శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల్లో జేడీఎస్ కార్యకర్తలు మృతి.. 'ఇస్లామిస్ట్ గ్రూప్'పై అనుమానాలు

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం జరిగిన వరుస పేలుళ్లకు ఆత్మాహుతి దాడులే కారణమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ పేలుళ్లకు విదేశాల్లో కుట్ర పన్నినట్లు తెలిపింది.
శ్రీలంకలో ఇప్పటివరకూ జరిగిన 8 పేలుళ్లలో 359 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు. సుమారు 500 మంది గాయపడ్డారు.
మృతుల్లో 36 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి 24 మందిని అరెస్ట్ చేశారు.
ఆదివారం జరిగిన పేలుళ్లలో బెంగళూరుకు చెందిన జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఐదుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. టిఫిన్ తినడానికి హోటల్ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన పేలుడులో వీరు మరణించారు. కర్నాటకలో ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఏడుగురు సభ్యులు శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు.
వీరిని కర్ణాటక జేడీఎస్ పార్టీ కార్యకర్తలు కేజీ హనుమంతరాయప్ప, ఎం రంగప్ప, కేఎం లక్ష్మీనారాయణ్, లక్ష్మణ గౌడ రమేశ్గా గుర్తించారని, దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పింది.
దీనిని కుమార స్వామి కూడా తన ట్విటర్లో ధ్రువీకరించారు.
"జేడీఎస్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందారు. వీరి మృతిని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు అని కుమారస్వామి" తెలిపారు.
మొత్తం ఏడుగురు జేడీఎస్ కార్యకర్తలు శ్రీలంక పర్యటనకు వెళ్లారు. వారిలో మిగతా ఐదుగురు పేలుళ్ల తర్వాత గల్లంతయ్యారని" కూడా ఆయన ట్వీట్ చేశారు.
దీనికి సంబంధించి ఆయన కొలంబోలోని భారత హై కమిషన్‌ను సంప్రదిస్తున్నట్లు ఎఎన్ఐ చెప్పింది.
దీంతో ఇప్పటివరకూ ఆత్మాహుతి పేలుళ్లలో మృతి చెందిన మొత్తం భారతీయుల సంఖ్య ఐదుకు చేరింది.
అయితే ఇప్పటివరకూ దాడిచేసినవారిని గుర్తించలేకపోయారు.
- ఇప్పటివరకూ 8 పేలుళ్లు జరిగాయి. హోటళ్లు, చర్చిలు లక్ష్యంగా దాడులు చేశారు.
- 359 మంది మృతి, 500 మందికి గాయాలు
- 24 అనుమానితుల అరెస్ట్
- కొలంబో, నెగోంబో, బట్టికలోవాలోని 3 చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనల సమయంలో పేలుళ్లు
- కొలంబోలోని 4 హోటళ్లలో, ఒక జూ దగ్గర పేలుళ్లు
- దాడులకు బాధ్యత తమదేనని ఇప్పటివరకూ ఏ మిలిటెంట్ సంస్థ ప్రకటించలేదు
- ఇవి ఆత్మాహుతి దాడులు, విదేశాల్లో దీనికి కుట్ర పన్నారని ప్రభుత్వం తెలిపింది.
- దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
ఫొటో సోర్స్, Getty Images
వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి సుమారు 13 మందిని అరెస్టు చేశామని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమ సింఘె తెలిపారు.
పోలీసులు అరెస్టు చేసిన వారందరూ శ్రీలంక పౌరులే. వీరికి ఏదైనా అంతర్జాతీయ సంస్థలతో సంబంధం ఉందా అనేదానిపైనా ఆరా తీస్తున్నారు. ఈ పేలుళ్లు తమ పనే అని ఇప్పటివరకూ ఏ సంస్థా బాధ్యత తీసుకోలేదు.
"పేలుళ్లు జరగవచ్చనే సమాచారం గురించి పోలీసులకు ముందే తెలుసు. కానీ దాని గురించి వారు నాకు, క్యాబినెట్‌కు ఎలాంటి వివరాలూ ఇవ్వలేదు" అని ప్రధాన మంత్రి చెబుతున్నారు.
బాంబు పేలుళ్ల తర్వాత ఆదివారం శ్రీలంక అంతటా కర్ఫ్యూ విధించారు. తర్వాత సోమవారం ఉదయం తొలగించారు. సోషల్ మీడియాపై కూడా నిషేధం విధించారు.
శ్రీలంక రక్షణ మంత్రి విజయ్ వర్ధన్ "ఇవి ఆత్మాహుతి దాడులు. నిఘా ఏజెన్సీలు ఈ దాడుల గురించి ముందే చెప్పాయి. కానీ వాటిని అడ్డుకునేలోపే పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు విదేశాల్లో కుట్ర పన్నారు" అని చెప్పారు.
ఫొటో సోర్స్, Reuters
ఆత్మాహుతి దాడులు చేసిందెవరు?
దాడులు ఎవరు చేశారు అనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు. పట్టుబడిన వారి గురించి కూడా ఇంకా వివరాలు బయటపెట్టలేదు.
శ్రీలంక టెలీకాం మంత్రి హరిన్ ఫెర్నాండో బీబీసీతో "పేలుళ్ల గురించి ప్రభుత్వం దగ్గర నిఘా ఏజెన్సీ రిపోర్ట్ ఉంది' చెప్పారు.
"ఈ నిఘా రిపోర్ట్ గురించి నేను ప్రధాన మంత్రికి సమాచారం ఇవ్వలేదు. ఈ రిపోర్టును సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదని కూడా క్యాబినెట్లో ప్రశ్నించారు".
"నిఘా రిపోర్టులో నాలుగు రకాల దాడులు జరగవచ్చని చెప్పారు. ఆత్మాహుతి దళాలతో, తుపాకులతో, కత్తితో, పేలుడు పదార్థాలు నిండిన ట్రక్కులతో దాడులు చేయవచ్చని తెలిపారు. ఈ రిపోర్టులో కొందరు అనుమానితుల పేర్లు కూడా ఉన్నాయి. రిపోర్టులో వారి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. నిఘా ఏజెన్సీల దగ్గర వీటి గురించి రిపోర్ట్ ఉన్నా, దీని గురించి క్యాబినెట్‌కు, ప్రధానమంత్రికి తెలీకపోవడం ఆశ్చర్యంగా ఉంది"
"ఈ రిపోర్టులో ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. అది ఇప్పుడు మా దగ్గర ఉంది. ఈ రిపోర్టులో కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు. ఇందులో కొన్ని సంస్థల పేర్లు ఉన్నాయి. నాకు తెలిసి దర్యాప్తు సరిగానే జరుగుతోంది. మేం ఈ దాడులు చేసిన వారిని చేరుకోగలం. దాడులు ఎవరు చేశారో, ఏ గ్రూప్ చేసిందో మేం గుర్తించాం. రేపు సాయంత్రానికి మా దగ్గర దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి" అని ఫెర్నాండో తెలిపారు.
ఫొటో సోర్స్, Reuters
ఆత్మాహుతి దాడులు చేసిన వారు 'రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిస్ట్ గ్రూప్'లో భాగం అయ్యండవచ్చని అధికారులు అన్నట్లు కొలంబోలో నుంచి బీబీసీ ప్రతినిధి ఆజ్జం అమీన్ తెలిపారు.
ఇటు శ్రీలంకలో మళ్లీ దాడులు జరుగుతాయేమోనని చాలా ప్రాంతాల్లో ప్రజలు వణికిపోతున్నారు.
ఫొటో సోర్స్, Anadolu agency
శ్రీలంకలో ఇప్పటివరకూ 8 పేలుళ్లు జరిగాయి. ఈస్టర్ సందర్భంగా చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
8వ పేలుడులో ముగ్గురు పోలీసు అధికారులు మృతిచెందారు. పోలీసులు కొలంబోలో ఉన్న ఒక ఇంట్లో తనిఖీలు చేస్తుండగా ఈ పేలుడు జరిగింది.
ఫొటో సోర్స్, AFP
ఇది బాంబును డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు జరిగిందా అనేది ఇంకా తెలీలేదు. ఆ పేలుడు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.
కొలంబో నేషనల్ హాస్పిటల్ మృతుల సంఖ్యను ధ్రువీకరించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మృతుల్లో 36 మంది విదేశీయులు ఉన్నట్లు తెలిపింది.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేలుళ్ల దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఫేక్‌న్యూస్ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశ భద్రతపై ఒక అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని తెలిపారు.
ఫొటో సోర్స్, Reuters
పేలుళ్ల ఘటన ప్రత్యక్ష సాక్షులు
పేలుళ్ల ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒకరు బీబీసీతో నేను ఇంట్లో ఉన్నా, అప్పుడే నాకు టైర్ పంచర్ అయినట్టు పెద్ద శబ్దం వినిపించింది.
ఇంట్లో నుంచి బయటికొచ్చి చూస్తే అంతా పొగ నిండి ఉండడం కనిపించింది.
మేం ఇద్దరు ముగ్గురం ప్రాణాలతో బతికాం, జనాలను ఆస్పత్రికి పంపించాం. నేను లోపలికి వచ్చా. బహుశా అక్కడ 100 మంది చనిపోయి ఉన్నారు. వాళ్ల శరీర భాగాలు అంతా పడున్నాయి.
ఫొటో సోర్స్, TWITTER / AZZAM AMEEN
శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి అక్కడక్కడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
శ్రీలంకలో మెజారిటీలైన బౌద్ధులు దేశంలోని మసీదులు, ముస్లింల ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. దాంతో 2018 మార్చిలో ఇక్కడ అత్యవసర స్థితి విధించారు.
ఇవి కూడా చదవండి:
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- మోదీకి జేజేలు కొడుతూ పాకిస్తాన్లో ర్యాలీ.. నిజమేనా
- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే
- ఐపీఎల్ 2019: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం
- లోక్‌సభ ఎన్నికలు 2019: లఖ్‌నవూలో రాజ్‌నాథ్ సింగ్‌కు గట్టి పోటీఇచ్చేదెవరు
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)