నేషనల్ తౌహీద్ జమాత్: శ్రీలంక పేలుళ్లు ఈ గ్రూపు పనేనా

శ్రీలంక పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే)... ఈ గ్రూపు వెనక ఎవరున్నారు? శ్రీలంక పేలుళ్లు ఈ గ్రూపు పనేనా?

ఎవరికీ పెద్దగా తెలియని 'నేషనల్ తౌహీద్ జమాత్' గ్రూపు శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల వెనక కుట్రకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.

గతం సంవత్సరం జరిగిన ఓ చిన్న ఘటన వెనక కూడా ఈ గ్రూపుదే హస్తం ఉండి ఉండవచ్చని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనే ఓ నాన్-‌‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అలాన్ కీనన్ అభిప్రాయపడ్డారు.

"గత డిసెంబరులో మార్వనెల్లా పట్టణంలో ఉన్న కొన్ని బుద్ధ విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. దీనికి బాధ్యులంటూ కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఓ మత ప్రచారకుడి అనుచరులని అప్పట్లో తేలింది. ఆ ప్రచారకుడి పేరే నిన్న ఇంటెలిజెన్స్ అధికారుల పత్రాల్లో ఉంది" అని అలాన్ కీనన్ బీబీసీతో చెప్పారు.

శ్రీలంకలోని మీడియా, పొరుగునున్న భారత మీడియా కూడా ఈ గ్రూపునే ప్రస్తావిస్తోంది.

మరోవైపు, ఈ గ్రూపు కుట్రలకు పాల్పడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయంటూ సింహళీ భాషలో ఉన్న ఓ లేఖను ప్రస్తావిస్తూ శ్రీలంక టెలీకమ్యూనికేషన్స్ మంత్రి హరీన్ ఫెర్నాండో ఓ ట్వీట్ చేశారు.

అయితే ఎన్టీజేనే ఈ దాడులకు పాల్పడిందని ప్రభుత్వం గానీ, తామే ఈ దాడులు చేశామని ఎన్టీజే గానీ ధ్రువీకరించలేదు. ఇంత వరకూ మరే ఇతర గ్రూపూ కూడా దీనికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.

భారత్ కేంద్రంగా పనిచేస్తున్న తమిళనాడు తౌహీడ్ జమాత్ (టీఎన్టీజే)కు, ఎన్టీజేకు మధ్య తరచూ మీడియా కూడా గందరగోళానికి గురవుతూ ఉంటుంది. ఈ రెండు గ్రూపులకూ ఒకదానితో మరొకదానికి సంబంధం ఉందని కొన్ని దినపత్రికలు, న్యూస్ చానళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నప్పటికీ, దీనికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవు.

టీఎన్టీజే వెబ్‌సైట్‌లో కూడా తమకు శ్రీలంకలో ఓ విభాగం ఉంది అని రాశారు. దానిపేరు శ్రీలంక తౌహీద్ జమాత్. అయితే, దీనికీ, ఎన్టీజేకు ఎలాంటి లింకూ లేదు.

అయితే ఈ దాడులు స్థానిక గ్రూపు మాత్రమే చేసినవి కావని, దీనిలో విదేశీ సంస్థల హస్తం కూడా ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఘటనాస్థలానికి ఇంటర్‌పోల్

ఘటనలు జరిగిన తీరును పరిశీలించేందుకు, ఎలాంటి పేలుడు పదార్ధాలు ఉపయోగించారో నిర్థరించేందుకు, బాధ్యులెవరో గుర్తించేందుకు, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహాయం చేయడంలో భాగంగా ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (ఐఆర్టీ)ను శ్రీలంకకు పంపిస్తున్నామని ఇంటర్‌పోల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) తెలిపింది.

అవసరమైతే డిజిటల్ ఫోరెన్సిక్స్, బయోమెట్రిక్స్‌, వీడియోలు, ఫొటోల విశ్లేషణలో నిపుణులను కూడా ఈ బృందంతోపాటు పంపిస్తామని చెప్పింది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

మార్చురీల దగ్గరకు వస్తున్న ప్రజలు

ఆదివారం జరిగిన పేలుళ్లలో మృతి చెందిన తమ బంధువులను, కుటుంబ సభ్యులను గుర్తించడానికి ప్రజలు మార్చురీల దగ్గరకు వస్తున్నారు.

శ్రీలంక రాజధాని కొలంబోలో కొద్దిసేపటి క్రితం మరో స్వల్ప పేలుడు సంభవించింది.

కొలంబోలోని కోచి కడాయ్ వద్దనున్న సెయింట్ ఆంథోనీ చర్చి సమీపంలో ఇది జరిగింది. అయితే, అధికారులు తాము కనుగొన్న బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో జరిగిన పేలుడే అని సంఘటనా స్థలంలో ఉన్న బీబీసీ తమిళ ప్రతినిధి తెలిపారు.

గార్డియన్ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేసిన ఈ వీడియోలో ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది.

దాడులకు పాల్పడ్డ వ్యక్తులు ఉపయోగించిన వాహనంలో ఉన్న పేలుడు పదార్ధాన్ని నిర్వీర్యం చేసే సమయంలోనే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు స్పష్టం చేశారని బీబీసీ ప్రతినిధి ఆజ్జం అమీన్ తెలిపారు.

సెయింట్ సెబాస్టియన్ చర్చి దగ్గరంతా రక్తపు వాసన వస్తోందని అక్కడే ఉన్న బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే వెల్లండించారు. "కొద్దిసేపు ఆ తలుపులు తెరిచారు. దీంతో మేం లోపల ఎలా ఉందో చూశాం. రక్తం ఎండిపోయిన వాసన వస్తోంది" అని యోగితా ట్వీట్ చేశారు.

ఆదివారం జరిగిన వరుస పేలుళ్లకు ఆత్మాహుతి దాడులే కారణమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ పేలుళ్లకు విదేశాల్లో కుట్ర పన్నినట్లు తెలిపింది.

శ్రీలంకలో ఇప్పటివరకూ జరిగిన 8 పేలుళ్లలో 359 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు. సుమారు 500 మంది గాయపడ్డారు.

మృతుల్లో 36 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి 24 మందిని అరెస్ట్ చేశారు.

ఫొటో క్యాప్షన్,

సెయింట్ ఆంథోనీ చర్చ్

ఆ గడియారం అక్కడే ఆగిపోయింది

"ఆదివారం పేలుడు జరిగిన సెయింట్ ఆంథోనీ చర్చి కేవలం ఓ ప్రార్థనా స్థలమే కాదు, దీనికి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడకు వచ్చేవారిని 175 సంవత్సరాల ఈ చర్చి చరిత్రలో మొదటిసారిగా ఇప్పుడు వెనక్కి పంపించేస్తున్నారు" అని కొలంబో నుంచి బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరిరా తెలిపారు.

ఎడమవైపు టవర్‌పై ఉన్న గడియారం 8.45 గంటల సమయాన్ని చూపిస్తూ ఆగిపోయింది. అప్పుడే అక్కడ పేలుడు సంభవించింది.

చర్చి బయట నిలబడి చూస్తున్నవారిలో ప్రభాత్ బుధ్దిక ఒకరు. వ్యక్తి గతంగా బౌద్ధమతాన్ని అనుసరించేవారే అయినా, ప్రభాత్‌కు ఈ చర్చిపై ఎంతో నమ్మకముంది.

పేలుళ్లు వినపడగానే ఆయన చర్చి దగ్గరకు పరిగెత్తారు. అప్పుడు అక్కడున్న ఘోర దృశ్యాన్ని మాటల్లో చెప్పలేనని ఆయన అంటున్నారు. కానీ, అందరూ సాయం చేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)