పారిస్‌లోని నాట్రడామ్‌ కేథడ్రల్ చర్చి: ఈఫిల్ టవర్ కంటే ఎక్కువ మంది సందర్శించే కట్టడం మంటల్లో చిక్కుకుంది

చర్చిలో మంటలు

పారిస్‌లోని పురాతనమైన నాట్రడామ్ కేథడ్రల్‌ చర్చి భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. మంటలు చెలరేగడంతో చర్చి గోపురం, పైకప్పు నేలకూలాయి.

అయితే రెండు బెల్ టవర్స్ సహా ప్రధాన నిర్మాణాన్ని కాపాడగలిగినట్లు అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్‌లో అత్యంత ప్రముఖమైన కట్టడాల్లో నాట్రడామ్ కేథడ్రల్ చర్చి ఒకటి. 850 ఏళ్ల కిందట గోథిక్ శైలిలో దీన్ని నిర్మించారు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సరికి మంటలను అదుపు చేయగలిగారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

చర్చిలో సాగుతున్న పునర్నిర్మాణ పనులు మంటలకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మేక్రాన్ తాజా ప్రమాదాన్ని 'పెను విషాదం'గా వర్ణించారు.

కేథడ్రల్‌ను పునర్నిర్మిస్తామని, దానికోసం అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తామని చెప్పారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

పోస్ట్ of Twitter ముగిసింది, 1

మంటలు వ్యాపించాయిలా..

భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10 గంటలకు మొదలైన మంటలు.. వేగంగా పైకప్పు వరకు వ్యాపించాయి.

కలపతో చేసిన లోపలి భాగాలు. గాజు కిటీకీలు మంటల తీవ్రతకు కాలిపోయాయి. దీంతో కప్పుతోపాటు పైనున్న గోపురం కూలిపోయింది.

ఒక బెల్ టవర్‌ను రక్షించేందుకు సుమారు 500 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు.

నాలుగు గంటల తర్వాత ప్రధాన కట్టడం పూర్తిగా నాశనం అవ్వకుండా కాపాడగలిగామని అగ్నిమాపక శాఖ చీఫ్ ప్రకటించారు.

మరమ్మతుల పనుల కోసం చర్చిలోని కొన్ని భాగాల్లో కర్రల నిర్మాణాలున్నాయి. గత వారం 16 రాగి విగ్రహాలను వేరే చోటుకు తరలించారు.

కేథడ్రల్‌కు పెను నష్టం జరిగిందని, మిగిలి ఉన్న కట్టడాన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేశారని పారిస్ డిప్యూటీ మేయర్ ఎమ్మానుయెల్ జార్జోరీ చెప్పారు.

అమూల్యమైన వారసత్వ సంపద నాశనమైపోయిందని చరిత్రకారుడు కేమిల్ పాస్కల్ అన్నారు. శతాబ్దాలుగా ఎన్నో సంతోషకరమైన, దురదృష్టకరమైన ఘట్టాలకు నాట్రడామ్ సాక్షిగా నిలిచిందని చెప్పారు.

మంటల్లో కేథడ్రల్‌ కాలిపోతున్న సమయంలో దాని చుట్టూ ఉన్న వీధుల్లో వేల మంది గుమిగూడారు. కొందరు కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు ప్రార్థన గీతాలు ఆలపించారు.

కేథడ్రల్‌ చర్చి మంటల్లో కాలిపోవడం చూస్తుంటే భయంకరంగా అనిపించిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

పోస్ట్ of Twitter ముగిసింది, 2

"ట్యాంకర్ విమానాలతో నీళ్లు చల్లడం వల్ల మంటలు ఆర్పవచ్చు, త్వరగా చర్యలు తీసుకోవాలి" అన్నారు.

నాట్రడామ్ కేథడ్రల్ చర్చి విశేషాలు

  • ఏటా 1.3 కోట్ల మంది నాట్రడామ్‌ను సందర్శిస్తుంటారు. ఈఫిల్ టవర్ కన్నా ఈ చర్చికే సందర్శకుల తాకిడి ఎక్కువ.
  • 12, 13వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ చర్చిని యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తించింది.
  • కేథడ్రల్ పైకప్పులో ఎక్కువ భాగాన్ని కలపతోనే నిర్మించారు.

'ఫ్రాన్స్ ప్రతిబింబం'

బీబీసీ ప్రతినిధి హెన్రీ ఆస్టీర్ విశ్లేషణ

నాట్రడామ్‌ అంతగా ఫ్రాన్స్‌ దేశాన్ని ప్రతిబింబించిన కట్టడం మరొకటి లేదు. దీనికి పోటీ అంటే ఈఫిల్ టవరే. అయితే దాని వయసు ఓ శతాబ్దమే. నాట్రడామ్ క్రీ.శ. 1200ల నుంచీ ఉంది.

చాలా కళాఖండాలకు నాట్రడామ్ పేర్లు ఇచ్చింది. విక్టర్ హ్యూగో రచించిన 'ద హంచ్‌బ్యాక్ ఆఫ్ నాట్రడామ్'ను ఫ్రాన్స్‌లో 'నాట్రడామ్ డి పారిస్‌'గా పిలుస్తుంటారు.

కేథడ్రల్‌కు చివరగా పెద్ద నష్టం కలిగింది ఫ్రెంచ్ విప్లవ సమయంలోనే. రెండు ప్రపంచ యుద్ధాలనూ అది తట్టుకొని నిలిచింది.

నాట్రడామ్ కాలిపోతుంటే చూడడం ప్రతి ఫ్రాన్స్ పౌరుడికీ షాక్ లాంటిదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)