శ్రీలంక పేలుళ్లు: 359 మంది మృతి, 500 మందికి గాయాలు

పేలుడు తర్వాత కొలంబోలోని కోచ్చికడేలో సెయింట్ ఆంథోనీ చర్చ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

పేలుడు తర్వాత కొలంబోలోని కోచ్చికడేలో సెయింట్ ఆంథోనీ చర్చ్

శ్రీలంక ఈ ఉదయం నుంచి పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని కొలంబోతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఈస్టర్ రోజున మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో 359 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. వీరిలో 27మంది విదేశీయులున్నారని గుర్తించారు.

దేశంలో ఉదయం ఆరు పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం మరో రెండు పేలుళ్లు సంభవించాయి.

ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంటెలిజెన్స్ సంస్థలకు ముందస్తుగా కొంత సమాచారం అందిందని, కానీ తగిన జాగ్రత్త చర్యలు తీసుకునేలోపే పేలుళ్లు సంభవించాయని శ్రీలంక రక్షణ శాఖ మంత్రి రువాన్ విజేవర్థనె మీడియాకు తెలిపారు.

వీటిలో చాలా వరకూ ఆత్మాహుతి దాడులేనని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచే ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందని అన్నారు.

మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్‌లో వెల్లడించారు. వారి పేర్లు లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అని నేషనల్ హాస్పిటల్ తమకు తెలిపిందని కొలంబోలోని భారత హైకమిషన్ స్పష్టం చేసినట్లు సుష్మ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

ఓ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్న శ్రీలంక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

డెమాతగోడ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

పేలుడులో ధ్వంసమైన కొలంబోలోని షాంగ్రి లా హోటల్

దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.

"రక్షణ శాఖ కార్యదర్శి, మిలిటరీ కమాండర్లు, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌తో నిరంతరం చర్చిస్తున్నాం. పరిస్థితులు కుదుటపడేవరకూ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాం. మా దేశంలో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటాం. వారి ఆటలు మా భూభాగంపై సాగనివ్వం. వారు ఏ మతం వారైనా విడిచిపెట్టం. వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో మన దేశం నుంచి వారు ఎలాంటి ఉగ్రదాడులకు పాల్పడకుండా అడ్డుకుంటాం. సీఐడీ, పోలీస్, మిలిటరీ సిబ్బంది ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నారు. ఈ దాడులకు పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంటాం" అని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజేవర్ధనే తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

సెయింట్ ఆంథోనీ చర్చ్ దగ్గర విరిగిపడిన మేరీమాత విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోచ్చికడేలో సెయింట్ ఆంథోనీ చర్చి వెలుపల భద్రతా సిబ్బంది, అంబులెన్సులు

ఈస్టర్ ప్రార్థనల సమయంలో కొలంబోలోని కోచ్చికడే, నెగోంబో, బట్టికలోవాలలో ఉన్న మూడు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి.

కొలంబోలోని షాంగ్రి లా, సిన్నామన్ గ్రాండ్, కింగ్స్‌బరీ హోటళ్లు కూడా లక్ష్యంగా మారాయి. ఏడో పేలుడు రాజధాని దెహీవాలా జూ సమీపాన జరిగింది.

సిన్నామన్ గ్రాండ్ హోటల్ ప్రధానమంత్రి అధికార నివాసానికి సమీపంలోనే ఉంది.

పోలీసు బృందాలు కొలంబోలోని డెమాతగోడ ప్రాంతంలోని ఓ ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అకస్మాత్తుగా సంభవించిన ఎనిమిదో పేలుడులో ముగ్గురు పోలీసులు మరణించారు. వారు బాంబును నిర్వీర్యం చేస్తుండగా అది పేలి చనిపోయారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

వీడియో క్యాప్షన్,

‘శరీర భాగాలు తెగిపడి కనిపించాయి’

నెగోంబోలో 50 మంది చనిపోయారని అక్కడి పోలీసు ప్రధాన కార్యాలయం తెలిపింది. సెయింట్ ఆంథోనీ చర్చ్‌లో 30 మంది మరణించారు.

కొలంబోలోని జాతీయ ఆస్పత్రిలో 45 మృతదేహాలు ఉన్నాయని, వీటిలో తొమ్మిది మృతదేహాలు విదేశీయులవని ఆస్పత్రి డైరెక్టర్ చెప్పారు.

2009లో ఎల్‌టీ‌టీఈని అంతమొందించినప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీలంక ఎన్నడూ ఇంత హింసాత్మక ఘటనను చూడలేదని, దేశ ప్రజలు దిగ్భ్రాంతిలో ఉన్నారని బీబీసీ సింహళ సర్వీసు ప్రతినిధి అజామ్ అమీన్ తెలిపారు.

మరిన్ని దాడులు జరగొచ్చనే అంచనాతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రభుత్వం భద్రతను పెంచిందని ఆయన చెప్పారు.

ప్రజలు సంయమనం పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

దర్యాప్తులో అధికార యంత్రాంగానికి సహకారం అందించాలని ఆయన కోరారు.

వీడియో క్యాప్షన్,

శ్రీలంకలో పేలుళ్లు (వీడియో సౌజన్యం: Adaderana.Lk)

పేలుళ్లను శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు.

ఈ విషాద సమయంలో శ్రీలంక ప్రజలందరూ సమైక్యంగా, దృఢంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

నిర్ధరణ కాని సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేయొద్దని ఆయన కోరారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని భరోసా ఇచ్చారు.

"కొలంబోలో ఈరోజు జరిగిన పేలుళ్లలో 27 మంది విదేశీయులు మరణించారు. శ్రీలంకలో గత 30 ఏళ్లుగా ఎప్పుడూ విదేశీయులపై దాడులు జరగలేదు, కానీ ఈసారి విదేశీయులే లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి" అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రధాని ప్రస్తుతం అత్యవసర సమావేశం నిర్వహించారు.

శ్రీలంక మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు మహింద రాజపక్సే ఈ పేలుళ్లను ఖండించారు.

ఇది అమానవీయమైన చర్యని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీలంక పేలుళ్లను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు.

"మన ప్రాంతంలో ఇలాంటి ఆటవిక చర్యలకు తావు లేదు. శ్రీలంక ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోంది" అని మోదీ ట్విటర్‌లో చెప్పారు.

బాధితుల కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు.

"శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో 138 మంది మరణించారు. 600 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక ప్రజలకు మా సానుభూతి ప్రకటిస్తున్నాం. అవసరమైన సహాయం అందించడానికి మే సిద్ధంగా ఉన్నాం" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్‌లో తెలిపారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ పేలుళ్లను ఖండిస్తూ- ఈ విషాద సమయంలో శ్రీలంకకు పాక్ పూర్తి సంఘీభావాన్ని తెలుపుతోందని ట్విటర్‌లో చెప్పారు.

శ్రీలంకలో అమాయకులపై జరిగిన ఈ "ఉగ్రవాద దాడులను" ఖండిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.

పరిస్థితులను గమనిస్తున్నాం: సుష్మా స్వరాజ్

శ్రీలంకలో వరుస పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

"శ్రీలంకలో ఎందరినో చంపి, మరెందరినో గాయపరిచిన ఈ వరుస పేలుళ్లను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు మా సానుభూతిని వ్యక్తిం చేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలను కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి భారత్ ఎప్పుడూ వ్యతిరేకమే. ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా పోరాడాలి. ఉగ్రవాద చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదు. ఇంతటి దారుణ చర్యలకు ఒడిగట్టినవారిపైన, వారికి మద్దతునిస్తున్నవారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి" అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

కొలంబోలోని భారత హైకమిషన్‌తో నిరంతరం మాట్లాడుతున్నానని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్‌లో చెప్పారు.

అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ఆమె తెలిపారు.

పేలుళ్ల ఘటనలకు సంబంధించి సహాయం కోసం భారతీయ పౌరులు ఫోన్లో సంప్రదించాలని సూచిస్తూ కొన్ని నంబర్లను కొలంబోలోని భారత హైకమిషన్ ట్విటర్‌లో పెట్టింది.

ఇస్లామిక్ స్టేట్ నుంచి శ్రీలంకకు వెనుదిరిగి వస్తున్న మిలిటెంట్ల నుంచి దేశంలో ముప్పు ఏర్పడవచ్చనే ఆందోళనలు ఉన్నాయి.

పాతికేళ్లు సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసినప్పటి నుంచి శ్రీలంక చాలా వరకు ప్రశాంతంగానే ఉంది.

అప్పుడప్పుడు అక్కడక్కడ మాత్రమే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

మెజారిటీలైన కొందరు బౌద్ధ సింహళీయులు మసీదులపై, ముస్లింల వ్యాపార సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారు.

ఈ పరిస్థితుల కారణంగా 2018 మార్చిలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోచ్చికడేలో పేలుడు నేపథ్యలో చర్చి ప్రాంతంలో గస్తీ కాస్తున్న భద్రతా సిబ్బంది

పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ పాఠశాలలకు రెండు రోజులు (ఈ నెల 22, 23) సెలవులు ప్రకటించారు.

శ్రీలంకలో ఏ మతం వారు ఎంత శాతం?

శ్రీలంక జనాభాలో 70.2 శాతం మంది వరకు తేరవాద బౌద్ధం మతాన్ని ఆచరిస్తారు. మెజారిటీలైన సింహళీయుల మతం ఇదే. దేశ చట్టాల్లో దీనికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. రాజ్యాంగంలోనూ ప్రత్యేక స్థానం ఉంది.

హిందువులు 12.6 శాతం మంది, ముస్లింలు 9.7 శాతం మంది ఉన్నారు.

క్రైస్తవులు దాదాపు 15 లక్షల మంది ఉన్నారని 2012 గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికులు రోమన్ కాథలిక్‌లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)