'ఆలీబాబా' 996 విధానం: ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేయాలా?

  • అబినాష్ కంది
  • బీబీసీ ప్రతినిధి
అధిక పనిగంటలను నిరసిస్తూ నిరసన తెలుపుతున్న కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

వారానికి ఆరు రోజులు.. రోజుకు పన్నెండు గంటలు పనిచేసే విధానాన్ని సమర్థిస్తూ చైనా బిలియనీర్, 'అలీబాబా' అధినేత జాక్ మా చేసిన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆయన చెప్పినట్లు చేయాలంటే ఉద్యోగి వారానికి 72 గంటలు పనిచేయాలి. అంటే ఏడాదికి 3,744 గంటలు.

ఈ విషయంలో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారితోపాటు సమర్థిస్తున్నవారూ ఉన్నారు.

'996'గా పిలుస్తున్న ఈ విధానం లేకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ సత్తువ కోల్పోయి, వృద్ధి వేగం కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జాక్ మా అంటున్నారు.

996 విధానం అంటే ఏంటి?

ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు... వారానికి ఆరు రోజులు పనిచేయడాన్ని ‘996 విధానం’ అని చైనాలో పిలుస్తున్నారు.

అంటే రోజుకు పన్నెండు గంటలు పని చేయాలన్నమాట.

దీనిపై చైనాలో కొందరు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

బీజింగ్ కేంద్రంగా పనిచేసే న్యాయ సలహాల కంపెనీ వుసాంగ్ నెట్‌వర్క్ టెక్నాలజీకి చెందిన సీనియర్ లీగల్ కౌన్సెల్ జంగ్ షియొలిన్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘996 పని విధానం చట్టానికి వ్యతిరేకం’’ అని చెప్పారు.

ఈ నేపథ్యంలో అసలు ఏ దేశంలో పనిగంటలు ఎలా ఉన్నాయి.. ఏ దేశంలో ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తున్నారు.. ఎక్కడ తక్కువ కాలం శ్రమిస్తున్నారో చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2018లో జూన్-జులై మధ్య ఓ వారంలో భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల వారు 46 నుంచి 47 గంటలు శ్రమించారు

భారత నగరాల్లో పరిమితి దాటే..

వారానికి పనిగంటలు 48కి మించకూడదన్నది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) సూచించిన పరిమితి. భారత్‌లో ఇంతకుమించి పనిచేస్తే అదనంగా భత్యాలు చెల్లించాలన్న చట్టం కూడా అమల్లో ఉంది.

అయినా, భారత్‌లో ఈ పరిమితిని మించి పనిచేస్తున్నవారే అత్యధికం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులు వారంలో సగటున 43 గంటల పాటు పనిచేస్తున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఇంకా తక్కువగా ఉంది.

కానీ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం 2018లో జూన్-జులైల మధ్య ఓ వారంలో భారత్‌లోని నగరాల్లోని ఉద్యోగులు సగటున 53 నుంచి 54 గంటలు పనిచేశారు. అదే సమయంలో గ్రామాల్లోని వారు 46 నుంచి 47 గంటలు శ్రమించారు.

2017లో సగటు పనిగంటలు అత్యధికంగా దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా దేశాల్లోనే నమోదైనట్లు ఐఎల్ఓ అధ్యయనంలో వెల్లడైంది.

వారానికి సగటున ఉద్యోగి పనిగంటలు నేపాల్‌లో 54, మాల్దీవులులో 48, బంగ్లాదేశ్‌లో 47గా ఉన్నాయి. చైనా, మలేసియాల్లో 46 గంటలుగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

నగరాల్లో ముంబయివాసులదే అత్యధిక శ్రమ

ప్రపంచంలోని నగరాల్లోకెల్లా ముంబయిలోని ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తున్నట్లు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ యూబీఎస్ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ సంస్థ అంచనాల ప్రకారం ముంబయిలో ఏటా ఒక్కో ఉద్యోగి సగటున 3,315 గంటలు పనిచేస్తున్నాడు. అంటే వారానికి సుమారు 63.7 గంటలు.

మొత్తంగా 76 నగరాల ఉద్యోగుల పనిగంటలను యూబీఎస్ లెక్కగట్టింది.

తక్కువ పని గంటలున్న నగరం రోమ్ అని తేల్చింది. ఆ నగరంలో సగటున ఏటా ఒక్కో ఉద్యోగి 1,581 గంటలు శ్రమిస్తున్నాడు.

ముంబయి ఉద్యోగుల పనిగంటలతో పోలిస్తే ఈ సమయం సగం కన్నా తక్కువే.

యూబీఎస్ లెక్కల ప్రకారం...

పనిగంటలు అత్యధికంగా ఉన్న నగరాలు - వార్షిక సగటు

  • ముంబయి - 3,315
  • హనోయి - 2,691
  • మెక్సికో సిటీ - 2,622
  • దిల్లీ - 2,511
  • బొగోటా - 2,357

పనిగంటలు అతితక్కువగా ఉన్న నగరాలు - వార్షిక సగటు

  • రోమ్ - 1,581
  • పారిస్ - 1,663
  • కోపెన్‌హేగన్ - 1,712
  • మాస్కో - 1,719
  • హెల్సింకీ - 1,750

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మెక్సికోలో సగటున ఒక్కో ఉద్యోగి ఏడాదికి 2,257 గంటలు పనిచేస్తున్నాడు. అంటే వారానికి 43గంటలు పనిచేస్తున్నట్లు

ఓఈసీడీ లెక్కల్లో మెక్సికో ముందు

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) అధ్యయనం నిర్వహించిన దేశాల్లో మెక్సికోలో ఉద్యోగుల సగటు పనిగంటలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఆ సంస్థ లెక్కల ప్రకారం మెక్సికోలో సగటున ఒక్కో ఉద్యోగి ఏడాదికి 2,257 గంటలు పనిచేస్తున్నాడు. అంటే వారానికి 43గంటలు పనిచేస్తున్నట్లు.

అతితక్కువగా జర్మనీలో ఉద్యోగులు సగటున ఏడాదికి 1,363 గంటలు.. అంటే వారానికి సుమారు 26 గంటలే పనిచేస్తున్నారు.

మెక్సికో ఉద్యోగులతో పోల్చితే జర్మనీ ఉద్యోగులు ఏడాదికి 892 గంటలు తక్కువగా పనిచేస్తున్నారన్నమాట. అయినా ఉత్పాదకతలో జర్మనీ ఉద్యోగులే ముందు ఉన్నట్లు ఓఈసీడీ నివేదిక పేర్కొంది.

అమెరికాలో ఉద్యోగుల సగటు వార్షిక పని గంటలు 1,783. బ్రిటన్‌లో 1680 గంటలు.

(గమనిక: ఓఈసీడీ కొన్ని దేశాల్లోనే ఈ అధ్యయనం జరిపింది)

అత్యధిక పని గంటలున్న దేశాలు - వార్షిక సగటు

  • మెక్సికో - 2,257
  • కోస్టారికా - 2,179
  • కొరియా - 2,024
  • రష్యా - 1,980
  • చిలీ - 1,954

అతితక్కువ పనిగంటలున్న దేశాలు - వార్షిక సగటు

  • జర్మనీ - 1,356
  • డెన్మార్క్ - 1,408
  • నార్వే - 1,419
  • నెదర్లాండ్స్ - 1,433
  • స్వీడన్ - 1,453

ఫొటో సోర్స్, C. Nettleton/Hulton Archive/Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటలు వినోదం, ఎనిమిది గంటలు విశ్రాంతి కావాలన్న బ్యానర్ పట్టుకుని 1858లో ఆస్ట్రేలియాలో ఎనిమిది గంటల పని దినోత్సవ మూడో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కార్మిక సంఘం అధ్యక్షుడు ఆర్ మిల్లర్, కార్యదర్శి జి. రావెన్‌స్క్రాఫ్ట్, సభ్యులు

ఒకప్పుడు రోజుకు 10 నుంచి 16 గంటల పని

పారిశ్రామిక విప్లవ కాలంలో రోజుకు 10 నుంచి 16 గంటల పని సమయం ఉండేది.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.

ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి.

1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.

ఆపైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి.

నిజానికి పనిగంటలు తగ్గితే ఉత్పాదకత మరింత పెరుగుతుందని తేలడంతోనే సంస్థలు ఆ సమయాన్ని కుదించాయి.

ఫోర్డ్ కంపెనీ మొదటిసారిగా ఎనిమిది గంటల పని సమయంతో చేసిన ప్రయోగం విజయవంతమై ఆ సంస్థ లాభాలు రెండేళ్లలో రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంస్థలు 'వారానికి ఐదు రోజులు-ఎనిమిది చొప్పున పని గంటలు' విధానాన్ని పాటిస్తున్నాయి.

ఇప్పుడు తిరిగి వీటిని పెంచడం వల్ల లాభం ఉంటుందా? అని ప్రశ్నిస్తే.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన చాలా అధ్యయనాలు లేదనే సమాధానం చెబుతున్నాయి.

పనిగంటలను పెంచడం వల్ల ఉత్పాదకత తగ్గుతుందని వెల్లడిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఇంకా తగ్గిస్తూ ప్రయోగాలు

వృత్తి, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యాన్ని తీసుకువచ్చేందుకు పని దినాలు, పని గంటలను ఇంకా తగ్గించే ప్రయోగాలను చాలా సంస్థలు, ప్రభుత్వాలు చేపడుతున్నాయి.

వారంలో నాలుగు రోజుల పనిదినాల విధానాన్ని న్యూజీలాండ్‌లో కొంతకాలం కిందట ప్రయోగాత్మకంగా అమలు చేశారు.

పెర్పెచువల్ గార్డియన్ అనే సంస్థ 240 మంది ఉద్యోగులను ఈ విధానంలో పరీక్షించింది.

సంస్థ ఉత్పాదకతకు ఎలాంటి నష్టమూ కలగకపోగా.. ఉద్యోగుల వృత్తి, వ్యక్తిగత జీవతం మధ్య సమతౌల్యం 24% మెరుగైనట్లు ఆ సంస్థ తెలిపింది. ఉద్యోగులపై ఒత్తిడి స్థాయి 7% తగ్గినట్లు పేర్కొంది.

ఐస్లాండ్లోని రీక్యవిక్ పట్టణ మున్సిపల్ కార్యాలయాల్లోనూ పని గంటలను కాస్త కుదించి పరిశీలించారు. సానుకూల ఫలితాలే వచ్చాయి.

స్వీడన్‌లో చాలా సంస్థలు ఆరు గంటల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలుచేశాయి. ఉద్యోగులు మరింత ఆరోగ్యవంతంగానూ ఇంకా ఎక్కువ ఉత్పాదకతతోనూ పనిచేసినట్లు ఆ ప్రయోగాల్లో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జపాన్ భాషలో 'కరోషి' అంటే 'శక్తికి మించి పనిచేయడం వల్ల మరణించడం'

ఒత్తిడికి నిదర్శనం 'కరోషి'

జపనీస్ భాషలో 'కరోషి' అనే ఓ పదం ఉంది. దాని అర్థం 'శక్తికి మించి పనిచేయడం వల్ల మరణించడం'. అక్కడ ఉద్యోగులపై పని ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉందన్నదానికి ఇదే నిదర్శనం.

అయితే జపాన్ ప్రభుత్వం 'షైనింగ్ మండే' పేరుతో ఓ విధానాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం నెలలో ఏదైనా ఒక సోమవారం ఆఫీసుకు ఆలస్యంగా వచ్చే వెసులుబాటు ఉద్యోగులకు ఉంటుంది.

ఎనిమిది గంటల పనిదినంలో ఉద్యోగులు కేవలం 2 గంటల 53 నిమిషాలు మాత్రమే ఉత్పాదకంగా ఉంటున్నట్లు బ్రిటన్లో జరిగిన ఓ సర్వే తేల్చింది. మిగతా సమయాన్ని సోషల్ మీడియా చూడటానికి, వార్తలు చదవడానికి, ఇతరత్రా పనికి సంబంధం లేని విషయాల కోసం వెచ్చిస్తున్నారని వెల్లడించింది.

పనిదినాలు, పనిగంటలను కుదించడం వల్ల వ్యయం ఎక్కువవుతోందంటూ తిరిగి సాధారణ విధానానికి మారిన సంస్థలూ ఉన్నాయి. కొంతకాలం ప్రయోగాలు నిర్వహించిన తర్వాత అమెరికాలోని ట్రీహౌజ్ సంస్థ, స్వీడన్లోని స్వార్ట్డేలన్ కేర్ సెంటర్ ఇలాగే తిరిగి ఐదు రోజులు-ఎనిమిదేసి పని గంటల పద్ధతికి మారాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)