అమెరికా: తొమ్మిది మంది హత్యకు ఇద్దరు బాలికల కుట్ర

అమెరికా పాఠశాల

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలోని ఫ్లోరిడాలో 9 హత్యలకు ప్రణాళికలు వేసిన ఇద్దరు స్కూలు విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారని అమెరికా మీడియా వెల్లడించింది.

ఎవాన్ పార్క్ మిడిల్ స్కూల్లో చదవుతున్న ఈ బాలికలిద్దరి వయస్సు 14 సంవత్సరాలని, వీరిద్దరూ కలసి తొమ్మిది మందిని హత్య చెయ్యడానికి వేసిన పథకంగా భావిస్తున్న సమాచారాన్ని వారి పుస్తకాల్లో స్కూల్ టీచర్ గమనించారని పోలీసులు తెలిపారు.

తుపాకులు ఎలా సమకూర్చుకోవాలి, హత్య చేశాక శవాలను ఎలా తరలించాలి, వాటిని ఎలా మాయం చేయాలనే దానిపై ఎనిమిది పేజీల్లో వారు ప్లాన్ రాసుకున్నారని, వారిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నామని అధికారులు చెప్పారు.

హత్యకు కుట్ర చేయడం, అపహరణలకు కుట్ర చేయడానికి సంబంధించి మొత్తం 12 రకాల నేరాభియోగాలపై వీరిద్దరూ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

అమెరికా అమ్మాయిలు (ప్రతీకాత్మక చిత్రం)

వీరిని ఎలా గుర్తించారు?

ఈ బాలికలిద్దరూ వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయుడు గమనించారు. "ఎవరైనా చూసి, మనల్ని పిలిచి ఇదంతా ఏంటని అడిగితే, సరదాగా రాసుకున్నామని, జోక్ చేస్తున్నామని చెబుదాం" అని వాళ్లిద్దరూ మాట్లాడుకోవడాన్ని కూడా ఆయన విన్నారు.

ఆ తర్వాత ఆయన ఆ బాలికల పుస్తకాల్లో 'రహస్య సమాచారం', 'దీన్ని తెరవొద్దు', 'ప్రాజెక్ట్ 11/9' అని రాసి ఉన్న ఓ ఫోల్డర్ చూశారు.

కొన్ని పేర్లతో కూడిన ఓ జాబితా, హత్య ఎలా చేయాలో ప్రణాళికల వివరాలు ఆ ఫోల్డర్‌లో ఉన్నాయని ఎన్‌బీసీ మీడియా వెల్లడించింది.

తుపాకులు సిద్ధం చేసుకోవడం నుంచి, సాక్ష్యాలను మాయం చెయ్యడం, శవాలను తగలబెట్టడం, పూడ్చడం వంటి వివరాలన్నీ ఆ పేపర్లలో ఉన్నాయి.

ఈ ఆపరేషన్ కోసం తాము ఎలాంటి దుస్తులు ధరించాలో కూడా ఈ బాలికలు ముందుగానే ఆ పేపర్లలో రాసుకున్నారు.

"మన వేళ్లకు గోళ్లుండకూడదు, జుట్టు బయటకు కనిపించకూడదు" అని వాళ్లు రాసుకున్నారు.

"అది జోక్ అని వాళ్లనుకుంటే సరిపోదు" అని ఓ అధికారి అన్నారని ఫాక్స్47 వార్తా ఛానల్‌ తెలిపింది.

"ఇలాంటి వాటిపై జోక్స్ వేయడం సరికాదు. హత్యలు చేస్తామని సరదాగా మాట్లాడుకోవడం కుదరదు" అని ఆ అధికారి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)