బీజేపీ ర్యాలీగా వైరల్ అవుతున్న ఈ ఫోటో నిజమేనా? :Fact Check

  • ఫ్యాక్ట్ చెక్ బృందం
  • బీబీసీ న్యూస్
బౌద్ధ సన్యాసులు

ఫొటో సోర్స్, DMC TV

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ర్యాలీకి హాజరైన జనసందోహం అంటూ ఓ ఏరియల్ ఫొటో ఫేస్‌బుక్, ట్విటర్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది.

"బెంగాల్‌లో బీజేపీ ర్యాలీకి హాజరైన జనవాహిని ఇది. ఇది కూచ్ బెహార్‌లో జరిగిన ర్యాలీ. ఈరోజు మమతాకు నిద్ర పట్టదు" అని ఆ ఫొటో కింద రాసి ఉంది.

రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో కనీసం 23 స్థానాలు గెల్చుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బెంగాల్ రాష్ట్ర బీజేపీ విభాగానికి సూచించారు.

ఫొటో సోర్స్, SM GRAB

'చౌకీదార్ నరేంద్ర మోదీ', 'నరేంద్ర మోదీ 2019' వంటి అనేక మితవాద ఫేస్‌బుక్ పేజీలు, గ్రూపులు ఈ ఫొటోను షేర్ చేశాయి.

ఫొటో సోర్స్, SM GRAB

తమ పేర్ల ముందు 'చౌకీదార్' అని చేర్చుకున్న ఎందరో ట్విటర్ యూజర్లు కూడా ఈ చిత్రాన్ని విస్తృతంగా షేర్ చేసుకున్నారు.

తెలుపు, కాషాయ రంగు దుస్తులు ధరించిన కొందరు పొడవాటి క్యూలైన్లలో నిలబడి ఉండటం ఈ చిత్రంలో కనిపిస్తుంది. వారంతా బీజేపీ మద్దతుదారులు అని చెబుతున్నారు. కానీ అది వాస్తవం కాదని మేం గుర్తించాం. ఈ ఫొటోకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు.

మరి వాస్తవమేంటి?

2019 ఏప్రిల్ 7న ప్రధాని మోదీ కూచ్ బెహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ ఏప్రిల్ 11న మొదటి దశలోనే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి.

కానీ ఈ ఫొటో 2015లో థాయ్‌లాండ్‌లోని సముట్ సఖోన్ ప్రావిన్స్‌కు సంబంధించినదని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తెలిసింది.

కాషాయ రంగు దుస్తులు ధరించి ఉన్నవారు బీజేపీ మద్దతుదారులు కాదు, వాళ్లంతా బౌద్ధ సన్యాసులు.

డీఎంసీ టీవీ ఏమంటోంది?

బౌద్ధమత కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేసే డీఎంసీ టీవీ ఈ ఫొటోను 2015 అక్టోబర్ 26న షేర్ చేసింది. డీఎంసీ అంటే ధామ్ మెడిటేషన్ బుద్ధిజమ్. ఈ వెబ్‌సైట్ కేవలం బౌద్ధ మతానికి సంబంధించిన కార్యక్రమాలు, సంస్కృతీ విశేషాలను అందించడానికే ఏర్పాటైంది.

ఈ వెబ్‌సైట్ అభిప్రాయం ప్రకారం... థాయ్‌లాండ్‌లోని బౌద్ధులు బౌద్ధ సన్యాసులకు భిక్షను అందించే కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తారు. ఇలాంటిది 2015లో కూడా ఓసారి జరిగింది. "పదివేల మంది సన్యాసులు సముట్ సఖోన్ దగ్గర భిక్షను స్వీకరించారు" అని వెబ్‌సైట్‌లో దీని గురించి రాసిన కథనానికి హెడ్‌లైన్‌ ఉంది.

ఫొటో సోర్స్, DMC TV

ఆ వెబ్‌సైట్ ప్రకారం... ఈ కార్యక్రమంలో బౌద్ధ సన్యాసులతో పాటు ప్రభుత్వ అధికారులు, మిలిటరీ సిబ్బంది, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, DMC TV

ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 70 ఫొటోలను ఈ వెబ్‌సైట్ పబ్లిష్ చేసింది. సముట్ సఖోన్‌లోని ఎక్కచాయ్ రోడ్ దగ్గర ఈ భిక్ష స్వీకరణ జరిగింది అని తెలిపింది.

ఫొటో సోర్స్, Google Earth

ఈ వెబ్‌సైట్ చెబుతున్న వివరాలను 'గూగుల్ ఎర్త్' ద్వారా పరిశీలించాం.

ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు, 'గూగుల్ స్ట్రీట్ వ్యూ'లో చూసిన ఫొటోలకు చాలా పోలికలున్నాయి.

పసుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన భవనం, ముదురు ఎరుపు రంగులో ఉన్న మరో భవనం, రోడ్డుకు ఎడమవైపున టెలిఫోన్ స్తంభాలతో పాటు చుట్టూ ఉన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, SM GRAB

ఒకే ఫొటో - వేర్వేరు సందర్భాలు

ఈ ఫొటోను సంబంధం లేకుండా ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో కూడా మన దేశంలో హిందువులను ఉద్దేశిస్తూ ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో కొందరు షేర్ చేశారు.

"ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని బెంగాలీ హిందువులతో 'జై శ్రీరామ్' అని రాయించడం. చూడండి.. ఎంతమంది హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో. మీరూ షేర్ చెయ్యండి" అని ఆ ఫొటో కింద రాసి ఉంది.

థాయ్‌లాండ్‌కు చెందిన ఈ ఫొటోతో ప్రస్తుతం షేర్ అవుతున్న సమాచారం అవాస్తవం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)