‘వైమానిక దాడి జరిగిన’ బాలాకోట్ ఇలా ఉంది : BBC Exclusive

‘వైమానిక దాడి జరిగిన’ బాలాకోట్ ఇలా ఉంది : BBC Exclusive
bbc

పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మిలిటెంట్ శిబిరాన్ని ధ్వంసం చేశామని భారత్ చెబుతున్న ప్రాంతానికి బీబీసీ ప్రతినిధి ఉస్మాన్ జహీద్ వెళ్లారు.

పాకిస్తాన్ సైన్యం పలువురు పాత్రికేయులను అక్కడకు తీసుకెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ఏముందో, తాను ఏం చూశారో బీబీసీ ప్రతినిధి జహీద్ వివరించారు.

ఆయన మాటను, అక్కడి దృశ్యాలను కింది వీడియోలో చూడొచ్చు.

''నేను బాలాకోట్‌లో జావా టాప్ వద్ద ఉన్నాను. బాలాకోట్‌లో దాడి చేసినట్లు భారత్ చెబుతున్న మదర్సా ఇది. (భారత్ ఇక్కడున్న మిలిటెంట్ శిబిరాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది). నేనిప్పుడు ఆ మదర్సా దగ్గరకు వెళ్తున్నాను'' అని జహీద్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

మదర్సా వద్దకు నడిచి వెళ్తున్న పాత్రికేయులు

దాదాపు గంటన్నర పాటు నడిచి అక్కడకు చేరుకున్నానని తెలిపారు.

మదర్సా ముందు భాగం ఫుట్ బాల్ మైదానంలాగా విశాలంగా ఉందని ఆయన తెలిపారు. అది పిల్లలు ఆడుకునే ప్రదేశం కావొచ్చని వివరించారు. ఆ మదర్సా భవనం మసీదులా ఉందని చెప్పారు.

లోపల పిల్లలు.. తనతో పాటు పాటు వచ్చిన పాత్రికేయులు ఉన్నట్లు తెలిపారు.

ఇది పర్వతాల మధ్య ఉన్న ప్రాంతమని తమను ఆర్మీ ఇక్కడకు తీసుకొచ్చి చూపిస్తోందని వివరించారు.

మదర్సా లోపల మసీదు ఉందని.. ఆ మసీదు లోపల దాదాపు 150 మంది పిల్లలు ఖురాన్ చదువుతూ కనిపించారని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా పాక్ సైనికులు కూడా తమతో ఉన్నారని చెప్పారు.

ఇది పాకిస్తాన్‌లోని ఖైబర్ పంక్తుంఖ్వా రాష్ట్రంలో ఉంది.

ఇక్కడి మిలిటెంట్ శిబిరంపై దాడి చేసి 'ఉగ్రవాదులను' హతమార్చామని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ మాత్రం భారత వైమానిక దాడుల్లో ఇక్కడ ఎవరూ చనిపోలేదని పేర్కొంది. ఇక్కడున్న మదర్సా ధ్వంసం కాలేదని తెలిపింది.

మరి ఇంతకు ముందే ఎందుకు తీసుకెళ్లలేదు?

ఇక్కడ దాడి జరిగినట్లు చెప్పిన మరునాడే పాత్రికేయులను అక్కడకు తీసుకెళ్తామని పాకిస్తాన్ చెప్పింది. కానీ, అప్పుడు తీసుకెళ్లలేదు. అక్కడికి పాత్రికేయులు వెళ్లేందుకు కూడా అనుమతించలేదు.

43 రోజుల తర్వాత ఈ రోజు ఇస్లామాబాద్‌లో ఉన్న విదేశీ పాత్రికేయులను, కొందరు విదేశీ దౌత్యాధికారులను అక్కడకు తీసుకెళ్లింది.

ఈ పర్యటనకు ఇంత సమయం ఎందుకు పట్టిందని మా ప్రతినిధి పాక్ అధికారులను ప్రశ్నించగా, వాళ్లు అప్పుడు పరిస్థితులు అనువుగా లేవని చెప్పారు. ఇప్పుడు పాత్రికేయులకు అవకాశం కల్పించామని చెప్పారు.

మరోవైపు గతంలో ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నించిన స్థానిక జర్నలిస్టులు, రాయిటర్స్ బృందాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారని వార్తలొచ్చాయి. దీన్ని పాక్ ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఇక్కడ ఫిబ్రవరి 27 నుంచి 14 మార్చి వరకు మదర్సా మూతబడినట్లు ఓ ప్రకటన బోర్డు ఉంది. దాని గురించి మా విలేఖరి అక్కడున్న ఓ విద్యార్థితో, ఉపాధ్యాయుడితో మాట్లాడినప్పుడు..

దాడి జరిగినపుడు అత్యవసర చర్యల్లో భాగంగా మదర్సాను మూసేశారని చెప్పారు. ఇప్పటికీ దాన్ని మూసే ఉంచారని వివరించారు.

మూసేస్తే మరి ఇంత మంది పిల్లలు ఎందుకున్నారు? అని ప్రశ్నించగా.. వారంతా స్థానిక విద్యార్థులని చెప్పారు.

మొదట స్థానికులతో మాట్లాడేందుకు అనుమతించినప్పటికీ ఎక్కువ సేపు మాట్లాడనివ్వకుండా అధికారులు అడ్డుకున్నట్టు మా విలేఖరి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)