వలస బతుకుల విషాదం: తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- నర్గిజా రస్కులోవా
- బీబీసీ న్యూస్ కర్గిజ్

మధ్య ఆసియా దేశమైన కర్గిస్థాన్‌లోని గ్రిగోరియెంక గ్రామానికి చెందిన కనీబెక్, ఆయన భార్య నుర్సులు ఉపాధి కోసం ఏడాది క్రితం రష్యాకు వలసవెళ్లారు. స్వదేశంలో పనులు లేవు. పరాయి దేశంలో ఏదైనా పనిదొరికితే కొంత డబ్బు పోగేసుకుని పిల్లలను చదివించుకుని, సొంతూరిలో ఓ గూడు కట్టుకోవాలన్నది వారి ఆలోచన. ఈ దంపతులకు నాలుగేళ్లు, అయిదేళ్లు, ఎనిమిదేళ్లు, 11 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. నలుగురు చిన్నారులూ తమ సొంతూరిలోనే 54 ఏళ్ల నానమ్మ దగ్గరే ఉంటున్నారు.
ఈ ఒక్క కుటుంబమే కాదు. కర్గిస్థాన్‌లో ఇలాంటి వలసలు సర్వసాధారణం. ఈ దేశంలోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఉపాధి కోసం పరాయి దేశాలకు వలసవెళ్లినవారే.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారం, ఇలాంటి వలస కార్మికులు తమ స్వదేశాలకు పంపే డబ్బు విలువ మధ్య ఆసియా దేశాల జీడీపీలో మూడో వంతుకు పైనే ఉంటుంది. అలా పంపే డబ్బు విలువ 2018లో 528 బిలియన్ డాలర్లకు చేరిందని అంచనా. దిగువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాల పురోగతికి ఆ డబ్బు ఎంతో దోహదపడుతోంది.
కానీ, ఆ కార్మికుల పిల్లలు తమ జీవితంలో ఎంతో కోల్పోవాల్సి వస్తోంది.
పసి పిల్లలను సొంతూళ్లలో వదిలేసి తల్లిదండ్రులు కనిపించకుండా వలసెళ్లిపోతున్నారు. దాంతో ఎంతోమంది చిన్నారులకు అమ్మానాన్నల ఆప్యాయత కరువవుతోంది. ఒక తరం పిల్లలంతా తమ బంధువుల సంరక్షణలోనే ఉండాల్సి వస్తోంది. నిరాదరణకు, వేధింపులకు కూడా గురవుతున్నారు.

"అదొక్కటే మార్గం"
కనీబెక్, నుర్సులు దంపతులకు రష్యా రాజధాని మాస్కోలో క్లీనర్ పని దొరికింది. ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నెలనెలా పొదుపు చేయగలినంత డబ్బు ఇంటికి పంపుతుండేవారు. కానీ, కొన్ని నెలలకే ఇంటి నుంచి విషాద వార్త వినాల్సి వచ్చింది.
ఎనిమిదేళ్ల కూతురు మెడినా కిందపడి గాయాలవ్వడంతో చనిపోయింది. అంత్యక్రియలకు ఈ దంపతులిద్దరూ ఊరెళ్లారు.
తమ బిడ్డ మృతికి ఇంటిదగ్గరున్న నానమ్మను వారు నిందించలేదు. వాళ్లు ఇంటిపట్టున ఉంటే బిడ్డను సమయానికి చికిత్స చేయించి కాపాడుకునేవారేమో. కానీ, కొన్ని ఘటనలు ఎవరికి, ఎప్పుడు ఎదురవుతాయో చెప్పలేం కదా అని అనుకున్నారు.
చిన్నారి అంత్యక్రియల తర్వాత ఆ దంపతులు మళ్లీ మాస్కో వెళ్లిపోక తప్పలేదు. ఆ తల్లి కన్నీరు ఇప్పటికీ ఆగటంలేదు. వాళ్ళిప్పుడు మునుపటిలా లేరు.

మెడినా మరణం కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. ఈ దేశంలో ఏటా అనేక మంది చిన్నారులు తనువుచాలిస్తున్నారు, చిత్రహింసలకు గురవుతున్నారు.
గత ఏడాది ఒక రెండేళ్ల బాలుడిని తన ఆంటీ కొట్టి చంపారు. నరైన్ ప్రాంతంలో నాలుగేళ్ల బాలికపై దుండగులు అత్యాచారం చేసి ఆ చిన్నారితో పాటు తన ఏడేళ్ల వయసున్న అన్నయ్యను, నానమ్మను చంపేశారు.

విదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి అత్యధికంగా డబ్బు అందుకుంటున్న దేశాలు (జీడీపీ ఆధారంగా)
వేధింపులు, హత్యలు వంటి హింసాత్మక ఘటనలకు తల్లిదండ్రులు వలసవెళ్లిన కుటుంబాల పిల్లలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలతో పాటు వలస వెచ్చే కార్మికులను ఆహ్వానించేందుకు కొన్ని దేశాలు ఆసక్తి చూపడంలేదని వారి స్వదేశాల్లో పిల్లలు, కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక వేత్త గుల్నారా ఇబ్రేవా అన్నారు.
కొంతమంది కార్మికుల్లో భార్యభర్తలు ఒకేచోట కలిసి ఉంటూ పనిచేసుకునేందుకు కూడా వీలుండటం లేదని గుల్నారా ఆవేదన వ్యక్తం చేశారు.

"అమెరికన్ డ్రీమ్"
ఝాజ్‌గుల్ మడగాజిమోవాకు ఇప్పుడు 29 ఏళ్లు. ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు వారి తల్లి ఉపాధి కోసం రష్యాకు వెళ్లారు. ఆమె ఇళ్లల్లో పనులు చేస్తున్నారు.
కర్గిస్థాన్ నుంచి విదేశాలకు వెళ్లే వలసకార్మికుల్లో 45 శాతం మంది మహిళలే.
మహిళా వలస కార్మికులే ఎక్కువగా లైంగిక, సామాజిక వేధింపులకు బాధితులుగా మారే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అంటోంది. ఆ మహిళలే కాదు, వారి పిల్లలు, ఇతర కుటుంబాలు కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాయని ఆ సంస్థ చెబుతోంది.
మూడేళ్ల తర్వాత ఝాజ్‌గుల్ తండ్రి కూడా రష్యా వెళ్లారు. వాళ్లు సొంతూరు చూసేందుకు పదేళ్లకు వచ్చి వెళ్లారు. చిన్నా, చితకా పనులు చేసి కూడబెట్టుకున్న డబ్బుతో పాత అప్పులు తీర్చారు. స్వగ్రామంలో ఇల్లు కట్టుకున్నారు, పిల్లలను చదివించుకుంటున్నారు. ఆర్థికంగా చూస్తే ఇబ్బందులు లేవు.
కానీ, తమ పిల్లలకు దూరంగా ఏళ్లతరబడి ఉండటమే వారి బాధ.

వలసదారుల ద్వారా అత్యధిక డబ్బు అందుకున్న దేశాలు
ఝాజ్‌గుల్ తన తల్లిదండ్రులను తప్పుబట్టడంలేదు. ఎందుకంటే, అమ్మానాన్నలు వలస వెళ్లకుంటే తమ సమస్యలు తీరవన్న విషయం ఆమెకు కూడా అర్థమైంది.
"చాలామంది అమెరికన్ డ్రీమ్‌తో ఉంటారు. సొంతిల్లు కట్టుకోవాలని, కారులో తిరిగే స్థాయికి ఎదగాలని, పెళ్లి ఆడంబరంగా చేసుకోవాలని, పిల్లలను పెద్దపెద్ద స్కూళ్లలో చదివించుకోవాలని కోరుకుంటారు. కానీ, ఆ కలలు సాకారం కావాలంటే ఏళ్లు పడుతుంది. అలాంటి కోరికలతో కొందరు తమ కుటుంబాలను, ఆప్యాయతలను దూరం పెట్టి ఏళ్లరబడి విదేశాల్లో ఉండిపోతున్నారు." అని ఝాజ్‌గుల్ అంటున్నారు.
(చిత్రాలు: మగెర్రామ్ జెన్యాలవ్)
ఇవి కూడా చదవండి:
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)