చంద్రబాబు, కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలు ఇప్పుడెలా ఉన్నాయి?

  • 9 ఏప్రిల్ 2019
రెండు వేర్వేరు గ్రామాలు

నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పెదలబుడు గ్రామ పంచాయతీని దత్తత తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను దత్తత తీసుకున్నారు.

ముఖ్యమంత్రులు దత్తత తీసుకోవడంతో ఈ ఊర్ల పేర్లు వార్తల్లో మార్మోగాయి. గ్రామాలకు ప్రాచుర్యం దక్కింది. మరి ప్రయోజనం మాటేమిటి? అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయా? అక్కడి ప్రజల కష్టాలు తీరిపోయాయా? బీబీసీ పరిశీలనలో వెల్లడైన అంశాలివీ...

పెదలబుడు- ఈ ఊరు పేరు బయటివారికి పెద్దగా తెలియదు. అయితే పర్యాటక ప్రాంతంగా బాగా ప్రాచుర్యం పొందిన అరకు లోయ.. పెదలబుడు గ్రామ పంచాయతీలో ఓ భాగం.

పంచాయతీకి వచ్చే నిధుల్లో సింహభాగాన్ని అధికారులు అరకుపైనే వెచ్చించేవారు. దాంతో పెదలబుడు అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తాగు నీరు కావాలంటే గ్రామస్థులు ఊరి చివరన ఉన్న కుంటకు కాలినడకన వెళ్లి తెచ్చుకునేవారు.

Image copyright facebook.com/pg/TDP.Official

చాలా మార్పు వచ్చింది

ఊళ్లో కూలేందుకు సిద్ధంగా ఉండే పూరిళ్లు దర్శనమిచ్చేవి. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం సాగేది. దీంతో చాలా కుటుంబాల ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. చదువుకున్న యువత ఉపాధి దొరకక ఇబ్బందులు పడేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ పెదలబుడు పంచాయితీని దత్తత తీసుకుంటున్నట్లు నాలుగేళ్ల క్రితం చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ తరువాత ఆ గ్రామంలో చాలా మార్పులు వచ్చాయి.

ఇప్పుడు ఎటువైపు చూసినా గ్రామంలో డాబా ఇళ్లే కనిపిస్తున్నాయి.

కొత్తగా 74 కొత్త గృహాలను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికీ నల్లాను పక్కాగా ప్రభుత్వం కట్టించినట్లు పేర్కొన్నారు. వీటి కోసం రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా నిర్మించినట్లు వివరించారు.

చిత్రం శీర్షిక గతంలో తమ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేది కాదని, ఇప్పుడు ఓ సర్వీసు నడుస్తోందని పెదలబుడు గ్రామ ప్రజలు చెప్పారు.

'బస్సు వస్తోంది'

చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్న తర్వాత తమ ఊరి పరిస్థితులు బాగా మారిపోయాయని గ్రామస్థురాలు సీతమ్మ బీబీసీతో చెప్పారు.

గతంలో తమ ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేది కాదని, ఇప్పుడు ఓ సర్వీసు నడుస్తోందని అన్నారు. సర్వీసులను ఇంకా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

గ్రామంలోని ప్రతి మూలకూ ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చాయని, వీధిదీపాలు ఏర్పాటయ్యయాని గ్రామస్థుడు కృపానందం తెలిపారు.

ఎవరి కుటుంబంలోనైనా జరిగే కార్యాలను నిర్వహించుకునేందుకు సామాజిక భవనం అందుబాటులోకి వచ్చిందని, గ్రంథాలయాన్ని కూడా నెలకొల్పారని వివరించారు. పర్యాటకుల కోసం ఒక కాటేజీని తమ గ్రామంలోనే నిర్మిస్తున్నారని, ఫలితంగా కొంతమంది గ్రామస్థులకు ఉపాధి లభిస్తోందని అన్నారు. మరిన్ని అవకాశాలు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర పథకాలను సమర్థంగా అమలు చేసినట్లు అధికారులు చెప్పారు. గృహనిర్మాణం, సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం, భవనాల నిర్మాణం అలానే సాధ్యమైందని వారు వెల్లడించారు.

అరకు ఎంపీడీవో సురేశ్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాల ప్రకారం పెదలబుడు గ్రామంలో 74 గృహాలను నిర్మించారు. గ్రంథాలయానికి రూ.10 లక్షలు, సామాజిక భవనానికి రూ.10 లక్షలు, అంగన్వాడి భవనానికి రూ.10లక్షలు, సీసీ రోడ్లకు రూ.20లక్షలు ఖర్చు చేశారు. నల్లా కనెక్షన్‌లు ఇచ్చేందుకు రూ.15లక్షలు వెచ్చించారు.

గిరిజన పథకాలు, వ్యవసాయ, ఉద్యాన పథకాల ద్వారా సాగులో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెప్పారు.

బ్రకోలి, స్ట్రాబెర్రీ వంటి వినూత్నమైన పంటల సాగువైపు రైతులను మళ్లించేందుకు కృషి చేసినట్లు వివరించారు. కొంత మేర వాటిని సాగులోకి తీసుకురాగలిగామని పేర్కొన్నారు.

డ్రిప్ ఇరిగేషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం, కొండ ప్రాంతం కాబట్టి అందుకు అనువైన విధంగా సాగు పద్ధతులను మార్చుకోవడంపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు.

సీఎం స్వయంగా గ్రామాన్ని సందర్శించి ఎన్‌టీఆర్ గృహాలు, తాగునీటి సౌకర్యం కల్పించడంలో చొరవ తీసుకున్నారని గ్రామ సర్పంచ్ గులాబి బీబీసీకి తెలిపారు. గ్రంథాలయం, సామాజిక భవనం వంటివి వెంటనే మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారని అన్నారు.

'ఇంకా జరగాలి'

పెదలబుడు గ్రామం ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు కూడా బీబీసీతో మాట్లాడారు.

ప్రారంభమైన అభివృద్ధి పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని గ్రామస్థుడు సంజయ్ చెప్పారు.

గ్రంథాలయం నిర్మించినా అందులో పుస్తకాలు లేవని, కేవలం వార్తా పత్రికలు మాత్రమే వస్తున్నాయని అన్నారు. పీహెచ్‌సీ ఉపకేంద్రం ఏర్పాటైనా అందులో ఎవరూ అందుబాటులో ఉండట్లేదని తెలిపారు.

మురుగు కాల్వలు కూడా నిర్మించాల్సి ఉందని, సీసీ రోడ్లు గ్రామ శివార్ల దాకా రాలేదని అన్నారు. గృహాలు అందరికీ మంజూరు చేసినా, తమకు అనుకూలంగా లేనివారికి బిల్లుల చెల్లింపు నిలిపివేశారని ఆరోపించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: చంద్రబాబు, కేసీఆర్ దత్తత గ్రామాలు ఇప్పుడెలా ఉన్నాయి

దేనికెంత ఖర్చు చేశారు?

పెదలబుడు గ్రామ పంచాయతీలో మొత్తం 470 గృహాల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ. 2.5 లక్షల చొప్పున ప్రభుత్వం గ్రాంటు అందించింది. పంచాయతీ మొత్తానికిగాను ఎన్టీయార్ ఇళ్ల నిర్మాణం కోసం రూ.11.75 లక్షలు ఖర్చు చేశారు.

ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కోసం పనిరంగిని గ్రామంలో రూ.9 లక్షలు, మినసంగూడలో రూ.5 లక్షలు, నిజనిగూడలో రూ.90 వేలు, రావలగూడలో రూ.50 వేలు, గంజాయిగూడలో రూ.80 వేలు, సరపగూడలో రూ.5 లక్షలు, కంటబన్సుగూడలో రూ.9 లక్షలు, తంగులగూడలో రూ.5 లక్షలు, గరుడగూడలో రూ.5 లక్షలు, అరకు లోయలో రూ.20 లక్షలు, గొల్లిగూడలో రూ.5 లక్షలు, సిమిలిగూడలో రూ.4.5 లక్షలు వెచ్చించారు.

సీసీ రోడ్ల కోసం సరపగూడలో రూ.9 లక్షలు, తంగులగూడలో రూ.5.98 లక్షలు, అరకు లోయలో రూ.37 లక్షలు, కంటబన్సుగూడలో రూ.20 లక్షలు, గంజాయివలసలో రూ.8 లక్షలు, బస్సు సెల్టర్ల నిర్మాణం కోసం అరకు వ్యాలీలో రూ.6 లక్షలు ఖర్చు చేశారు.

ఆరు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.10 లక్షలు, రంగులకు ఒక్కో భవంతికి రూ.35 వేల చొప్పున మొత్తం రూ 62.1 లక్షలు, ఎంపీడీవో కార్యాలయం ఆధునికీకరణకు రూ.5 లక్షలు, గ్రామాల అనుసంధానానికి రహదారుల కోసం రూ.82 లక్షలు, అరుకు లోయ డంపింగ్ యార్డ్ ప్రహరీకి రూ.3.6 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి అభివ‌ద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశారు.

వ్యవసాయ, ఉద్యాన పంటలకు వర్తించే అన్ని కేంద్ర, రాష్ట్ర పథకాలను సమగ్రంగా అమలు చేసినట్లు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.

ఎర్రవెల్లి: పునర్నిర్మాణం

కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి ఆయన ఫాంహౌస్ ఉన్న గ్రామమే. ఒకప్పడు ఎర్రవల్లి గ్రామ సందుల్లో సైకిల్ వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉండేది. వ్యవసాయ బావుల నుంచి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. నాలుగైదు మినహా ఊరంతా పూరిళ్లు లేదా పెంకుటిళ్లు ఉండేవి.

చిత్రం శీర్షిక కేసీఆర్ దత్తత తీసుకొని పునర్నిర్మించిన గ్రామం

నాలుగేళ్ల కాలంలో ఆ ఊరు పూర్తిగా మారిపోయింది. గ్రామాన్ని పునర్నిర్మించారు. ఊరిలో ఉన్న అన్ని ఇళ్లూ ఖాళీ చేయించి, అందరికీ ఒకేలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వమే కట్టి ఇచ్చింది. నిర్మాణ పనులు జరిగిన రెండేళ్లు ఊరి చివర తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఆశ్రయం కల్పించారు.

గతంలో ఎవరి ఇల్లు ఎలా ఉందన్నదానితో సంబంధం లేకుండా అందరికీ ఒకే నమూనాలో, ఒకే రకమైన స్థలంలో గృహనిర్మాణం చేపట్టారు. ఇద్దరు ముగ్గురు మినహా గ్రామ ప్రజలంతా ఈ విధానానికి సుముఖత తెలపడంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు.

Image copyright Twitter/Telangana CMO

సౌర విద్యుత్

విద్యుత్తు వాడకంలో గ్రామానికి స్వావలంబన ఉండాలని ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ వ్యవస్థను రాయితీ ద్వారా ప్రభుత్వమే ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. మొత్తం 440 ఇళ్లకు దీనిని బిగించినట్లు తెలిపారు. చాలా కుటుంబాలకు విద్యుత్ బిల్లు రూ.100 కూడా దాటట్లేదని వివరించారు.

సాధారణంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చే నీటిని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా అందిస్తుంటారు. ఎర్రవల్లిలో మాత్రం ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా అందించే నీరు నేరుగా ఇళ్ల డాబాలపై ఉండే నీటి ట్యాంకులకు చేరేలా ప్రత్యేక ఏర్పాటు చేసింది.

గ్రామంలో మొత్తం 414 గృహాల నిర్మాణం చేపట్టారని సర్పంచ్ భాగ్యలక్ష్మి బీబీసీకి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ పథకం ద్వారా రూ.5.04 లక్షల చొప్పున వ్యయంతో 390 గృహాలు, రూ.2.5 లక్షల చొప్పున వ్యయంతో 24 సింగిల్ బెడ్ రూమ్ గృహాలు నిర్మించినట్లు వెల్లడించారు.

సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఒక్కో ఇంటికి రూ.1.57 లక్షల వ్యయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఖర్చులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.90 వేలు కాగా, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) నిధుల కింద బీహెచ్ఈఎల్ రూ.61 వేలు, లబ్ధిదారుడు రూ. 7200 భరించినట్లు వివరించారు.

బిందు సేద్యం

రైతుల ఆదాయం పెంచేందుకు ఆధునిక పద్ధతుల్లో సాగుకు కావాల్సిన సహకారం ప్రభుత్వం తరపున అందించినట్లు అధికారులు తెలిపారు. శాశ్వత విధానంలో 1800 ఎకరాలకు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) వ్యవస్థను పెట్టినట్లు చెప్పారు.

అందరి రైతులతో ఒకేరకమైన పంట సాగు చేయించేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రయత్నించినట్లు వారు పేర్కొన్నారు.

పెట్టుబడి, పంట అమ్మకం విషయాల్లో తమకు ఎలాంటి ఇబ్బందులూ లేవని ఎర్రవల్లి రైతు బ్రహ్మచారి బీబీసీకి చెప్పారు. గతంలో సోయా వేయమని అధికారులు చెప్పారని, వారే బ్యాంకులతో మాట్లాడి పెట్టుబడి వచ్చేలా చేశారని తెలిపారు.

భూమి లేని కుటుంబాలకు ఉపాధి పొందేందుకు పాడి గేదెలు, కోళ్లు, రాయితీపై ట్రాక్టర్లను ప్రభుత్వం ఇచ్చినట్లు సర్పంచ్ భాగ్యలక్ష్మి చెప్పారు. 354 మంది పాడిరైతులకు గేదెల పంపిణీ కోసం రూ.1.23 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.

బిందు సేద్యం కోసం రూ.48 కోట్లు, 12 కి.మీ.ల మేర సీసీ రోడ్లకు రూ.6 కోట్లు, 12 కి.మీ.ల మేర డ్రైనేజీ నిర్మాణానికి రూ.6 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్లు, ఫంక్షన్ హాల్ కోసం రూ.2 కోట్లు, గోదాము నిర్మాణం కోసం రూ.కోటి ఖర్చు చేసినట్లు సర్పంచ్ చెప్పారు.

ఉపాధి కల్పన కోసం గ్రామానికి కుటీర పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని ఆమె తెలిపారు.

ప్రతి శుక్రవారమూ ఒక కార్పొరేట్ ఆసుపత్రి తమ గ్రామంలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తోందని బ్రహ్మచారి తెలిపారు. ఒక్కో వారం ఒక్కో స్పెషలిస్టు వైద్యులు వస్తారని, ఫలితంగా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన బాధ తమకు తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.

చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉపాధి కూడా చూపించాలని గ్రామానికి చెందిన పోశవ్వ ప్రభుత్వాన్ని కోరారు.

నర్సన్నపేటలో రోడ్ల నిర్మాణానికి రూ.36.1 కోట్లు

కేసీఆర్ దత్తత తీసుకున్న మరో గ్రామం నర్సన్నపేటలో రోడ్ల కోసం రూ. 36.1 కోట్లు, సీసీ రోడ్లు, వాటికి అనుబంధంగా మురికికాలువల కోసం రూ.25 లక్షలు, హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు, అంగడిక్రిష్టాపూర్ నుంచి మల్లన్నగూడెం మీదుగా నర్సన్నపేటకు రహదారి నిర్మానికి రూ.88 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షల చొప్పున మొత్తం 215 గృహాల కోసం రూ.10.83 లక్షలు ఖర్చుచేశారు.

గ్రామంలో వైకుంఠ థామం నిర్మాణం కోసం రూ.20 లక్షలు, సామాజిక భవనం కోసం రూ.10 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఖర్చు చేశారు.

ఎర్రవల్లి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి రూ.10 లక్షలు, మహిళా సమాఖ్య నిర్మాణానికి రూ.22 లక్షలు, గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం నిమిత్తం రూ.19.95 లక్షలు, చెరువులు లేదా కుంటల మరమ్మతులు, పూడికతీత కోసం ఎర్రకుంటకు రూ.2.18 కోట్లు, లింగరాజు కుంట కోసం రూ.1.32 కోట్లు, మసిరెడ్డి కుంట కోసం రూ.1.47 కోట్లు, నల్లకుంటకు రూ.1.61 కోట్లు, నల్లచెరువు కోసం రూ.28.4 లక్షలు, ఎక్కకుంట కోసం రూ.13.63 లక్షలు, బ్రహ్మండ్ల కుంటకు రూ.12.1 లక్షలు, పాండురంగ సాగర్ పునరుద్ధరణ కోసం రూ.8.1 కోట్లు, గౌరారం నుంచి పాములపర్ది మీదుగా వర్దరాజుపూర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.17 కోట్లు ఖర్చు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)