కోతుల్లో మనిషి మెదడు జన్యువులు.. తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం

కోతి మెదడులో మనిషి జన్యువులు

తొలిసారిగా మనుషుల మెదడులోని జన్యువులను శాస్త్రవేత్తలు కోతుల్లో ప్రవేశపెట్టారు.

మనిషి మేధస్సు ఎలా పరిణామం చెందిందన్న విషయం తెలుసుకోవడమే లక్ష్యంగా చైనాలోని కన్‌మింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జువాలజీ పరిశోధకులు ఈ ప్రయోగం చేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించారు.

ఎమ్‌సీపీహెచ్1 అనే జన్యువును వారు కోతుల్లో ప్రవేశపెట్టారు. అందుకు అనుగుణంగా వాటి మెదళ్లను మార్చారు.

ఆ జన్యువు ప్రవేశపెట్టిన కోతుల జ్ఞాపకశక్తి మెరుగుపడింది. పరీక్షల్లో అవి అడవి కోతుల కన్నా మెరుగ్గా రాణించాయి. ప్రతిచర్యల్లోనూ అంతకుముందు కన్నా వేగం ప్రదర్శించాయి.

మనుషుల్లాగే వాటిలోనూ మెదడు అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టింది. కానీ, మెదడు పరిమాణంలో మాత్రం మార్పులు రాలేదు.

వీడియో క్యాప్షన్,

వీడియో: కోతుల్లో మనిషి మెదడు జన్యువులు... తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం

11 మకాక్ కోతులపై శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేయగా.. వాటిలో ఐదు మాత్రమే ప్రాణాలతో మిగిలాయి.

జన్యుపరంగా మకాక్ కోతులు మనుషులకు భిన్నమైనవి కాబట్టి ఈ ప్రయోగం గురించి నైతికపరమైన ఆందోళనలేవీ అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అయితే, ఇలా జంతువులపై జన్యు ప్రయోగాలు చేయడం పట్ల జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

కోతులకూ భావనలుంటాయని, అవి కూడా నొప్పి, బాధలను అనుభవిస్తాయని యూకేకు చెందిన జంతు పరిరక్షక సంస్థ ఆర్ఎస్‌పీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)