అమెరికన్ ఉయ్యాల భద్రమేనా? 50 లక్షల బేబీ స్లీపర్స్‌ను వెనక్కు తీసుకున్న ఫిషర్-ప్రైస్ సంస్థ

  • 13 ఏప్రిల్ 2019
ఫిషర్-ప్రైస్ 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాల Image copyright US Consumer Product Safety Commission

పసిబిడ్డ ఉన్న ప్రతి ఇంట్లో కనిపించే వస్తువు ఉయ్యాల. పాపో, బాబో.. అందులో ఆదమరిచి నిద్రపోతుంటే, తల్లిదండ్రులు నిశ్చింతగా పనుల్లో మునిగిపోతారు.

కానీ, ఆ ఉయ్యాల ఎంపికలో ఏమరపాటు అందులో నిద్రించే పసి ప్రాణాన్నే బలి తీసుకోవచ్చు.

అమెరికన్ ఆట బొమ్మల తయారీ సంస్థ ఫిషర్-ప్రైస్ తాము తయారుచేసిన దాదాపు 50 లక్షల ఉయ్యాలలను ఇప్పుడు వెనక్కు తీసుకుంది.

అమెరికా వినియోగదారులు, ఉత్పత్తుల భద్రత కమిషన్ (సీపీఎస్‌సీ) ఈ విషయాన్ని వెల్లడించింది. 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాళ్లలో ఇప్పటివరకూ 30 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు సీపీఎస్‌సీ పేర్కొంది.

తమ ఉత్పత్తులు భద్రమైనవేనని, అయితే స్వచ్ఛందంగా సదరు ఉయ్యాళ్లను వెనక్కితీసుకునేందుకు సిద్ధమయ్యామని ఫిషర్-ప్రైస్ యాజమాన్య సంస్థ మాటెల్ వెల్లడించింది.

2009 నుంచి ఇప్పటి వరకూ ఉయ్యాల్లో పక్కకు దొర్లడం, బోర్లా పడుకోవడం వల్ల పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తాము గుర్తించామని సీపీఎస్‌సీ తెలిపింది. వారంతా మూడు నెలలు పైబడిన చిన్నారులని వివరించింది.

చిన్నారుల వయసు మూడు నెలలు దాటినా, వారు దొర్లడం మొదలుపెట్టినా 'రాక్ అండ్ ప్లే' ఉయ్యాలను వాడొద్దని ఆ ఉత్పత్తికి సంబంధించి ఫిషర్-ప్రైస్ చేసిన జాగ్రత్తలు, సూచనల్లో ఉంది.

''మేం జాగ్రత్తలు, సూచనలు చేసినప్పటికీ దుర్ఘటనలు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. సీపీఎస్‌సీ భాగస్వామ్యంతో కలిసి ఆ ఉయ్యాళ్లను వెనక్కితీసుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చాం'' అని ఫిషర్-ప్రైస్ వెల్లడించింది.

దాదాపు 47 లక్షల ఉత్పత్తులపై ఈ రీకాల్ ప్రభావం ఉండొచ్చని సీపీఎస్‌సీ అంచనా వేసింది.

'రాక్ అండ్ ప్లే' ఉయ్యాళ్ల వాడకాన్ని వెంటనే ఆపివేసి, వాపస్ డబ్బుల కోసం ఫిషర్-ప్రైస్‌ను సంప్రదించాలని వినియోగదారులకు సూచించింది.

ఈ ఉత్పత్తులను ప్రాణాంతకమైనవిగా వర్ణిస్తూ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఏఏపీ) వీటి రీకాల్ కోసం ఇదివరకు డిమాండ్ చేసింది.

''దుకాణాల్లో అమ్ముతున్నారంటే భద్రమైన వస్తువే అని జనాలు అనుకోవచ్చు. దురదృష్టవశాత్తు అది అన్ని వేళలా నిజం కాదు'' అని ఏఏపీ అధ్యక్షుడు కైల్ యాసుడా అన్నారు.

రాక్ అండ్ ప్లే ఉయ్యాళ్లు వాలుగా ఉంటాయి. వాటిలో పక్కకు దొర్లినప్పడు, బోర్లా పడుకున్నప్పుడు చిన్నారులకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందని, ఇదే మరణాలకు కారణం అవుతోందని పలు నివేదికల్లో తేలినట్లు ఏఏపీ వెబ్‌సైట్ పేర్కొంది.

చిన్నారులను నిద్ర పుచ్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు

  • చిన్నారులను ఎప్పుడూ వెల్లకిలా పడుకోబెట్టాలి
  • ఉయ్యాల అడుగు భాగం వరకూ కాళ్లు ఉండేలా చూడాలి
  • చేతులు బయటకు ఉండేలా దుప్పటి కప్పాలి.
  • వాతావరణం మరీ చల్లగా, మరీ వెచ్చగా లేకుండా చూడాలి
  • తలపై ఏమీ కప్పకూడదు

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)