అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?

చిటికేసి సగం ప్రపంచాన్ని నాశనం చేసిన 'థానోస్'పై 'మార్వెల్ సూపర్ హీరో'లు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది.
'మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్'(ఎమ్‌సీయూ)లో వచ్చిన 21 సినిమాలకు ముగింపుగా, అవెంజర్స్ సిరీస్‌లో నాలుగో చిత్రంగా రూపొందిన 'ఎండ్‌గేమ్' విడుదలకు సిద్ధమైంది.
ఏప్రిల్ 26న ఈ చిత్రం భారత ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి, ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?
ఫొటో సోర్స్, Getty Images
థార్ - క్రిస్ హెమ్స్‌వర్త్
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే..
మార్వెల్ సంస్థ నిర్మించిన సినిమాలు, వాటిలోని పాత్రల నేపథ్య ప్రపంచమే ఎమ్‌సీయూ.
ఎమ్‌సీయూలో ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ప్రతిదానికీ ఓ ప్రత్యేకమైన కథ ఉన్నా.. మిగతా చిత్రాల కథలతో అది అల్లుకుని ఉంటుంది. మొత్తంగా ఈ సినిమాలన్నీ ఓ పెద్ద కథను చెబుతాయి.
ప్రముఖ కామిక్ పాత్రల సృష్టికర్త స్టాన్ లీ తన కామిక్స్‌లో ఉపయోగించిన సూత్రమిది.
దీన్ని ఎమ్‌సీయూ చక్కగా వాడుకుంది.
అత్యధిక వసూళ్లు రాబట్టుకున్న ఫ్రాంఛైజ్‌గా చరిత్ర సృష్టించింది.
ఇప్పటివరకూ ఎమ్‌సీయూ చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు రూ.1.27 లక్షల కోట్లకు పైమాటే.
ఫొటో సోర్స్, Getty Images
ఐరన్ మ్యాన్ - రాబర్ట్ డౌనీ జూనియర్
ఏ సినిమా నుంచి మొదలుపెట్టాలి
ఎమ్‌సీయూ చిత్రాలను విడుదలైన క్రమంలో కాకుండా, కథల నేపథ్య సమయాల ప్రకారం చూస్తే మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు.
'మార్వెల్ స్టూడియోస్: ద ఫస్ట్ టెన్ ఇయర్స్' అనే పుస్తకంలో ఎమ్‌సీయూ చిత్రాల నేపథ్య సమయాలను అధికారికంగా ఇచ్చారు.
ఏ కథ ఎప్పుడన్న సమాచారం ఇదిగో..
సాంకేతికంగా 'యాంట్-మ్యాన్ అండ్ ద వాస్ప్' చిత్రం కథ 'ఇన్ఫినిటీ వార్' కన్నా ముందు జరుగుతుంది. చివర్లో పేర్లు పడిన తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం తర్వాత జరుగుతాయి.
పైన సూచించిన క్రమంలో చూస్తే.. వాటిని మెరుగ్గా ఆస్వాదించవచ్చు.
మార్వెల్ ఈ పాత్రలనే ఎందుకు ఎంచుకుంది?
2007లో దివాలా తీసే పరిస్థితుల నుంచి మార్వెల్ అప్పుడప్పడే బయటపడుతూ ఉంది. బాగా ఆదరణ ఉన్న ఎక్స్-మెన్, స్పైడర్ మ్యాన్ పాత్రలపై సినీ హక్కులను అమ్ముకుంది.
అవెంజర్స్ ప్రధాన బృందంలో ఉండే ఐరన్ మ్యాన్, హల్క్, థార్, కెప్టెన్ అమెరికా లాంటి మిగతా సూపర్ హీరోల హక్కులు మాత్రం మార్వెల్ వద్దే ఉన్నాయి.
దీంతో ఎమ్‌సీయూ ప్రారంభ చిత్రాల ద్వారా సంస్థ ఈ పాత్రలనే పరిచయం చేసింది.
సూపర్ హీరోలందరినీ కలిపి 'క్రాస్ ఓవర్' చిత్రాలను రూపొందించాలన్న ప్రణాళిక ముందు నుంచే ఉంది.
ఎమ్‌సీయూలో తొలి చిత్రంగా 2008లో విడుదలైన 'ఐరన్ మ్యాన్' ఆఖర్లో పేర్లు పడిన తర్వాత 'నిక్ ఫ్యూరీ' పాత్ర కనిపించి 'అవెంజర్స్' గురించి ప్రస్తావిస్తుంది.
ఫొటో సోర్స్, disney
హల్క్
అంత సమయం లేదా.. ఇవి చూడక్కర్లేదు
ఎమ్‌సీయూలో ఇంతవరకూ వచ్చిన 21 చిత్రాలకు ముగింపు ఎండ్ గేమ్.
అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఆ సినిమాలన్నింటినీ చూసి ఉండాల్సిన అవసరమేమీ లేదు.
ఈ పది సినిమాలు మీరు చూడకపోయినా ఫర్లేదు.
- ద ఇన్‌క్రెడిబుల్ హల్క్
- థార్
- థార్: ద డార్క్ వరల్డ్
- ఐరన్ మ్యాన్ 2
- ఐరన్ మ్యాన్ 3
- యాంట్-మ్యాన్
- డాక్టర్ స్ట్రేంజ్
- గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ, వాల్యూమ్ 2
- బ్లాక్ పాంథర్
- కెప్టెన్ మార్వెల్
ఫొటో సోర్స్, DISNEY
థానోస్
ఎండ్‌గేమ్ ఎందుకు ముఖ్యం?
ఎమ్‌సీయూ చిత్రాలను మార్వెల్ దశల పద్ధతిలో ప్లాన్ చేసింది.
ఒక్కో అవెంజర్స్ చిత్రం ఒక్కో దశకు ముగింపు పలుకుతుంది.
తొలి దశను అవెంజర్స్ అసెంబుల్, రెండో దశను అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ముగించాయి.
ఎండ్ గేమ్ కేవలం మూడో దశకే కాదు, అంతకుముందు వచ్చిన 21 సినిమాలకూ ఓ ముగింపును ఇవ్వబోతోంది.
ఈ చిత్రాలన్నింటినీ కలిపి 'ద ఇన్ఫినిటీ సాగా'గా మార్వెల్ స్టూడియోస్ పిలుస్తోంది.
అద్భుత శక్తులనిచ్చే ఇన్ఫినిటీ స్టోన్స్, భయంకరమైన విలన్ థానోస్ గురించి ఈ కథ సాగుతుంది.
ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నింటినీ పొంది సర్శశక్తులూ సాధించిన థానోస్ చిటికేసి భూమి మీద సగం ప్రాణులు తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాడు.
బలమైన థానోస్‌ను అవెంజర్స్ ఓడించి అందరినీ ఎలా కాపాడతారన్నది ఎండ్ గేమ్‌లో చూడొచ్చు.
3 గంటలకుపైగా సాగే ఈ సినిమా ఎమ్‌సీయూలోనే అత్యంత సుదీర్ఘమైంది.
ఫొటో సోర్స్, Getty Images
కెప్టెన్ అమెరికా - క్రిస్ ఇవాన్
ఎమ్‌సీయూ భవిష్యత్తు ఏంటి?
ఎండ్ గేమ్ తర్వాత ఎమ్‌సీయూలో భారీ మార్పులు జరగొచ్చు.
2019 జులై 5న 'స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్' చిత్రంతో నాలుగో దశ మొదలవుతోంది.
ఎండ్ గేమ్ కథ ముగిసిన కొన్ని నిమిషాల తర్వాత నుంచి తమ సినిమా కథ మొదలవుతుందని ఆ చిత్ర నిర్మాత ఏమీ పాస్కల్ చెబుతున్నారు.
థానోస్ చేతిలో అంతమైపోయిన సూపర్ హీరోల్లో స్పైడర్ మ్యాన్ పాత్ర కూడా ఉంది.
అయితే ఎంతో ఆదరణ ఉన్న ఆ పాత్ర.. ఎండ్ గేమ్ చివర్లో మళ్లీ ఊపిరి పోసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎమ్‌సీయూలో ఇప్పటికే అంతమైన చాలా పాత్రలతో నాలుగో దశలో మళ్లీ సినిమాలు రానున్నాయి.
మరికొందరు కొత్త సూపర్ హీరోలు కూడా ఎమ్‌సీయూలో కనిపించవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
మార్వెల్ సినిమాల్లో ఏజెంట్ ఫిల్ కోల్సన్ పాత్ర పోషించే క్లార్క్ గ్రెగ్
ఇంకా తనివితీరకపోతే..
ఎమ్‌సీయూలోని అన్ని సినిమాలు చూశాక కూడా తనివితీరని వారి కోసం కోసం కొన్ని టీవీ షోలూ ఉన్నాయి.
ఏజెంట్ కార్టర్, ఏజెంట్స్ ఆఫ్ షీల్డ్, ఇన్‌హ్యూమన్స్, రన్అవేస్, క్లోక్ అండ్ డాగర్, డేర్ డెవిల్, జెస్సికా జోన్స్, ల్యూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్, ద డిఫెండర్స్, ద పనిషర్ షోస్‌ను చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
- బ్లాక్ హోల్ తొలి ఫొటో.. దీన్ని తీయడం ఎందుకంత కష్టం?
- అక్కడ అస్థిపంజరాలను దోచుకుంటున్నారు.. దేశాధ్యక్షుడి సమాధినీ వదల్లేదు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
- BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)