అంతరిక్షంలో చెత్త నింపడానికి పోటీ పడుతున్న అమెరికా, చైనా

ఫొటో సోర్స్, drdo
భారత్ యాంటీ-శాటిలైట్ మిసైల్ పరీక్షలతో వెలువడే శిథిలాల వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్(ఐఎస్ఎస్)కు చాలా ప్రమాదం ఉందని నాసా (ది నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ఆందోళన వ్యక్తం చేసింది.
అంతరిక్షంలో భారత్ టార్గెట్ చేసిన ఉపగ్రహం చాలా ముక్కలయ్యిందని నాసా చీఫ్ జిమ్ బ్రైడెన్‌స్టయిన్ చెప్పారు.
ఉపగ్రహం శిథిలాల సంఖ్య 400 కంటే ఎక్కువే ఉంటుందని ఆయన తెలిపారు. దానివల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు ముప్పు రావచ్చని అన్నారు..
నాసా టౌన్‌హాల్‌లో మాట్లాడిన బ్రైడెన్‌స్టయిన్ "భారత్ ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల ఏర్పడిన శిథిలాల్లో ఎక్కువ పెద్దవే ఉన్నాయి. చిన్న ముక్కలను నాసా ట్రాక్ చేసింది, పెద్ద శిథిలాల కోసం గాలిస్తున్నాం" అన్నారు.
అంతరిక్ష మిషన్ కోసం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ఆయన అన్నారు.
"భారత్ ఉపగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల పేరుకున్న చెత్తలో 60 చిన్న శిథిలాలను గుర్తించాం. వీటిలో 24 ముక్కలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పైనుంచి వెళ్లాయి" అని జిమ్ చెప్పారు.
"ఇలాంటివి ఆమోదయోగ్యం కాదు. ఈ ప్రభావం గురించి నాసా పూర్తి స్పష్టతతో ఉంది. అమెరికా సైన్యానికి అంతరిక్షంలో ఆ చెత్తకు సంబంధించిన శిథిలాలు లభించాయి. అది ఐఎస్ఎస్, దాని ఉపగ్రహాలకు చాలా ప్రమాదకరమని వారు చెప్పారు" అని జిమ్ తెలిపారు.
భారత్ పరీక్షల వల్ల ఐఎస్ఎస్‌కు వచ్చే ముప్పు 10 రోజుల్లో 44 శాతం పెరిగిందని నాసా చీఫ్ చెప్పారు. అయితే కాలక్రమేణా ఆ ప్రమాదం తొలగిపోవచ్చని అన్నారు. ఎందుకంటే, ఆ ముక్కలు మెల్లమెల్లగా వాతావరణంలోకి రాగానే మండిపోతాయని జిమ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నాసా ఆరోపణలపై సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లా ఏమంటున్నారు
ఏదైనా ప్రయోగం జరిగితే కచ్చితంగా అంతరిక్షంలో చెత్త పెరుగుతుంది. కానీ వారు 44 శాతం ముప్పు పెరిగిందని చెప్పారు, అంటే అది 1.44 శాతం మాత్రమే. అది చాలా మామూలు ముప్పు.
దీనిని మనం "దెయ్యాల వేదాలు వల్లించినట్టుందని" అనవచ్చు. అంతరిక్షంలో అందరికంటే ఎక్కువ చెత్త వేస్తోంది అమెరికానే. అమెరికా చెత్తను తమకు తగినట్టు మానిటర్ చేస్తుంది. వారు వేసిన చెత్తలో 6 వేల కంటే ఎక్కువ శిథిలాలే ఉన్నాయి. అయితే భారత్ వల్ల ఏర్పడిన శిథిలాల సంఖ్య 100కు దగ్గరగా ఉంది.
అంతరిక్షంలో ఆరు వేలకు పైగా శిథిలాలు ఉన్నాయి. చైనా 2007లో యాంటీ-శాటిలైట్ మిసైల్ ప్రయోగించింది. దానితో 800 కిలోమీటర్లకు పైగా ఎత్తులో ఉన్న తమ ఉపగ్రహాన్ని కూల్చేసింది.
అంతరిక్షంలో సుమారు 10 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న శిథిలాలు 30 వేలకు పైనే ఉన్నాయి. పెద్ద రాడార్ ద్వారా అమెరికా సెంట్రల్ స్పేస్ కమాండ్ వాటిపై నిఘా పెడుతుంటుంది.
1957లో స్పుత్నిక్ లాంచ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 8 వేల కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. ఇప్పుడు కూడా సుమారు 200 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. వీటిలో 800 అమెరికావైతే, కొన్ని రష్యా, చైనా శాటిలైట్లు ఉన్నాయి.
భారత్ ఇప్పటివరకూ 48 ఉపగ్రహాలు మాత్రమే పంపించింది. ఏ దేశం ఎన్ని ఎక్కువ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపిస్తే, అంత ఎక్కువ చెత్త అక్కడ నింపుతుంది.
జాగ్రత్తగా గమనిస్తే నాసా చీఫ్ చివర్లో మన వ్యోమగాములకు దానివల్ల ముప్పు లేదు అని ఒక మాటన్నారు. కానీ ప్రమాదమైతే కచ్చితంగా కాస్త పెరిగింది. కానీ వారు స్వయంగా చేసిన పరీక్షల వల్ల అంతరిక్షంలో చాలా చెత్త పేరుకుపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్ష శిథిలాలంటే ఏంటి
స్పేస్‌లో ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న మనిషి పంపిన వస్తువులను అంతరిక్ష శిథిలాలుగా చెబుతారు.
నాసా అంచనా ప్రకారం అంతరిక్షం నుంచి ప్రతి రోజూ ఒక శిథిలం భూమిపై పడుతుంది. అది భూమిపై పడడమో, లేదంటే వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోవడమో జరుగుతుంటుంది.
అలాంటి శిథిలాలు ఎక్కువగా భూమిపైన నీళ్లున్న ప్రాంతాల్లో పడుతుంటాయి. ఎందుకంటే భూమిపై దాదాపు 70 శాతం నీళ్లే ఉన్నాయి. గత 50 ఏళ్లకు పైగా జరుగుతున్న అంతరిక్ష కార్యక్రమాల వల్ల పేరుకుపోయిన శిథిలాలు ఇప్పటికీ అంతరిక్షంలో భారీ సంఖ్యలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
శిథిలాలు పడితే ఏం జరుగుతుంది
అంతరిక్షం నుంచి శిథిలాలు భూమిపై పడిపోవడం వల్ల ఏదైనా నష్టం జరిగినట్టు నేను ఇప్పటివరకూ వినలేదు. భారత ఉపగ్రహం మైక్రోశాట్-ఆర్ శిథిలాలు పడిపోయినప్పుడు అవి భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే మండి బూడిదైపోయాయి.
ఒకప్పుడు చైనా స్పేస్ స్టేషన్ థియాంగాంగ్ భూమిని ఢీకొంటుందనే చర్చ జరిగింది. కానీ అది ఎలాంటి నష్టం కలిగించకుండానే సముద్రంలో కూలిపోయింది.
1979లో 75 టన్నులకు పైగా బరువున్న నాసా స్పేస్ సెంటర్ స్కైలాబ్ పడిపోయింది. అది భూమిపైకి వస్తోందని తెలిసి అప్పట్లో ప్రపంచమంతా వణికిపోయింది. కానీ అది కూడా సముద్రంలో పడిపోయింది.
భూ కక్ష్యలో తిరుగుతున్న చిన్న శిథిలాలు కిందికి రావు, పైకి కూడా పోవు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అవి అదే కక్ష్యలో తిరుగుతుంటాయి.

ఫొటో సోర్స్, CHINA MANNED SPACE AGENCY
స్పేస్ ల్యాబ్ ఊహాచిత్రం
ఈ శిథిలాల వల్ల అంతరిక్షయానానికి, ఉపగ్రహాలకు, స్పేస్ స్టేషన్లకు ముప్పు ఉంటుంది. గత 60 ఏళ్లలో ప్రపంచంలోని చాలా దేశాలు అంతరిక్ష కార్యక్రమాల జోరు పెంచడంతో, స్పేస్‌లో శిథిలాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
అంతరిక్షంలో సుమారు 18 వేల కృత్రిమ వస్తువులు ఉన్నట్టు 2016 జులైలో అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ చెప్పింది. వీటిలో కృత్రిమ ఉపగ్రహాల సంఖ్యే ఎక్కువ. ఇది పెద్ద శిథిలాల సంఖ్య మాత్రమే.
ఇక చిన్న చిన్న ముక్కల విషయానికి వస్తే 2013లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం అంతరిక్షంలో ఒకటి నుంచి 10 సెంటీమీటర్ల సైజు వరకూ ఉన్న శిథిలాల సంఖ్య 6,70,000కు పైగా ఉన్నాయి.
అంతరిక్షంలో ఏదైనా ఒక శిథిలం ఉంటే దానివల్ల కచ్చితంగా ముప్పు ఉంటుంది. అంతరిక్షంలో ఒకసారి రెండు ఉపగ్రహాలు గుద్దుకున్నాయి. దానివల్ల చాలా నష్టం జరిగింది. భారత్ కూడా ఉపగ్రహాలు లాంచ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు ఆ సమయాన్ని ముందుకు, వెనక్కు మారుస్తుంటుంది. అంటే అది వెళ్లే దారి(ట్రాజెక్ట్రీ)లో అడ్డుగా వచ్చే కణాల వల్లే అలా చేస్తారు.

నష్టం తగ్గించే ఉపాయం
అంతరిక్షంలో పంపించే ఉపగ్రహాల్లో 'ఎండ్ ఆఫ్ లైఫ్' కోసం ఆయా రాకెట్ లేదా ఉపగ్రహాలను డీఆర్బిట్ చేయగలిగేంత ఇంధనం నింపుతారు. అంటే దానిని కిందికి తీసుకొచ్చి గ్రేవ్‌యార్డ్(స్మశానం) ఆర్బిట్‌లో ఉంచడానికి, నష్టం తగ్గించడానికి వీలుగా అలా చేస్తారు.
భారత అంతరిక్షంలో శిథిలాలను 'మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్' ద్వారా ట్రాక్ చేస్తారు. ఈ రాడార్ శ్రీహరికోట దగ్గర ఉంది. అమెరికా దగ్గర ఇలాంటి ఎన్నో రాడార్లు ఉన్నాయి. అవి శిథిలాల గురించి బహిరంగ సూచనలు షేర్ చేస్తుంటాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయి
అంతరిక్షంలో ఉన్న శిథిలాలన్నింటినీ సేకరించడానికి కొన్ని ప్రయోగాలు కూడా చేశారు.
వీటిలో నెట్ లేదా హార్పూన్ సాయంతో ఎలాగోలా శిథిలాలను లాగి వాటిని డీఆర్బిట్ చేయడం ఒకటి. వాటిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చి మండించడానికి కూడా ప్రయోగాలు జరిగాయి.
కానీ అలా చేయడం వల్ల ఎంత ప్రభావం ఉంటుంది. ఈ ప్రయోగాలకు ఎంత వ్యయం అవుతుంది అనేదానిపై ఇప్పటివరకూ పూర్తి సమాచారం లేదు.
అమెరికా, రష్యా మొదట్లో ఇలాంటి ప్రయోగాలు చేసినపుడు వాటివల్ల అంతరిక్షంలో ఎంత చెత్త పేరుకుంటుంది అని ఆలోచించలేదు. భారత్ అలాంటి ప్రయోగాలను ఇటీవలే ప్రారంభించింది.
భారత్ 'అవుటర్ స్పేస్ ఒప్పందం'పై సంతకాలు కూడా చేసింది. అంతరిక్షంలోని చెత్తను వీలైనంత వరకూ తగ్గించడానికి భారత శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
భారత్ ఇన్-ఆర్బిట్ చెత్తలో 80 శిథిలాలే ఉన్నాయి. అదే అమెరికావి మాత్రం నాలుగు వేలకు పైనే ఉన్నాయి. ఇక చైనా శిథిలాల సంఖ్య మూడు వేలకు పైనే.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్: తిరుగులేని ఆధిపత్యం నుంచి ఉనికి కోసం పరుగు తీసే దశకు...
- మాయావతి: ‘పవన్ కల్యాణ్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి’
- టీఎన్ శేషన్: దేశ రాజకీయ నేతలే ఆయన బ్రేక్‌ఫాస్ట్
- స్వలింగ సంపర్కుడైన కుమారుడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?
- ఇలాంటి బస్సులో ఎప్పుడైనా ప్రయాణించారా
- గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది
- ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు
- 'అమెజాన్ బాస్ ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసింది...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)