సౌదీ అరేబియాలో భారత కార్మికుల కష్టాలకు కారణాలేంటి?

సౌదీ వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

మధ్య ప్రాచ్య ప్రాంతంలో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. దాదాపు 1.11 కోట్ల మంది ప్రవాసులు ఈ రాజ్యంలో జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి వచ్చినవారే. అత్యధికులు భారతీయులే.

2017 మార్చి నాటి లెక్కల ప్రకారం సౌదీలో ఉన్న భారతీయుల సంఖ్య సుమారు 30 లక్షలు. పాకిస్థానీల సంఖ్య 15 లక్షలు, బంగ్లాదేశీయులు 13 లక్షలు, ఇండోనేసియన్లు 12 లక్షలు, ఫిలిప్పీన్స్ జాతీయులు 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఈజిప్ట్‌ దేశానికి చెందిన 80 వేల మంది, శ్రీలంక పౌరులు 50 వేల మంది కూడా సౌదీలో పనిచేస్తున్నారు.

సౌదీలో ఉంటున్న భారతీయులను చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. ఏజెంట్ల మోసాలకు కొందరు బాధితులుగా మారుతుంటే.. కఠినమైన సౌదీ చట్టాల వల్ల ఇంకొందరు ఇక్కట్ల పాలవుతున్నారు.

ఇటీవల సత్విందర్, హర్జీత్ సింగ్‌ అనే ఇద్దరు భారతీయులకు సౌదీ శిరచ్ఛేదం శిక్షను అమలు చేసింది. పంజాబ్‌కు చెందిన వీరిద్దరూ సౌదీలో వర్క్ పర్మిట్‌తో పనిచేస్తున్నారు. హత్య కేసులో వీరికి సౌదీ మరణ శిక్షను విధించింది.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ దీన్ని క్రూరమైన చర్యగా వర్ణించారు.

ట్విటర్‌లో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌కు చాలా మంది ప్రవాసులు సమస్యలు చెప్పుకొంటూ రోజూ ట్వీట్లు చేస్తుంటారు. జీతాలు రావట్లేదని, వేధింపులకు గురవుతున్నామని ఫిర్యాదులు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రతికూల దేశంగా మారిందా?

సౌదీలో స్థానికులు ఆసక్తి చూపించన ఉద్యోగాల్లో పనిచేసేందుకు దశాబ్దాలుగా భారత్, ఫిలిప్పీన్స్‌ల నుంచి చాలా మంది ఆ దేశానికి వలస వెళ్తున్నారు.

'వాల్ స్ట్రీట్ జనరల్' నివేదిక ప్రకారం సౌదీలో వంటపని, భవన నిర్మాణ పనులు, దుకాణ కౌంటర్‌ ఉద్యోగాల్లో ఈ రెండు దేశాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు.

సౌదీలో స్థానికులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేటు ఉద్యోగాలపై పెద్దగా ఉత్సాహం చూపించరు.

సౌదీలో ఉండే సంస్థల్లో పనిచేసే అక్కడి పౌరులకు పని గంటలు తక్కువగా ఉంటాయి. వేతనాలు కూడా ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

అక్కడి నియమాలను అనుసరించి సంస్థలు స్థానికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటాయి. లేకుంటే జరిమానా, వీసా పరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అవసరం లేకున్నా కేవలం నిబంధనలను పాటించేందుకే స్థానికులను చాలా సంస్థలు ఉద్యోగాల్లో పెట్టుకుంటుంటాయని 'వాల్ స్ట్రీట్' నివేదిక వెల్లడించింది.

తమ సంస్థలో పనిచేస్తున్న సౌదీ పౌరుల్లో సగం మంది నామమాత్రంగా ఉద్యోగాల్లో ఉన్నవారేనని అక్కడి ఓ లాజిస్టిక్ కంపెనీలోని ఉద్యోగిగా ఉన్న అబ్దుల్ మోహ్‌సీన్ వాల్ స్ట్రీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

''విదేశీ ఉద్యోగులు లేకుండా ఈ సంస్థ నడవదు. కొన్ని ఉద్యోగాలు స్థానికులు చేయరు. ట్రక్కు డ్రైవర్ ఉద్యోగం అలాంటిదే'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్న నిరుద్యోగం

కార్మికుల్లో తమ దేశ పౌరులకు ప్రాధాన్యం ఉండాలని సౌదీ పాలకులు కోరుకుంటున్నారు. అయితే, ఆర్థిక నష్టం కలిగించే స్థాయికి దీన్ని అమలు చేయడం సరికాదు.

చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన సౌదీని మరింత ముందుకు నడిపించాలని ఆ దేశ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అనుకుంటున్నారు. చమురు మీద ఆధారపడకుండా తమ ఆర్థిక వ్యవస్థ పనిచేయగలిగినప్పుడే అది ప్రగతి శీలంగా మారినట్లని ఆయన భావిస్తున్నారు.

అందుకే పౌరులను ప్రైవేటు ఉద్యోగాల వైపు దృష్టి సారించేలా చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు.

'రాయిటర్స్' వార్తాసంస్థ నివేదిక ప్రకారం ప్రభుత్వ చమురు సంస్థలోని స్వల్ప వాటాను విక్రయించేందుకు సౌదీ సిద్ధమైంది. త్వరలోనే దీని షేర్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

సౌదీ కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉద్యోగాలు చేసే ఆ దేశ పౌరుల్లో మూడింట రెండొంతుల మంది ప్రభుత్వ కొలువుల్లోనే ఉన్నారు.

విదేశీయుల స్థానంలో స్థానికులను నియమించుకోవాలన్న ఒత్తిడి సంస్థలపై పెరుగుతోంది.

ప్రభుత్వ సమాచారం ప్రకారం సౌదీలో నిరుద్యోగం 12.8 శాతంగా ఉంది. 2030 కల్లా దీన్ని 7 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'సౌదీకరణ' మంత్రం

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వివిధ రంగాల్లో సౌదీ కార్మికులను నియమించుకోవాలని సంస్థలపై సౌదీ మరింత ఒత్తిడి తీసుకువస్తోంది. సేల్స్‌మెన్, బేకరీ, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పనిచేస్తున్న విదేశీయులపై దీని ప్రభావం పడనుంది.

గతేడాది ఆభరణాల రంగంలోనూ ఇలాగే విదేశీయుల స్థానంలో సౌదీ పౌరులను నియమించుకోవాలని ప్రభుత్వం సంస్థలకు సూచించింది. దీంతో ఆ రంగం చాలా ఒడిదుడుకులకు గురైంది.

ఉద్యోగాల్లో నియమించుకునేందుకు సౌదీ పౌరులను వెతుక్కోవడం సంస్థలకు కష్టమైందని, వందల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోవడంతో ఆభరణాల రంగంపై దుష్ప్రభావం పడిందని 'గల్ఫ్ బిజినెస్' వార్తా సంస్థ విశ్లేషించింది.

24 ఏళ్ల అలీ అల్-ఆయద్ కుటుంబం సౌదీలో ఓ సంస్థను నడుపుతోంది.

తమది బంగారానికి సంబంధించిన వ్యాపారమని, దీనికి సంబంధించిన పనులు చేయడం అందరి వల్లా కాదని 'వాల్ స్ట్రీట్‌'తో ఆయన అన్నారు.

అయితే, తమ పనికి అవసరమైన విధంగా శిక్షణ పొందిన సౌదీ పౌరులు లేరని చెప్పారు.

తాము ఇంటర్నెట్‌లో ఉద్యోగ ప్రకటన ఇచ్చినప్పుడు కొందరు మాత్రమే పని చేసేందుకు వచ్చారని అలీ పేర్కొన్నారు. పని వేళలు, సెలవుల విధానం నచ్చక తక్కువ వ్యవధిలోనే కొందరు మానేశారని తెలిపారు.

ఈ పరిణామం తర్వాత సౌదీ వారికి శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు భారతీయులను అలీ కుటుంబం నియమించుకున్నట్లు 'వాల్ స్ట్రీట్' పేర్కొంది.

సేల్స్‌మెన్ ఉద్యోగాల్లోనూ స్థానికులనే నియమించుకోవాలని సౌదీ సంస్థలపై ఒత్తిడి తెస్తోంది.

దీని ప్రభావం ప్రవాస భారతీయులపై ఎక్కువగా ఉండొచ్చు. చాలా మంది స్వదేశానికి తిరిగి వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

'ఖరీదు కానున్న కార్మిక వీసాలు'

విదేశీ కార్మికుల వీసా రుసుమును సౌదీ పెంచనున్నట్లు 'న్యూయార్క్ టైమ్స్' ఓ కథనం ప్రచురించింది.

ఉద్యోగుల్లో స్థానికుల కన్నా విదేశీయులను ఎక్కువగా నియమించుకునే ప్రైవేటు సంస్థలకు ఆ దేశం జరిమానా వేయనుందని పేర్కొంది.

నియమాలను పాటించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని.. అయితే, ఉద్యోగాల్లో నియమించుకునేందుకు తమకు సౌదీ పౌరులు దొరకడం లేదని సంస్థల యజమానులు అంటున్నారు.

సౌదీ కార్మికులు పని చేయరని, వేతనాలు మాత్రం తీసుకుంటారని జెడ్డాలో ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న అబుజా యెద్ 'వాల్ స్ట్రీట్‌'కు చెప్పారు.

తమ సంస్థపై ప్రభుత్వం 65 వేల రియాళ్ల జరిమానా విధించిందని, విదేశీ కార్మికులను నియమించుకోకుండా వీసాల జారీని నిలిపివేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకూ తమ సంస్థ నడిస్తే గొప్ప విషయమేనని ఆయన అన్నారు.

సౌదీ అధికారులపై అక్కడి ప్రైవేటు సంస్థల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. వీటి పరిష్కరణ కోసం ఈ నెల ఆరంభంలో అబుల్ అజీజ్‌ను సల్మాన్ మంత్రిగా నియమించారు.

సేల్స్‌మెన్ ఉద్యోగాల నుంచి విదేశీయుల తొలగింపు తర్వాత 'సౌదీకరణ'ను మరింత విస్తృతం చేయాలని సౌదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ద అరబ్ న్యూస్ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీలో పనిచేయడం విదేశీయులకు కష్టం కానుంది.

నీరు, విద్యుత్, ఇంధనంపై ఇచ్చే రాయితీలను సౌదీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. అదనంగా 5 శాతం పన్నును విధించింది. దీన్ని సమతుల్యం చేయడం కోసం ఉద్యోగాలు చేయడంవైపు పౌరులను మళ్లించేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది.

సౌదీకరణ కారణంగా ఆభరణాల రంగంలో చాలా దుకాణాలు మూతపడ్డాయి. డిసెంబర్ తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుంది.

సౌదీ పౌరులు తక్కువ పని గంటలు ఉండాలని కోరుకుంటున్నారని, షిఫ్ట్‌ల్లో పనిచేయడానికీ ఇష్టపడటం లేదని ద అరబ్ న్యూజ్ పేర్కొంది. విదేశీయులతో పోలిస్తే రెండింతల వేతనాన్ని వారు ఆశిస్తున్నారని తెలిపింది.

ఫొటో సోర్స్, AFP

సౌదీకరణ ప్రభావం చూపుతుందా?

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు సౌదీకరణతో కళ్లెం వేయొచ్చని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ విధానం అనుకున్న ప్రభావాలను చూపదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

''ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో సౌదీ శ్రామికశక్తి సేవల రంగంవైపు మళ్లడం సులభం కాదు. ఇందుకు పదేళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టొచ్చు. సాంస్కృతికంగా ఈ మార్పు మొదలవ్వాలి. సేవలు, చిల్లర వర్తకం, భవన నిర్మాణం రంగాల్లో సౌదీ పౌరులు పనిచేయడం కష్టం'' అని వాషింగ్టన్‌లోని అరబ్ గల్ఫ్ స్టేట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్కాలర్ కోరెన్ యుంగ్ అన్నారు.

''సౌదీ పౌరులు సోమరితనంతో ఉంటారని, పని చేయడానికి ఇష్టపడరని సంస్థలు అంటున్నాయి. మొదట అక్కడి వారిని పనిచేసే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వాళ్ల ఆలోచన వైఖరిని మార్చాలి. సౌదీకరణ విధానం ఓ భ్రమ లాంటిది. దాన్ని ముగించాలి'' అని సౌదీ గెజెట్ పత్రిక కాలమిస్ట్ మహమ్మద్ బాస్వానీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)