శ్రీలంక పేలుళ్లు: 'టిఫిన్ తినడం ఆలస్యం కాకపోతే నేనూ చనిపోయేవాడిని'

ఫొటో సోర్స్, Reuters
తమ వాళ్లను కోల్పోయి విలపిస్తున్న పేలుళ్ల బాధిత మహిళ
శ్రీలంక ఆదివారం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగిన ఎనిమిది వరుస పేలుళ్లలో 359 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో 27 మంది విదేశీయులున్నారని అధికారులు తెలిపారు.
పేలుళ్లకు బాధ్యులెవరనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇవన్నీ ఒక గ్రూపు పనే అయ్యి ఉండవచ్చని శ్రీలంక రక్షణ శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.
ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.
పేలుళ్ల సమాచారం అందగానే కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులందరూ కనీసం 4 గంటల ముందుగా ఎయిర్‌పోర్టుకు రావాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
రద్దీని తగ్గించడానికి, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేవలం ప్రయాణికులు మాత్రమే ఎయిర్ పోర్టుకు రావాలని, ఇతరులెవరూ రావద్దని కూడా సూచించారు. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ప్రయాణికులు విమానాశ్రయానికి రావచ్చని, అవసరమైన పత్రాలను తనిఖీ లేదా భద్రతా సిబ్బందికి చూపించాల్సి ఉంటుందని వెల్లడించింది.
నేను బయటకు వచ్చాను, బాంబు పేలింది: సినీ నటి రాధిక
ప్రముఖ తమిళ, తెలుగు సినీ నటి రాధిక పేలుడు జరగడానికి కొన్ని నిమిషాల ముందే సిన్నమోన్ గ్రాండ్ హోటల్ నుంచి బయటకు వచ్చారు.
"సిన్నమోన్ హోటల్ నుంచి నేను అప్పుడే బయటకు వచ్చాను. వెంటనే పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. నేను నమ్మలేకపోయాను. చాలా షాక్ అయ్యాను" అని ట్విటర్ ద్వారా రాధిక వెల్లడించారు.
ఫొటో సోర్స్, EPA
రక్తసిక్తమైన షాంగ్రిలా హోటల్
రక్తసిక్తమైన షాంగ్రిలా హోటల్
ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్, 30 ఏళ్ల క్రితం బ్రిటన్‌లో స్థిరపడిన శ్రీలంక వాసి కీరన్ అరసరత్నమ్ షాంగ్రిలా హోటల్‌లో ఉన్నారు. ఓ సామాజిక వాణిజ్య కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన శ్రీలంక వచ్చారు. ఆ హోటల్ రెస్టారెంట్‌లో జరిగిన పేలుడుకు సంబంధించి ఆయన బీబీసీతో మాట్లాడారు.
ఉన్నట్లుండి ఏదో పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వచ్చింది. ప్రాణాలు కాపాడుకోవాలనే ఆతృతలో 18వ అంతస్తు నుంచి కిందకు పరుగు ప్రారంభించాను. అందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. గదిలో ఏమూలన చూసినా రక్తపు మరకలే.
అక్కడున్నవారికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అందరూ పరిగెడుతున్నారు. వారి బట్టలపై రక్తపు మరకలు ఉన్నాయి. ఓ బాలికను అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. గోడలు, నేల... అంతా రక్తమే.
నేను బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం ఆలస్యం చేసి ఉండకపోతే నేను కూడా ఈ పేలుళ్లలో చనిపోయేవాడిని. ప్రస్తుతం నేను ఓ అత్యవసర సహాయ కేంద్రంలో ఉన్నా. ఇక్కడంతా రక్తపు వాసనే వస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
బట్టికలోవా: చిన్నారుల మృతి
దాడి జరిగిన మూడు చర్చిల్లో ఒకటి బట్టికలోవా ప్రాంతంలో ఉంది. నగరంలోని టీచింగ్ హాస్పిటల్‌లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
"పేలుడు జరిగిన ప్రదేశం నుంచి నల్లటి పొగ రావడాన్ని గమనించాం. గాయపడినవారిని తరలించేందుకు వారు సాయం కోసం గట్టిగా అరిచారు" అని ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జులవీరసింగం తెలిపారు.
"మొత్తం 40 మంది మరణించగా మా దగ్గరకు 25 మృతదేహాలు తీసుకొచ్చారు. వీటిలో 5 మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించడానికి వీలులేని విధంగా ఉన్నాయి. ముందు ఐదుగురు చిన్నారుల మృతదేహాలు వచ్చాయి. ఇంకా చాలామంది గాయపడిన చిన్నారులు కూడా ఇక్కడకు వచ్చారు. నాకు సంఖ్య సరిగ్గా గుర్తు లేదు. కానీ వాళ్లు ఓ 15 మంది వరకూ ఉండొచ్చు."
ఫొటో సోర్స్, EPA
ఒక్క గంట ఆలస్యం కారణంగా చావు తప్పించుకున్నా
"నేను విమానాశ్రయం నుంచి ఒక్క గంట ఆలస్యంగా వెళ్లడం వల్ల బాంబు దాడి నుంచి తప్పించుకున్నా" అని కన్జర్వేటివ్ మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ (ఎంఈపీ) నెర్జ్ దెవా స్కై న్యూస్‌తో మాట్లాడుతూ అన్నారు.
"నేను ఇక్కడకు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులన్నీ భీతావహంగా ఉన్నాయి. చాలామంత్రి పర్యటకులు, హోటల్ సిబ్బంది లాబీల్లో పడి ఉన్నారు. నేను ఆలస్యంగా రాకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో" అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, Reuters
బాంబు పేలినప్పుడు మేం గదిలోనే ఉన్నాం
"మేము మా హోటల్ గదిలో ఉన్నాం. ఉన్నట్లుండి పేలుడు శబ్దం వినిపించింది. అప్పుడు సమయం 8.30 కావచ్చు. వెంటనే లాంజ్‌లోకి పరుగులు తీశాం. మమ్మల్ని వెనక వైపు నుంచి బయటకు పరిగెత్తమని అక్కడున్నవారు గట్టిగా అరుస్తూ సూచిస్తున్నారు. ఆ మార్గం నుంచే గాయపడినవారిని, చనిపోయినవారిని బయటకు తీసుకెళ్లడం మేం చూశాం" అని డాక్టర్ ఇమాన్యుయెల్ తెలిపారు.
డాక్టర్ ఇమాన్యుయెల్ శ్రీలంకలో పెరిగి, తన కుటుంబంతోపాటు యూకేలో నివాసముంటున్నారు. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వారు ఓ వారం పర్యటనకు ఇక్కడకు వచ్చారు. పేలుడు జరిగినప్పుడు వారంతా సిన్నమోన్ గ్రాండ్ హోటల్‌లోనే ఉన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఉన్నట్లుండి అంబులెన్సులు వేగంగా వెళ్లాయి
పెద్ద శబ్దం వినిపించింది. ఓ వైపు నుంచి పొగ రావడం కనిపించింది. వెంటనే అంబులెన్స్‌లు వేగంగా వెళ్లడం చూశాం. అక్కడున్నవాళ్లంతా ఏడుస్తున్నారు. ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లాలని మాకు కొందరు సూచించారు అని డాక్టర్ సైమన్ విట్‌మార్ష్ బీబీసీతో చెప్పారు.
డాక్టర్ విట్‌మార్ష్ వేల్స్‌లో నివసించే పిల్లల వైద్య నిపుణుడు. విహార యాత్ర కోసం శ్రీలంకకు వచ్చారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆయన సైక్లింగ్ చేస్తున్నారు.
"నేను డాక్టర్ని కావడంతో సేవలందించేందుకు హాస్పటల్‌కు వెళ్లాను. అక్కడంతా సైన్యంతో నిండిపోయింది. దాని చుట్టూ ఉన్న వీధులన్నీ మూసేశారు" అని ఆయన తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
కొలంబోలోని సిన్నమోన్ గ్రాండ్ హోటల్
క్యూలైన్ ముందుకొచ్చి పేల్చుకున్నాడు
ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి సిన్నమోన్ గ్రాండ్ హోటల్‌లో పేలుడుకు పాల్పడేముందు బఫె మొదలయ్యే వరకూ క్యూలైన్‌లోనో నిలబడి ఎదురుచూశాడు అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. క్యూ లైన్ ముందుకు వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని హోటల్ మేనేజర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- శ్రీలంకలో ఆత్మాహుతి దాడులు: 207 మంది మృతి, 450 మందికి గాయాలు, దేశవ్యాప్తంగా కర్ఫ్యూ
- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే
- ఐపీఎల్ 2019: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం
- లోక్‌సభ ఎన్నికలు 2019: లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టి పోటీఇచ్చేదెవరు
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)