వద్ద దించేస్తుంది. అక్కడి నుంచి మామూలుగా ఇతర వాహనాల్లో వెళ్లిపోవచ్చు" అని ఈ బస్సు నిర్వహణ సంస్థ ట్రపీజ్ స్విట్జర్లాండ్, సీఈవో పీటర్ ష్నెక్ వివరించారు.

వచ్చే ఏడాది ఇక్కడ మరిన్ని డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు