'రఫేల్‌'లో మరో వివాదం: అనిల్ అంబానీకి రూ.1100 కోట్ల ఫ్రాన్స్ పన్నుల మాఫీ

  • 13 ఏప్రిల్ 2019
అనిల్ అంబానీ Image copyright Getty Images

రఫేల్ ఒప్పందం విషయంలో రిలయన్స్ కమ్యునికేషన్స్ సంస్థ అధినేత అనిల్ అంబానీ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

అనిల్ సంస్థకు 2015 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకూ ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు రూ.1100 కోట్ల పన్ను మినహాయింపును ఇచ్చిందని ఫ్రాన్స్‌కు చెందిన ఓ పత్రిక తాజాగా కథనం ప్రచురించింది.

అయితే ఈ వ్యవహారంలో పక్షపాతపూరితమైన అంశమేదీ లేదని, తాము ఎలాంటి ప్రయోజనమూ పొందలేదని రిలయన్స్ కమ్యునికేషన్స్ వివరణ ఇచ్చింది.

పన్నులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తాము ఫ్రాన్స్ చట్టాల ప్రకారం పరిష్కరించుకున్నామని ప్రకటించింది.

కొత్త ఆరోపణలేంటి?

ఫ్రాన్స్ పత్రిక కథనం ప్రకారం 'రిలయన్స్ ఫ్లాగ్ అట్లాంటిక్ ఫ్రాన్స్' (ఆర్ఎఫ్ఏఎఫ్) అనే సంస్థ నుంచి వసూలు చేయాల్సిన 14.37 కోట్ల యూరోల (దాదాపు రూ.1100 కోట్ల) పన్నును అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ పన్ను మినహాయింపునకు కొన్ని నెలల ముందే, ఫ్రాన్స్ సంస్థ దసో ఏవియేషన్‌ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు చేసే ప్రణాళిక గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఆ కథనం పేర్కొంది.

ఆర్ఎఫ్ఏఎఫ్ ఓ ఫ్రాన్స్ సంస్థ అని, రిలయన్స్ కమ్యునికేషన్స్ దీని యజమాని అని తెలిపింది.

భారత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రఫేల్ ఒప్పందంలో అవతకవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు అరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాన మంత్రి మోదీపైనే అవినీతి ఆరోపణలు చేశారు.

Image copyright Getty Images

రిపోర్టర్ ట్వీట్లు

ఫ్రాన్స్ పత్రిక కథనానికి సంబంధించిన సమాచారాన్ని జులియన్ బోసూ అనే ఓ రిపోర్టర్ వరుస ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

'రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్' పేరుతో అనిల్ అంబానీ ఫ్రాన్స్‌లో టెలికాం సంస్థను రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు.

''అనిల్ సంస్థపై ఫ్రాన్స్ పన్ను అధికారులు విచారణ జరిపి, ఆ సంస్థ 2007 నుంచి 2010 మధ్య 60 మిలియన్ల యూరోల పన్ను చెల్లించాల్సి ఉందని గుర్తించారు'' అని పేర్కొన్నారు.

''7.6 మిలియన్ల యూరోలను చెల్లిస్తామని రిలయన్స్ ప్రతిపాదించింది. ఫ్రాన్స్ పన్ను విభాగం దాన్ని తిరస్కరించింది. మరో విచారణ జరిపి, 2010 నుంచి 2012 మధ్య చెల్లించాల్సిన మరో 91 మిలియన్ల యూరోలను అడిగింది'' అని తెలిపారు.

''2015 ఏప్రిల్‌లో ప్రధాని మోదీ.. దసో నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసే ప్రణాళికలను ప్రకటించారు. అప్పటికీ రిలయన్స్ ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం 151 మిలియన్ యూరోలు'' అని పేర్కొన్నారు.

''మోదీ రఫేల్ ప్రకటన తర్వాత ఆరు నెలలకు 151 మిలియన్ల యూరోలకు బదులుగా రిలయన్స్ ఇస్తామని ప్రతిపాదించిన 7.3 మిలియన్ల యూరోలను స్వీకరించేందుకు ఫ్రాన్స్ పన్ను విభాగం సమ్మతించింది'' అని వివరించారు.

''రఫేల్‌పై ఫ్రాన్స్, భారత్ చర్చలు సాగుతుండగా 2015 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకూ అనిల్ 14.37 కోట్ల యూరోల పన్ను మినహాయింపును పొందారు. ఎంత సౌకర్యవంతమైన ఒప్పందమో, కదా?'' అని వ్యాఖ్యానించారు.

ఈ సమాచారం సేకరించడానికి తనకు కొన్ని నెలలు పట్టిందని జులియన్ తెలిపారు.

ప్రతి పదమూ ముఖ్యమైనందునే అనువాద దోషాలు చేయకూడదని ఈ కథనాన్ని తాము ఇంగ్లిష్‌లో ఇవ్వలేదని అన్నారు.

Image copyright Getty Images

'చట్ట ప్రకారమే సర్దుబాటు'

ఫ్రాన్స్ పత్రిక కథనం తర్వాత రిలయన్స్ కమ్యునికేషన్స్ స్పందిస్తూ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసింది.

ఆర్ఎఫ్ఏఎఫ్ పన్నుల వ్యవహారం పదేళ్ల కిందటి విషయమని, ఆ పన్నులు న్యాయవిరుద్ధమైనవని తమ సంస్థ స్పష్టం చేసిందని తెలిపింది.

అప్పుడు జరిగిన సర్దుబాటులో పక్షపాతపూరిత అంశాలేవీ లేవని, తాము ఎలాంటి ప్రయోజనమూ పొందలేదని పేర్కొంది. ఫ్రాన్స్ చట్టాల ప్రకారమే ఆ సర్దుబాటు జరిగినట్లు వివరించింది.

ఆర్ఎఫ్ఏఎఫ్ రిలయన్స్ కమ్యునికేషన్స్‌కు సహాయ సంస్థ అని, ఆ సంస్థకు సొంతంగా నెట్‌వర్క్, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్ట్చర్ మాత్రమే ఉన్నాయని పేర్కొంది.

ఫ్రాన్స్ పన్నుల విభాగం విచారణ జరిపిన 2008- 2012 మధ్య కాలంలో ఆర్ఎఫ్ఏఎఫ్ రూ.20 కోట్ల నష్టంలో ఉందని తెలిపింది.

ఫ్రాన్స్ పన్నుల విభాగం అప్పుడు రూ.1100 కోట్ల పన్నులు చెల్లించాలని కోరిందని, కానీ నిబంధనలను అనుసరించి ఇరు పక్షాలు రూ.56 కోట్ల చెల్లింపుపై అంగీకారానికి వచ్చాయని వెల్లడించింది.

మరోసారి విపక్షాల దాడి

ఫ్రాన్స్ కథనం వెల్లడించిన కొత్త సమాచారంతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మరోసారి విమర్శల దాడి మొదలుపెట్టాయి.

అనిల్ అంబానీకి డబ్బులు మిగిల్చేందుకే ప్రధాని మోదీ రఫేల్ విమానాలకు అధిక ధర చెల్లిస్తున్నారని తాజా కథనంతో స్పష్టమైందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

మోదీ అవినీతిపరుడని, ఆయనపై విచారణ జరుగుతుందని కాంగ్రెస్ నేత సంజయ్ ఝా ట్వీట్ చేశారు.

'రఫేల్ భూతం మళ్లీ బయటకు వచ్చింది. అంబానీకి పన్నుల మాఫీ, మోదీ యుద్ధ విమానాల కొనుగోలు.. స్వీట్ కోఇన్సిడెన్స్ కదా'' అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ప్రీతీ శర్మ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'