లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ

లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ

ఈసారి మీరు సీఫుడ్ తింటున్నప్పుడు, వాటి గుల్లలు బయట పడేయకండి. అవి పర్యావరణాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడతాయి.

లాబ్‌స్టర్స్, పీతల్లాంటి గుల్లలున్న సముద్ర జీవులు ఇప్పుడు ప్రపంచంలో పేరుకుపోతున్న ప్రమాదకరమైన సమస్యకు ఒక పరిష్కారం అందించగలవు.

ప్రపంచంలో ప్రస్తుతం ప్రతి ఏటా దాదాపు 500 బిలియన్ ప్లాస్టిక్ సంచులు వాడుతున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల సుమారు 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తోందని, దానివల్ల సముద్రంలో ఉన్న ఎన్నో జీవులకు ముప్పు వచ్చిందని చెబుతోంది.

లండన్‌లోని ఒక స్టార్టప్ సంస్థ లాబ్‌స్టర్స్‌ నుంచి బయో ప్లాస్టిక్‌ తయారుచేసే ప్రయోగాలు చేస్తోంది.

లాబ్‌స్టర్స్, పీతలు లాంటి జీవులకు వాటి గుల్లల్లో చిటిన్ అనే పదార్థం ఉంటుంది. దాని నుంచి వచ్చే బయో-పాలిమర్‌తో ప్లాస్టిక్ సంచులు చేయచ్చని సంస్థ చెబుతోంది.

ఈ జీవుల గుల్లలను మొదట బ్లెండర్‌తో పొడిచేస్తారు. దానిలోంచి చిటిన్ వెలికితీస్తారు. ఆ 'చిటోసన్ పౌడర్‌'ను వినిగర్‌తో కలుపుతారు.

ఈ సంచులు నిజానికి కాలుష్య కారకం కాని ఎరువు లాంటిది. ఈ ప్లాస్టిక్‌ను ముక్కలు చేసి మొక్కల కుండీల్లో వేస్తే అవి బాగా ఏపుగా పెరుగుతాయి.

కానీ కొందరు మాత్రం ఇది ఇప్పట్లో సాధ్యం కాదని అంటున్నారు. ఈ ప్లాస్టిక్‌తో సంచులు చేయడం భారీ పరిశ్రమలు ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసినంత చౌకగా ఉండదని చెబుతున్నారు.

ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం ఇలాగే ఉంటే 2050 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్ అక్కడ ఉన్న చేపల బరువును మించిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)