అమెరికా విదేశాంగ మంత్రి పాంపేయోను చర్చల నుంచి తొలగించాలి :ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది నాలుగుసార్లు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్‌కు వెళ్ళి కిమ్‌ను కలిసిన పాంపేయో (కుడి)
అణు చర్చల నుంచి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోను తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేసింది. ఆయన 'నిర్లక్ష్యంగా', 'అర్థంలేకుండా' మాట్లాడుతున్నారని ఆరోపించింది.
పాంపేయో చర్చల్లో ఉంటే ఇక ముందు జరగబోయే చర్చలు 'నాసిరకంగా' ఉంటాయని, ఆయన బదులు మరింత జాగ్రత్తగా ఉండే ఎవరినైనా చర్చల్లో చేర్చాలని విదేశాంగ శాఖకు సంబంధించిన ఒక సీనియర్ అధికారి అన్నారు.
'టాక్టికల్ గైడెడ్ వెపన్' ప్రయోగించామని ఉత్తర కొరియా ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాంపేయో గత ఏడాది నాలుగు సార్లు ఉత్తర కొరియాలో పర్యటించారు. ఆ దేశ నేత కిమ్ జాంగ్-ఉన్‌తో కూడా సమావేశం అయ్యారు.
ఫొటో సోర్స్, Reuters
పాంపేయో ఎందుకు వివాదాస్పదం
గత వారం అమెరికా సెనేట్ సబ్ కమిటీ సమావేశంలో పాంపేయోను "మీరు కిమ్‌ను 'క్రూర పాలకుడు'గా వర్ణించారా?" అని అడిగారు. దానికి ఆయన "అవును, నేను కచ్చితంగా అలా అన్నాను" అని బదులిచ్చారు.
దీనిపై ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అధికారి నోన్ జాంగ్-గన్ తీవ్రంగా స్పందించారు. "పాంపేయో నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మా సుప్రీం నాయకుడి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు" అన్నారు.
హనోయ్ శిఖరాగ్ర సదస్సు అర్థాంతరంగా ముగియడానికి కూడా పాంపేయోనే కారణం అని నోన్ ఆరోపించారు.
గురువారం మాట్లాడిన ఆయన "ఇక ముందు జరిగే చర్చల్లో పాంపేయో కూడా ఉంటే చర్చలు మరోసారి విఫలమవుతాయి. చర్చలు చిక్కుముడిగా మారుతాయి" అన్నారు.
అమెరికాతో ఒక వేళ మేం మళ్లీ చర్చలు ప్రారంభించినా, అవతల ఉండేవారు పాంపేయో కాకుండా మాతో మరింత జాగ్రత్తగా, పరిణితితో మాట్లాడే వారే ఉంటారని ఆశిస్తున్నాం" అని నోన్ అన్నట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది
జూలైలో ప్యోంగ్‌యాంగ్‌లో జరిగిన చర్చల్లో దేశ అణు నిరాయుధీకరణకు సంబంధించి పాంపేయో ఒక ముఠా నాయకుడులా మాట్లాడిన వైఖరిని మేం ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా మరో ప్రయోగం
'శక్తిమంతమైన వార్ హెడ్'తో ఒక కొత్త 'టాక్టికల్ గైడెడ్ వెపన్'ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చల్లో ఏ ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత ఇలాంటి పరీక్ష జరగడం ఇదే మొదటిసారి.
ఆ దేశ మీడియా ఈ పరీక్షపై కొన్ని వివరాలు విడుదల చేసింది. కానీ వీటిని అమెరికాకు ముప్పు తెచ్చే లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగాలను మళ్లీ చేస్తున్నట్లు చూడకూడదని విశ్లేషకులు చెబుతున్నారు.
నవంబర్‌లో ఇలాంటి పరీక్షలే జరిగాయి. వాటిని అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్నారు.
గత శిఖరాగ్ర సదస్సు నుంచి అణు చర్చల్లో స్వల్ప పురోగతి మాత్రమే కనిపించింది.
అణునిరాయుధీకరణపై చర్చించేందుకు డోనల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్-ఉన్ ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హనోయ్‌లో భేటీ అయ్యారు. కానీ, చర్చలు విఫలమై ఇద్దరు నేతలూ అర్థంతరంగా వెళ్లిపోయారు.
చర్చలు కొనసాగించడానికి డోనల్డ్ ట్రంప్‌కు "సరైన వైఖరి అవసరమని" కిమ్ గత వారం అన్నారు.
ఫొటో సోర్స్, KCNA
ఉత్తర కొరియా ఏమంటోంది
ఈ పరీక్షలు స్వయంగా కిమ్ పర్యవేక్షణలోనే జరిగాయని కొరియన్ సెంట్రల్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) తెలిపింది.
వివిధ లక్ష్యాలపై రకరకాల పద్ధతుల్లో ఫైరింగ్ చేస్తూ ఈ పరీక్షలు నిర్వహించామని కేసీఎన్ఏ చెప్పింది. అంటే ఇది భూమి, నీళ్లు, గాలిలో ప్రయోగించగలిగే ఆయుధం అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పీపుల్స్ ఆర్మీ పోరాట పటిమను పెంచడానికి ఈ పరీక్షలకు చాలా కీలక ప్రాధాన్యం ఇస్తామని కిమ్ చెప్పారు.
ఉత్తర కొరియా మీడియా కథనాల్లో మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకమైన క్షిపణా, కాదా అనేదానిపై ఇంక స్పష్టత రాలేదు. కానీ ఇది బహుశా షాట్-రేంజ్ వెపన్ అయ్యుండవచ్చని చాలా మంది పరిశీలకులు అంగీకరిస్తున్నారు.
ఫొటో సోర్స్, AFP
ప్యాంగ్‌యాంగ్ తన అణుసామర్థ్యాన్ని ధ్రువీకరించుకోవడంతో తాము ఇక అణు పరీక్షలు ఆపివేస్తానని, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఉండదని ఉత్తర కొరియా నేత కిమ్ చెప్పారు.
అక్కడ అణు కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఉత్తర కొరియాలో ప్రధానంగా అణు పరీక్షలు నిర్వహించే ప్రాంతంలో గతవారం తీసిన శాటిలైట్ చిత్రాలు అక్కడ కదలికలు ఉన్నట్టు చూపించాయి. ఆ దేశం రేడియో యాక్టివ్ పదార్థాన్ని బాంబ్ ఇంధనంగా రీ ప్రాసెస్ చేస్తోందని తెలిపాయి.
లాంగ్ రేంజ్ మిసైళ్లు, అమెరికా మధ్యకు చేరగలిగే సామర్థ్యం ఉన్న బాలిస్టిక్ మిసైళ్లలో పట్టగలిగేంత చిన్న అణు బాంబును తయారు చేశామని ఉత్తర కొరియా ప్రకటించింది.
ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల తర్వాత ఉత్తర కొరియా తాజా ప్రకటనను వారికి జవాబుగా ఉత్తర కొరియా విశ్లేషకులు అంకిత్ పాండా భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, Reuters
అణు చర్చలు ఎక్కడున్నాయి
ఇద్దరు నేతల మాటలను పక్కనపెడితే, హనోయ్‌లో అమెరికా, ఉత్తర కొరియా నేతల మధ్య చర్చల తర్వాత అవి కాస్త మాత్రమే కదిలాయి.
అణు సామర్థ్యాన్ని వదులుకున్నందుకు తమపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని ఉత్తర కొరియా కోరడం వల్లే చర్చలు విఫలం అయ్యాయని అమెరికా చెప్పింది. కానీ ప్యాంగ్‌యాంగ్ దానిని తిప్పికొట్టింది.
కిమ్ తన తాజా వ్యాఖ్యల్లో ట్రంప్ పరస్పరం ఆమోదయోగ్యమైన ఒక ఒప్పందాన్ని కొనసాగించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడితో తనకు మంచి సంబంధాలున్నాయని కూడా చెప్పారు. దీనికి ట్వీట్ ద్వారా స్పందించిన ట్రంప్ కిమ్‌ను ప్రశంసించారు. మరో శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలన్న ఆయన ఆలోచనను స్వాగతించారు.
ఉత్తర కొరియా చివరి, పూర్తిగా ధ్రువీకృత అణు నిరాయుధీకరణ ప్రయత్నాలపై రష్యా అధికారులతో చర్చించేందుకు ఉత్తర కొరియా ప్రత్యేక రాయబారి స్టీఫెన్ బీగన్ మాస్కో వెళ్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఈ వారం మొదట్లో ప్రకటించింది.
దీంతో కిమ్ జాంగ్-ఉన్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య భవిష్యత్తులో చర్చలు జరగవచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కోతుల్లో మనిషి మెదడు జన్యువులు.. తొలిసారిగా శాస్త్రవేత్తల ప్రయోగం
- ఇద్దరు భారతీయుల 'శిరచ్ఛేదం' చేసిన సౌదీ అరేబియా
- వికీలీక్స్ సహ-వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అరెస్ట్
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- 'ఆలీబాబా' 996 విధానం: ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేయాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)