గే సెక్స్ చేస్తే ఆ దేశంలో శిక్ష ఏమిటో తెలుసా?

  • 4 ఏప్రిల్ 2019
బ్రూనై సుల్తాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రూనై సుల్తాన్

బ్రూనైలో బుధవారం నుంచి స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం గే-సెక్స్‌ చేసినవారికి రాళ్లతో కొట్టి చంపాలనే శిక్ష విధిస్తారు.

దీనితోపాటూ ఇక్కడ వివిధ నేరాలకు దొంగతనం చేస్తే చేతులు నరికేయడం లాంటి కఠిన శిక్షలు అమలు చేసే నిబంధనలు ఉన్నాయి.

గే-సెక్స్ నేరం చేశానని ఎవరైనా స్వయంగా ఒప్పుకున్నా, లేదా అతడు అలా చేస్తున్నప్పుడు చూసిన వారు కనీసం నలుగురు సాక్ష్యం చెప్పినపుడు ఈ శిక్ష విధిస్తారు.

ఆగ్నేయాసియా దేశమైన బ్రూనైలో ఇస్లామిక్ చట్టాలపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హాలీవుడ్ ప్రముఖ నటుడు జార్జ్ క్లూనీతోపాటు చాలా మంది ప్రముఖులు బ్రూనై సుల్తాన్ విలాసవంతమైన హోటళ్లను బహిష్కరిచాలని పిలుపునిచ్చారు.

లండన్లో 'స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ ఆఫ్రికన్ స్టడీస్' విద్యార్థులు తమ స్కూలు భవనానికి ఉన్న 'బ్రూనై గ్యాలరీ' అనే పేరు తొలగించాలని డిమాండ్ చేశారు.

అపర కుబేరుడు బ్రూనై సుల్తాన్

బుధవారం బ్రూనై సుల్తాన్ ఒక బహిరంగ ప్రసంగంలో దేశంలో మరింత కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏఎఫ్‌పి సమాచార సంస్థ రిపోర్ట్ ప్రకారం సుల్తాన్ హసనల్ బోల్కియా "నేను ఈ దేశంలో ఇస్లామిక్ బోధనలు మరింత బలోపేతం కావడం చూడాలనుకుంటున్నాను" అన్నారు.

బ్రూనైలో స్వలింగ సంపర్కంను మొదటి నుంచీ నిరోధించారు.. దీనికి గరిష్టంగా పదేళ్ల శిక్ష విధించేవారు.

బ్రూనైలో ఉంటున్న గే సమాజం ఇలాంటి చట్టాలు, మధ్యయుగం నాటి శిక్షల విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పేరు బయటపెట్టని ఒక గే వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ "మీ పక్కింటి వారో, మీ కుటుంబమో, లేదా రోడ్డు పక్కన చేపలమ్ముకునే ఏ మహిళైనా మిమ్మల్ని ఒక మనిషిగా భావించినంత మాత్రాన, రాళ్లతో కొట్టి చంపేస్తారా. అది తలుచుకుంటే వణుకొస్తోంది" అన్నారు.

Image copyright Getty Images

సుసంపన్న దేశం బ్రూనై

బోర్నియా ద్వీపంలో ఉన్న బ్రూనైలో సుల్తాన్ హసనల్ పాలన నడుస్తోంది. చమురు, గ్యాస్ ఎగుమతులతో చాలా సంపన్నంగా ఆవిర్భవించింది.

72 ఏళ్ల సుల్తాన్ బ్రూనై ఇన్వెస్టిమెంట్ ఏజెన్సీ చీఫ్‌గా కూడా ఉన్నారు. ఈ ఏజెన్సీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ప్రపంచంలోని టాప్ హోటళ్లలో లండన్‌లోని డోర్‌చెస్టర్, లాస్ ఏంజిల్స్‌ బేవర్లీ హిల్స్ కూడా ఉన్నాయి.

బ్రూనైలో అధికార రాజవంశానికి అపార సంపద ఉంది. ఈ దేశంలో ఎక్కువగా ఉన్న మలై జనాభాకు ప్రభుత్వ సౌకర్యాలన్నీ లభిస్తాయి. వాళ్లు పన్నులు చెల్లించాల్సిన అవసర కూడా లేదు.

బుధవారం నుంచి షరియా కొత్త చట్టాలు అమలు

ఈ దేశంలోని 4 లక్షల 20 వేల జనాభాలో రెండు వంతులు ముస్లింలే ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బ్రూనై సుల్తాన్

బ్రూనై మరణశిక్షను కొనసాగిస్తోంది. కానీ 1957 నుంచీ ఎలాంటి మరణశిక్షలూ విధించలేదు.

ఈ దేశంలో మొదటిసారి 2014లో షరియా చట్టాలు అమలు చేశారు. అక్కడ ఇలాంటి రెండు చట్టాలు ఉంటాయి. ఒకటి షరియా అయితే, ఇంకొకటి సాధారణ చట్టం.

అప్పట్లో రాబోవు సంవత్సరాలలో కొత్త చట్టాలు పూర్తిగా అమలు చేస్తామని బ్రూనై సుల్తాన్ చెప్పారు.

మొదటి దశలో జరిమానా, జైలు శిక్ష ఉన్న నేరాలకు సంబంధించిన చట్టాలను 2014లో అమలు చేశారు.

ఆ తర్వాత బ్రూనై చివరి రెండు దశల చట్టాలు తీసుకొచ్చింది. ఇందులో చేతులు, కాళ్లు నరికేయడం, మరణ శిక్ష ఉన్నాయి. వీటిని అమలు చేయడం కాస్త ఆలస్యం అయ్యింది.

కానీ బ్రూనై ప్రభుత్వం శనివారం తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. అందులో షరియా పీనల్ కోడ్ బుధవారం నుంచి పూర్తిగా అమలు చేస్తున్నట్లు తెలిపింది.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ చట్టాలను విమర్శించడం మొదలైంది. ఈ శిక్షలను వెనక్కు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి.

Image copyright Getty Images

చట్టం ప్రకారం శిక్ష

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో బ్రూనైకు సంబంధించిన పరిశోధకులు షోవా హావర్డ్ బీబీసీతో "ఐదేళ్ల ముందు దీని గురించి చర్చ మొదలైనప్పుడు, ఈ సెక్షన్ల గురించి అందరూ విమర్శించారు" అన్నారు.

ఆయన బ్రూనై పీనల్ కోడ్‌లో చాలా దోషాలు ఉన్నాయని. అందులో ఉన్న ఎన్నో నిబంధనలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు.

ఐక్యరాజ్యసమితి కూడా ఈ చట్టం క్రూరమైనదని, అమానవీయమని చెప్పింది.

ఈ చట్టంలో రేప్, వ్యభిచారం, గే సెక్స్, దోపిడీ, దైవ నింద లాంటి నేరాలకు మరణ శిక్ష విధించే నిబంధనలు ఉన్నాయి.

లెస్బియన్ సెక్స్‌కు 40 బెత్తం దెబ్బలు లేదా పదేళ్ల జైలు శిక్ష ఉంది.

భ్రూణ హత్యకు బహిరంగంగా కొట్టే శిక్ష కూడా ఇందులో ఉంది. అయితే దొంగతనం చేస్తే మాత్రం చేతులు నరికేయాలని నిబంధనలు రూపొందించారు.

వీటితోపాటు కొత్త చట్టంలో మైనర్ ముస్లిం పిల్లలను ఇస్లాం వదిలి వేరే మతం తీసుకునేలా ప్రేరేపించడం కూడా నేరమేనని చెప్పారు.

ఈ చట్టం సాధారణంగా ముస్లింలకు అమలవుతుంది. అయితే కొన్ని విషయాల్లో ముస్లిమేతరులు కూడా దీని పరిధిలోకి వస్తారు.

Image copyright Getty Images

కొత్త చట్టాలపై బ్రూనైలో స్పందన

కెనెడాలో శరణార్థిగా ఉన్న బ్రూనైకి చెందిన ఒక 40 ఏళ్ల వ్యక్తి "బ్రూనైలో కొత్త చట్టాల ప్రభావం అప్పుడే కనిపిస్తోంది" అన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టిన ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కుని గత ఏడాది బ్రూనై వదిలి వెళ్లిపోయారు.

ఆయన జనం భయపడిపోయి ఉన్నారని చెప్పారు.

షఖిరన్ ఎస్ అన్సారీ బీబీసీతో మాట్లాడుతూ "బ్రూనైలోని గే కమ్యూనిటీ మొదట గోప్యత పాటించేవారు. కానీ గ్రిండర్ అనే ఒక డేటింగ్ యాప్ వచ్చాక అది ఒకరికొకరు రహస్యంగా కలిసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు దీన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించడం లేదని తెలిసింది" అన్నారు.

ఎవరైనా పోలీసులకు చెబుతారేమోనని వాళ్లు భయపడిపోయున్నారు. ఇప్పటివరకు అలా ఏం జరగలేదు. కానీ కొత్త చట్టం వల్ల జనం భయపడిపోతున్నారు. అన్నారు.

బ్రూనైలో గే కాని మరో వ్యక్తి ఉన్నారు. కానీ ఆయన ఇస్లాంను విశ్వసించరు. చట్టం అమలవడం గురించి తనకు భయంగా ఉందని చెప్పారు.

23 ఏళ్ల ఆ యువకుడు "మేం సామాన్యులం, షరియా చట్టం అమలు కాకుండా ఎలా అడ్డుకోగలం. మతం వదిలినందుకు షరియా చట్టం ప్రకారం నేను మరణ శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు."

మరో గే వ్యక్తి ఈ చట్టం సమగ్రంగా అమలు కాకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

"నిజాయితీగా చెప్పాలంటే నాకంత భయం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తరచూ కఠిన శిక్షల పేరుతో భయపెడుతూ ఉంటుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఘటనలు ఒకటి, రెండు జరిగినా, ప్రభుత్వం శిక్షను అమలు చేయవచ్చు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)