రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా? గురక వల్ల హాని ఉండదా?

ఫొటో సోర్స్, Getty Images
నిద్రకు సంబంధించిన కొన్ని అపోహలు మన మూడ్‌ను, ఆరోగ్యాన్ని పాడుచేస్తాయని, అలాంటి భ్రమల వల్ల ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
నిద్ర విషయంలో సాధారణంగా తలెత్తే ప్రశ్నల గురించి తెలుసుకోవడానికి న్యూయార్క్ యూనివర్సిటీ బృందం ఇంటర్నెట్‌లో జల్లెడ పట్టింది. అప్పుడు వారికి 'స్లీప్ హెల్త్' జర్నల్‌లో అచ్చయిన ఓ అధ్యయనం తారసపడింది.
నిద్ర సమస్యలను అత్యున్నతమైన శాస్త్రీయ రుజువులతో వారు పోల్చి చూశారు.
నిద్రకు సంబంధించిన అపోహలకు దూరంగా ఉంటే, మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ఆనందంగా జీవించొచ్చని ఈ బృందం ఆశిస్తోంది.
ఈ 6 అపోహలు మీకూ ఉన్నాయా?
1. రాత్రిపూట ఆల్కహాల్ తాగితే నిద్ర బాగా పడుతుంది
మందు తాగితే నిద్ర బాగా పడుతుందన్నది ఓ అపోహ మాత్రమేనని అధ్యయన బృందం చెబుతోంది. అది ఒక గ్లాసుడు వైన్ కావచ్చు లేదా విస్కీ కావచ్చు, ఒక బాటిల్ బీరు కావచ్చు. ఇదంతా వృధా ప్రయాస అని చెబుతున్నారు.
''పడుకోవడానికి లిక్కర్ లేదా వైన్ పనిచేయొచ్చు కానీ దానివల్ల, నిద్ర ద్వారా మీ శరీరానికి సహజంగా అందాల్సిన విశ్రాంతి మాత్రం దొరకదు'' అని డా.రాబిన్స్ అన్నారు.
నిద్రకు ముందు లిక్కర్ తీసుకుంటే, అది మీ ఆర్.ఇ.ఎమ్. నిద్రావస్థ (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్)ను భంగపరుస్తుంది. ఈ నిద్రావస్థ జ్ఞాపకాలకు, విషయాలను తెలుసుకోవడానికి చాలా ముఖ్యమైనది.
'లేదే.. మందు తాగాక నిద్ర బాగానే పడుతోందే!' అని ఆలోచించకండి. మీరు నిద్రపోగలరు కానీ, నిద్ర వల్ల కలిగే లాభాలను కోల్పోతారు.
మద్యం మూత్ర కారకం కూడా.. రాత్రిపూట మూత్ర విసర్జన కోసం అది మిమ్మల్ని నిద్రలేపుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
2. ఐదు గంటలకు మించి నిద్రపోరాదు
ఈ అపోహ చాలామందిలో ఉంటుంది. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ రాత్రిపూట 4 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మార్కెల్ కూడా తాను నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని అన్నారు.
అయితే, '5 గంటలు, లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడం ఆరోగ్యకరం' అన్న అపోహ అత్యంత ప్రమాదకరమని న్యూయార్క్ యూనివర్సిటీ బృందం చెబుతోంది.
''రాత్రిపూట 5 గంటలు, అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే, రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ'' అని డాక్టర్ రెబెకా రాబిన్స్ అన్నారు.
అలా చేయడం వల్ల గుండె జబ్బులు రావడం, ఆయుష్షు తగ్గడం జరగొచ్చు. అందువల్ల '5 గంటల నిద్ర'ను పక్కకు నెట్టి, రాత్రిపూట 7-8గంటలపాటు అందరూ నిద్రపోవాలని రాబిన్స్ చెబుతున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
3. నిద్రపోయే ముందు టీవీ చూడొచ్చు
''సాధారణంగా రాత్రిపూట వార్తలు చూస్తుంటాం. కానీ ఈ అలవాటు నిద్రలేమి (ఇన్సోమ్నియా) లేదా కుంగుబాటుకు దారి తీయవచ్చు'' అని రాబిన్స్ చెబుతున్నారు.
టీవీ మాత్రమే కాదు, పడకపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ వాడుతున్నపుడు వాటి నుంచి వెలువడే బ్లూ లైట్, నిద్రను కలిగించే మెలటోనిన్ హార్మోన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది.
4. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నా, అలా పడుకునే ఉండాలి
అవసరంలేదు అంటున్నారు రాబిన్స్. మరి అప్పుడు ఏంచేయాలి అంటే, నిద్ర కోసం ప్రయత్నించడం మానేయండని ఆమె అంటున్నారు.
ఆరోగ్యవంతమైన నిద్ర 15 నిమిషాల్లో పట్టేస్తుంది. 15నిమిషాల తర్వాత కూడా నిద్రపట్టలేదంటే, పడకపై అటూఇటూ దొర్లకుండా, పైకి లేవండి. లేచి, మీ గదిలో వాతావరణాన్ని కాస్త మార్చండి. చిన్నచిన్న పనులు చేయండి. బట్టలు మడత పెట్టడం కూడా చేయొచ్చు'' అని ఆమె సలహా ఇస్తున్నారు.
5. అలారం మోగాక వెంటనే లేస్తారా? మరో 5నిమిషాలు ప్లీజ్ అంటారా?
అలారం మోగిన వెంటనే మెలకువ వచ్చినా, మీలో ఎంతమంది మరో ఐదు, పది నిమిషాలు పడుకుంటారు? ఒకవేళ అలా పడుకున్నా, దానివల్ల లాభం ఉంటుందా అంటే ఉండదు. అలారం మోగిన వెంటనే నిద్రలేవాలని అధ్యయన బృందం చెబుతోంది.
''కాస్త ఇబ్బందిగా అనిపించినా, మరో ఐదు పది నిమిషాల నిద్రకు టెంప్ట్ కాకండి. అలా పడుకుంటే మీరు మళ్లీ నిద్రలోకి జారుకోవచ్చు కానీ, అది నాణ్యమైన నిద్ర కాదు'' అని రాబిన్స్ అంటున్నారు. వెంటనే బెడ్ దిగి, కర్టెన్లు, కిటికీలు తెరిచి, మిమ్మల్ని మీరు వెలుతుర్లోకి లాక్కెళ్లండి అని ఆమె చెబుతున్నారు.
6. గురక వల్ల ఎలాంటి హాని కలగదు
గురక వల్ల హాని లేకపోవచ్చు. కానీ క్రమరహిత నిద్రకు గురక ఒక లక్షణం కావచ్చు. నిద్రపోతున్న సమయంలో గురక వల్ల గొంతు కండరాల గోడలు రిలాక్స్ అయ్యి, కుచించుకుపోతాయి. అప్పుడు శ్వాస తీసుకోవడం ఆగిపోవచ్చు.
ఈ సమస్య ఉన్న వ్యక్తులకు హై బీపీ, క్రమరహితంగా గుండె కొట్టుకోవడంతోపాటు ఆ వ్యక్తులకు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
''మన ఆరోగ్యాన్ని మెరగుపరుచుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం, ఆనందంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి మనమందరం చేయగలిగిన పని నిద్రపోవడం'' అని రాబిన్స్ ముగించారు.
ఇవి కూడా చదవండి
- BBC FACT CHECK: అడ్వాణీని అమిత్ షా అవమానించారా?
- పుట్టిన శిశువు బయట బతకలేని వ్యాధి.. ‘హెచ్ఐవీ’తో జన్యు చికిత్స
- వారమంతా తక్కువ నిద్ర, వారాంతాల్లో ఎక్కువ నిద్ర... బ్యాలెన్స్ అవుతుందా?
- ప్రధానమంత్రి హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారి తనిఖీ చేయొచ్చా...
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- సముద్రంలోని ఇంట్లో కాపురమున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)