నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి

  • 16 ఏప్రిల్ 2019
నాట్రడామ్ చర్చిలో అగ్నిప్రమాదం Image copyright Getty Images

ప్యారిస్‌లోని నాట్రడామ్ కేథడ్రల్ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 850 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన చర్చిలోని పైకప్పు, గోపురం నేలకూలాయి. ఈ ప్రమాదం... చర్చిలోని ఇతర నిర్మాణాలను కూడా ప్రమాదంలో పడవేసింది.

ప్యారిస్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. కేథడ్రల్ చర్చికి తీవ్ర నష్టం వాటిల్లిందని, చర్చిలోని కళాకృతులు, ఇతర విలువైన వస్తువులను కాపాడేందుకు అత్యవసర సేవల సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రమాదంలో చర్చి లోపల చెక్కతో తయారుచేసిన వస్తువులు, ఇతర నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.

850ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఇతర కట్టడాలు, అలంకరణల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..

'గులాబి రంగు కిటికీలు'

కేథడ్రల్ చర్చిలో మొత్తం 3 రోజ్ విండోస్(గులాబి రంగు కిటికీలు) ఉన్నాయి. ఈ చర్చిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ కిటికీలు 13వ శతాబ్దానికి చెందినవి.

వీటిలో చర్చి పశ్చిమ ముఖద్వారం వద్ద ఉన్న కిటికీ.. మూడు కిటికీల్లోకి చిన్నది. దీని నిర్మాణం 1225సం.లో పూర్తయింది. ఇందులో... గాజు పలకలను, రాళ్లను అమర్చిన తీరు చాలా ప్రత్యేకం.

ఇక దక్షిణాన ఉన్న రోజ్ విండో వ్యాసం 43 అడుగులు ఉంటుంది. ఇందులో మొత్తం 84 ఫలకాలను అమర్చారు. ఈ కిటికీలు ముందులాగ తళతళలాడకపోవచ్చు. అగ్నిప్రమాదంలో ఇవి దెబ్బతిన్నాయి.

Image copyright Getty Images

కానీ, ఈ విండోస్‌కు ఎలాంటి ప్రమాదం జరిగినట్లు అనిపించడంలేదని కేథడ్రల్ చర్చి అధికార ప్రతినిధి ఆండ్ర్ ఫినట్... బి.ఎఫ్.ఎమ్ టీవీతో అన్నారు.

కానీ, చర్చి భవనం బలహీనంగా ఉండటంతో ఈ రోజ్ విండోస్‌కు ఏ ప్రమాదం లేదనికూడా చెప్పలేమని ఆయన అన్నారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ప్రసిద్ధి చెందిన 2 టవర్లు

'రెండు టవర్లు... పశ్చిమ ద్వార కిరీటాలు'

'గోథిక్' నిర్మాణ శైలిలోని రెండు టవర్లు కేథడ్రల్ చర్చిలో మరో ఆకర్షణ. ఈ రెండు దుర్గాలు, చర్చికి పశ్చిమ ద్వారానికి కిరీటంలా కనిపిస్తాయి.

ఇక్కడకు వచ్చే సందర్శకులు ఈ టవర్ల ముందు కాసేపు గడుపుతారు. ఈ పశ్చిమ ద్వార నిర్మాణం 1200సం.లో ప్రారంభమైంది.

మొదటి టవర్ నిర్మించేందుకు 40 ఏళ్లు పట్టింది. 1240సం.లో మొదటి టవర్ పూర్తవ్వగా, ఆ తర్వాత ప్రారంభించిన రెండవ టవర్ నిర్మాణం 1250సం.లో పూర్తయ్యింది.

ఈ టవర్ల పొడవు 68 మీటర్లు. ఈ టవర్లపైకి చేరడానికి 387 మెట్లు ఎక్కాలి. టవర్ల పైకి ఎక్కాక, నాలుగు దిక్కులకూ విస్తరించిన ఫ్రాన్స్ నగరాన్ని 'పనోరమిక్ వ్యూ'లో చూడొచ్చు. టవర్ల మీదుండే గంటలు చెక్కుచెదరలేదని అధికారులు తెలిపారు.

Image copyright Getty Images

'వింత ఆకృతులు'

మెట్ల గుండా టవర్ల పైకి చేరి, నగరం నలుదిక్కులనూ ఓసారి కళ్లారా చూడాలనుకునేవారికి దారి మధ్యలో కొన్ని వింత జీవుల ఆకృతులు కనిపిస్తాయి.

ఈ వింత జీవుల ఆకృతులు రెండు రకాలు. వీటిని రాతితో నిర్మించారు. ఈ విగ్రహాల ద్వారా వర్షపు నీరు బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు.

కానీ కాలానుగుణంగా కేథడ్రల్ చర్చిలోని రాతి నిర్మాణాలు దెబ్బతినడంతో, ఈ విగ్రహాల ద్వారా బయటకు వెళ్లే వర్షపు నీటి వల్ల ఇవి మరింత దెబ్బతినకుండా, కొన్ని విగ్రహాల స్థానంలో పీవీసీ పైపులను ఏర్పాటు చేశారు.

చర్చి భవనంపైన ఏర్పాటు చేసిన శిల్పం ఇక్కడ చాల ఫేమస్. ఈ శిల్పం, తలకు చేతులు ఆన్చి, చర్చిపై కూర్చుని నగరాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. దీన్ని 'స్ట్రిజ్' అని పిలుస్తారు.

Image copyright Getty Images

'బెల్స్'

కేథడ్రల్ చర్చిలో మొత్తం 10 బెల్స్ ఉన్నాయి. వీటిలో 'ఎమ్మాన్యుయెల్' అనే గంట బరువు 23 టన్నులు. దీన్ని దక్షిణ టవర్‌పై 1685లో ఏర్పాటు చేశారు.

ఫ్రెంచ్ విప్లవం సమయంలో, ఫిరంగి గుండ్ల కోసం చర్చి ఉత్తర టవర్‌పై ఉండే గంటలను కరిగించారు.

ఆరేళ్లక్రితం 2013సం.లో కేథడ్రల్ చర్చి 850వ వార్షికోత్సవాన్ని జరిపినపుడు, ఉత్తర దిక్కు టవర్‌పై అసలైన బెల్స్‌ను పోలిన చిన్నచిన్న బెల్స్‌ను ఏర్పాటుచేసి, సాధువుల పేర్లతో ఈ బెల్స్‌ను ఆశీర్వదించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక గత ఏడాది తీసిన గోపురం ఫొటో, అగ్నిప్రమాదంలో దగ్ధమవుతున్న గోపురం తాజా ఫొటో

గోథిక్ నిర్మాణ శైలి లోని గోపురం

అగ్నిప్రమాదంలో నేలకూలిన ప్రసిద్ధ చర్చి గోపురం 12వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత ఈ గోపురానికి చాలా మార్పులు చేశారు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో ధ్వంసమైన ఈ గోపురాన్ని 1860సం.లో పునర్నిర్మించారు.

''చర్చి గోపురం, పైకప్పు, రాతి నేలమాళిగ ధ్వంసమవ్వడం... ఫ్రెంచ్ గోథిక్ వారసత్వ సంపదకు పూడ్చలేని లోటు. ఫ్రాన్స్ ప్రజలను తల్చుకుంటే మా హృదయం ద్రవిస్తోంది'' అని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ అన్నారు.

Image copyright AFP

'చరిత్ర మిగిల్చిన అవశేషాలు'

శిలువ వేసినపుడు ఏసుక్రీస్తు తలపై ఉంచిన ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసెస్ గోరు ఇలాంటివాటికి నాట్రడామ్‌ నివాసం.

'అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతరులు ఒక మానవహారంగా ఏర్పడి... ముళ్ల కిరీటం, కింగ్ లూయిస్ IX ముళ్ల కిరీటాన్ని ఫ్రాన్స్ తీసుకువచ్చినపుడు ఆయన ధరించినట్లుగా భావిస్తున్న తన అంగవస్త్రం లాంటి వెల కట్టలేని వాటిని కాపాడారు' అని ప్యారిస్ మేయర్ ట్వీట్ చేశారు.

Image copyright ANNE HIDALGO
చిత్రం శీర్షిక అగ్నిప్రమాదం నుంచి కాపాడిన విలువైన వస్తువులు

కానీ, చర్చి లోపలున్న పెద్ద పెద్ద పెయింటింగ్స్ చాలా బరువుగా ఉండటంతో వాటిని గోడల నుంచి కిందకు దించి, కాపాడటం కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపినట్లు బీబీసీ యూరప్ ప్రతినిధి కెవిన్ కోన్నొలీ అన్నారు.

Image copyright Getty Images

గ్రేట్ ఆర్గాన్

కేథడ్రల్‌లో ప్రధానంగా మూడు సంగీత వాయిద్యాలు ఉన్నాయి. వాటిల్లో 'గ్రేట్ ఆర్గాన్'ను మొదట 1401 సం.లో నిర్మించారు. తర్వాత 18, 19 శతాబ్దాల్లో వీటికి కొన్ని మార్పులు చేశారు.

చాలా మార్పులు చేర్పులు చేశాక కూడా, మొదటిసారి నిర్మించినపుడు ఆర్గాన్‌లో పొందుపరిచిన కొన్ని పైప్‌లు ఇప్పటికీ ఇందులో ఉన్నాయి.

ఈ ఆర్గాన్ భద్రంగానే ఉందని ప్యారిస్ మేయర్ ఫ్రెంచ్ వార్తాచానెల్ బి.ఎఫ్.ఎం.టీవీతో అన్నారు.

ఈ ఆర్గాన్‌ వాయిద్యకారులు జోహన్ వెక్సో 'బీబీసీ రేడియో 4' మాట్లాడుతూ...

''ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన వాయిద్యం. ఇది ఒక అద్భుతం అని చెబుతాను. దీన్ని వర్ణించడానికి మావద్ద మాటలు లేవు. దీన్ని వాయిస్తున్న ప్రతిసారీ ఓ గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇలాంటి ప్రదేశంలో ఈ సంగీత వాయిద్యాన్ని ప్లే చేయడం నాకెంతో గౌరవం'' అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం