స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

  • 3 ఏప్రిల్ 2019
మాథ్యూ, సెస్సీల్, డార్టీ, ఉమ Image copyright ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
చిత్రం శీర్షిక మాథ్యూ, సెస్సీల్, డార్టీ, ఉమ

నానమ్మ మనుమరాలికి జన్మనిచ్చింది. అవును మీరు సరిగ్గానే చదివారు. ఇది నిజం. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన 61 ఏళ్ల సెస్సీల్ ఎలెడ్జ్, స్వలింగసంపర్కుడైన తన కొడుకు మాథ్యూ ఎలెడ్జ్ కోసం సరొగేటరీ మదర్‌గా మారారు.

తన కొడుకు, అతని భర్త ఎలియట్ డార్టీ ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ప్రారంభించాలనుకున్నపుడు తానే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు సెస్సీల్ అన్నారు. ఇందుకోసం ఆమె అల్లుడు డార్టీ సోదరి అండాన్ని దానం చేశారు.

గతవారం సరొగసీ విధానం ద్వారా ఉమా లూయిస్ అనే బిడ్డను సెస్సీల్ ప్రసవించారు.

ఈ ప్రతిపాదన చేసినపుడు ఆమె వయసు 59. ఈ విషయం విని, మొదట్లో అందరూ నవ్వారని ఆమె బీబీసీతో అన్నారు.

Image copyright ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
చిత్రం శీర్షిక ఉమ జన్మించాక పసిబిడ్డను చూస్తున్న డార్టీ, మాథ్యూ

''మా బిడ్డకు జన్మనివ్వడం ఆమెకు ఓ సెంటిమెంట్ అనిపించింది. ఆమె చాలా నిస్వార్థపరురాలు'' అని అల్లుడు ఎలియట్ డార్టీ అన్నారు.

పిల్లలకోసం చూస్తున్న మాథ్యూ ఎలెడ్జ్, డార్టీలకు సరొగసీ గురించి వైద్యులు సూచించారు. మాథ్యూ తల్లి సెస్సీల్‌ను ఇంటర్వ్యూ చేసి, సరొగసీ కోసం ఆమె శారీరకంగా సిద్ధంగా ఉన్నదోలేదో తెలుసుకోవడానికి పలు వైద్య పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ అన్నీ సానుకూలంగా వచ్చాయి.

''నాకు ఆరోగ్యం పట్ల సృహ ఎక్కువ. అందుకే.,బిడ్డను మోయడంలో అప్పుడు నాకు ఎలాంటి సందేహం తలెత్తలేదు'' అని సెస్సీల్ అన్నారు.

మాథ్యూ వీర్యాన్ని డార్టీ సోదరి అండంతో ఫలదీకరణ చేశారు. తమ జన్యుమూలాలు (బయొలాజికల్ చైల్డ్) ఉన్న పిల్లలకోసం సాధారణంగా స్త్రీపురుష దంపతులు ఐవీఎఫ్ విధానాన్ని ఆశ్రయిస్తారని డార్టీ అన్నారు. డార్టీ హెయిర్ డ్రెస్సర్‌గా పని చేస్తున్నారు.

Image copyright Alamy
చిత్రం శీర్షిక అండదానం చేసిన డార్టీ సోదరి, డార్టీ, సెస్సీల్ ఎలెడ్జ్, మాథ్యూ ఎలెడ్జ్

కానీ తమ విషయంలో బయొలాజికల్ చైల్డ్‌ కోసం సరొగసీ మాత్రమే తమకున్న ఏకైక మార్గమని డార్టీ వివరించారు.

''పిల్లలకోసం అందరిలా కాకుండా, కాస్త ప్రత్యేకంగా ఆలోచించాలని మేం భావించాం..'' అని పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న మాథ్యూ అన్నారు.

అంతకుముందే సెస్సీల్‌ ముగ్గురు పిల్లలను కన్నారు. తన మనుమరాలిని గర్భంలో మోస్తున్నపుడు కూడా అంతా సవ్యంగా నడిచిందని అన్నారు.

తన నిర్ణయానికి అందరూ సానుకూలంగా స్పందించారని, కాకపోతే కాస్త షాక్‌కు గురయ్యారని సెస్సీల్ చెబుతున్నారు. ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలు!

''విషయం పూర్తిగా అర్థమయ్యాక, నా బిడ్డకు అండగా నిలబడుతున్నానని తెలుసుకున్నారు'' అని సెస్సీల్ అన్నారు.

Image copyright ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
చిత్రం శీర్షిక ఉమాను ప్రసవించిన సెస్సీల్‌తో కుటుంబ సభ్యులు

2015సం. నుంచి ఆ నెబ్రాస్కా రాష్ట్రంలో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్స్, బైసెక్సువల్స్‌ పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉంది. కానీ స్వలింగసంపర్కులు పెంపుడు తల్లిదండ్రులుగా ఉండటంపై 2017సం. వరకూ నిషేధం అమల్లో ఉండేది.

సొంతబిడ్డకు జన్మనిచ్చుంటే తనకు ఇన్సూరెన్స్ వచ్చేదని, అలాకాదు కాబట్టి తన వైద్యఖర్చులను భరించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ అంగీకరించలేదని సెస్సీల్ అన్నారు.

డార్టీని పెళ్లిచేసుకోబోతున్నట్లు మాథ్యూ.. తాను పని చేస్తున్న 'స్కట్ క్యాథలిక్ హైస్కూల్' యాజమాన్యానికి చెప్పడంతో ఉద్యోగాన్ని కోల్పోవాల్సివచ్చింది. ఈ సంఘటనతో నాలుగేళ్ల క్రితం ఆయన వార్తల్లో నిలిచారు.

Image copyright ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/
చిత్రం శీర్షిక ఎలియట్ డార్టీ, మాథ్యూ ఎలెడ్జ్

మాథ్యూను ఉద్యోగం నుంచి తొలగించడంతో, చాలామంది ఆగ్రహించారు. స్కూల్‌కు చెందిన పాత విద్యార్థులతోపాటు అప్పటి విద్యార్థులు, తల్లిదండ్రులు మాథ్యూకు మద్దతుగా నిలిచారు.

స్కూల్లో పనిచేసే గే, లెస్బియన్, ట్రాన్స్‌జెండర్, బైసెక్సువల్(ఎల్‌.జి.బి.టి) పట్ల వివక్ష చూపరాదని డిమాండ్ చేశారు. ఎల్‌జీబీటీ వ్యక్తులు, వారి కుటుంబాలను ద్వేషించేవారికి తమ కథ కనువిప్పు కావాలని సెస్సీల్ తెలిపారు.

Image copyright ARIEL PANOWICZ / HTTP://ARIELFRIED.COM/

''మమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నవారి గురించి ఆలోచించను. ఇప్పుడు ఏమైంది? మాకు ఓ కుటుంబం ఉంది. మాకు మంచి మిత్రులు ఉన్నారు. అండగా నిలవడానికి మాకంటూ ఒక సమాజం ఉంది'' అని మాథ్యూ అన్నారు.

ఉమ జన్మించిన వారం రోజుల తర్వాత, తాను, తన మనవరాలు ఆరోగ్యంగా ఉన్నామని సెస్సీల్ తెలిపారు.

''ఈ పిల్లకు మద్దతు ఎక్కువగా ఉంది. తనను ప్రేమించే కుటుంబంలో తాను పెరగనుంది. మేం ఆశించింది ఇదే..'' అని సెస్సీల్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)