ఇద్దరు భారతీయుల 'శిరచ్ఛేదం' చేసిన సౌదీ అరేబియా

సత్విందర్

ఫొటో సోర్స్, ARVIND CHABRA

ఫొటో క్యాప్షన్,

సత్విందర్ వర్క్ పర్మిట్‌తో సౌదీ అరేబియా వెళ్లారు

సౌదీ అరేబియాలో ఇద్దరు భారతీయులకు 'శిరచ్ఛేదం' శిక్ష వేశారు. ఈ ఇద్దరూ పంజాబ్‌కు చెందిన వారు. వర్క్ పర్మిట్‌తో ఆ దేశంలో పనిచేస్తున్నారు.

దీనిని ధ్రువీకరిస్తూ ఒక లేఖ పంపిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అందులో "హోషియార్‌పూర్‌కు చెందిన సత్విందర్, లుథియానాకు చెందిన హర్జీత్ సింగ్‌కు ఫిబ్రవరి 28న మరణశిక్ష విధించారని" తెలిపింది.

బీబీసీ ప్రతినిధి రాజేష్ జోషితో మాట్లాడిన సత్విందర్ భార్య సీమ "మృతదేహం గురించి మాకేం తెలీడం లేదు. ప్రభుత్వంలో ఎవరూ మా మాట వినడం లేదు" అన్నారు.

"మేం చివరగా ఫిబ్రవరి 21న మాట్లాడాం. అప్పుడు నా భర్తకు వేసే శిక్ష గురించి నాకేం తెలీదు" అని సీమ చెప్పారు. ఆమెకు 13 ఏళ్ల కూతురు ఉంది.

"ప్రభుత్వం వైపు నుంచి మాకు ఏ సమాచారం అందలేదు. అధికారులు కూడా ఏ విషయం చెప్పలేదు. కొంతమంది యువకులు చెప్పడంతో మేం స్వయంగా ఈమెయిల్ తెప్పించుకున్నాం" అన్నారు

"ఇప్పుడు మాకు ఆ దేవుడే అండగా నిలవాలి" అని ఆమె అన్నారు.

సత్విందర్ సింగ్, హర్జీత్ సింగ్ ఇద్దరికీ ఫిబ్రవరి 28న మరణశిక్ష విధించారు. కానీ ఆయన కుటుంబానికి మాత్రం ఆ విషయం సోమవారం తెలిసింది.

"రెండేళ్లుగా లేఖలు వచ్చేవి. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. కానీ హఠాత్తుగా మాటలు ఆగిపోయాయి. చాలా నెలల తర్వాత గ్రామంలోనే ఒకరు ఆయనను ఏదో కేసులో జైల్లో పెట్టారన్నారు."

సీమ తరఫు న్యాయవాది విజయ్ "ఫిబ్రవరి 28న జైలు నుంచే ఎవరో ఫోన్ చేశారు. సత్విందర్‌కు మరణశిక్ష వేశామని చెప్పారు" అన్నారు.

బీబీసీ ప్రతినిధులు న్యాయవాది విజయ్‌తో మాట్లాడారు. ఆయన "సీమ, ఆమె కుటుంబ సభ్యులు దానిని నమ్మలేకపోయారని" చెప్పారు.

"సీమ బంధువులు విదేశాంగ శాఖను కలిసేవరకూ వారికి కూడా ఆ విషయం తెలీదు" అన్నారు విజయ్.

ఫొటో సోర్స్, Reuters

ఆ తర్వాత విజయ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇద్దరి గురించి తెలుసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోర్టును కోరారు.

గత సోమవారం మంత్రిత్వ శాఖ నుంచి వారికి ఒక మెయిల్ వచ్చింది. అందులో ఇద్దరి మృతిని ధ్రువీకరించారు.

సత్విందర్, హర్జీత్ ఇద్దరూ సౌదీ అరేబియాలో డ్రైవర్లుగా పనిచేసేవారు. వారికి ఫిబ్రవరి 28న మరణశిక్ష వేశారు.

2013లో సత్విందర్ కుమార్ హోషియార్‌పూర్‌ నుంచి, హర్విందర్ సింగ్ లుథియానా నుంచి వర్క్ పర్మిట్‌తో సౌదీ అరేబియా వెళ్లారు.

సత్విందర్ కుటుంబం హోషియార్‌పూర్‌లో దాసుయా దగ్గర ఒక గ్రామంలో ఉంటుంది.

శిక్ష ఎందుకు వేశారు

"మరో భారతీయుడిని హత్య చేశారనే ఆరోపణలో 2015 డిసెంబర్‌లో ఇద్దరినీ ఆరెస్ట్ చేశారు. వీరు ముగ్గురూ ఒక దోపిడీలో పాల్గొన్నారు" అని విదేశాంగ శాఖ చెప్పింది.

డబ్బు పంపకంలో ముగ్గురి మధ్య గొడవ జరిగినట్టు చెబుతున్నారు. ఆరిఫ్‌ అనే వ్యక్తిని హర్జీక్, సత్విందర్ కలిసి హత్య చేశారు. మృతదేహాన్ని ఎడారిలో పడేశారు.

"కొంతకాలం తర్వాత మద్యం తాగి గొడవ చేసిన ఆరోపణలతో ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారిని దమ్మంలో ఉంచారు" అని విదేశాంగ శాఖ తమ లేఖలో తెలిపింది.

అయితే ఆ శిక్ష పూర్తై బయటికి వస్తున్నపుడు ఒక హత్య కేసులో పోలీసులు వారిని వెతుకుతున్నట్లు తెలిసింది. ఆ కేసు విచారణ కోసం వారిని తర్వాత రియాద్‌ జైలుకు పంపించారు.

మంత్రిత్వ శాఖ తమ లేఖలో "విచారణలో ఇద్దరూ తమ నేరం అంగీకరించారు" అని తెలిపింది.

సౌదీ అరేబియా చట్టాల ప్రకారం మరణశిక్ష పడిన వ్యక్తి మృతదేహాన్ని బంధువులకు గానీ, వారి స్వదేశానికి గానీ ఇవ్వడం ఉండదు. రెండు నెలల తర్వాత వీరి డెత్ సర్టిఫికెట్ ఇస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)