డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

అనస్తాసియా

ఫొటో సోర్స్, facebook/AnastasiyaNIfontova

అత్యంత సాహసోపేతమైన డాకర్ ర్యాలీని విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రష్యాకు చెందిన రైడర్ అనస్తాసియా నిఫొంటోవా చరిత్ర సృష్టించారు.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. 5,600 కిలోమీటర్ల సుదీర్ఘ రేస్‌ను ఎలా పూర్తి చేయగలిగారో బీబీసీతో పంచుకున్నారు.

వెంట టెక్నీషియన్ల బృందం లేకుండా డాకర్ ర్యాలీ పూర్తిచేసిన తొలి మహిళ అనస్తాసియా. అంటే, ప్రయాణంలో తన బైకు పనితీరును సరిచూసుకోవడం, బైకులో ఏవైనా చెడిపోతే బాగు చేయడం అన్నీ ఆమే చూసుకోవాలి.

ఇప్పటి వరకు 5,600 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ ర్యాలీని 32 మంది మాత్రమే పూర్తి చేశారు. ఆ 32 మందిలో ఏకైక మహిళ ఈమె.

వీడియో క్యాప్షన్,

5,600 కిలోమీటర్ల డాకర్ ర్యాలీ పూర్తి చేసిన ఏకైక మహిళ

"రోజులు, వారాలపాటు ఎడారిలో గడపటం చాలామంది అమ్మాయిలకు ఇష్టముండదు.

కొన్నిసార్లు ఆ ఎడారుల్లో నీటి బొట్టు కూడా దొరకదు. అంతా దుమ్ము, బురద.. దానికితోడు బైకు బరువు 180 కిలోలకు పైనే ఉంటుంది. ఎ

న్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ముందుకు వెళ్లిపోయాను" అని ఆమె వివరించారు.

20 ఏళ్ల వయసు నుంచే అనస్తాసియా రేసింగ్ ప్రారంభించారు. ఆమె ప్రియుడు కూడా రేసింగ్ ట్రాక్‌ మీదే పరిచయమయ్యారు.

"నాకు వంట చేయడం రాదు, చేయను అని ఆయనకు చెప్పేశాను.

అందుకు, ఆయన 'పర్లేదు డార్లింగ్, నాకు వంటంటే ఇష్టం. ఆ పని నేను చూసుకుంటా' అని అన్నారు.

అలా ముందే ఒప్పించడంతో తర్వాత ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు" అని ఆమె చెప్పారు.

ఆమెకు 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల అబ్బాయి ఉన్నారు. ఆమె వ్యాయామానికి ప్రాధాన్యం ఇస్తారు.

రోజూ వ్యాయాయం చేయడంతో పాటు, అప్పుడప్పుడు సరదా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

"సాధారణంగా మహిళా రైడర్లు చేతులకు గ్రీజుతో పురుషుల్లా... కనిపించాలని చాలామంది అనుకుంటారు. కానీ, నేను సాధారణ అమ్మాయిలాగే కనిపించేందుకు ప్రయత్నిస్తా. రేసింగ్‌కు వెళ్లేముందు చేతులకు మాలిష్ చేయించుకుంటా" అని వివరించారు.

డాకర్ ర్యాలీలో విజయం ఆమెకు అంత సులువుగా దక్కలేదు. మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయని ఆమె చెప్పారు.

"నేను ఒక ఇసుకదిబ్బ మీదకు చేరుకున్నాక నా వెనకాలే.. ఓ ట్రక్కు దూసుకొచ్చింది. దాదాపు దానికింద పడిపోయాను. ఆ ట్రక్కు కింద పడి నలిగిపోతానేమో అన్నంత భయమేసింది.

దాని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ తొక్కాడు. అది నా ముఖానికి మీటర్ దూరంలో ఆగింది. ఒక్క క్షణం అయితే నా మీదినుంచి వెళ్లిపోయేది. కాసేపు అలానే ఉండిపోయాను.

చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు కారుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక.. అప్పుడు నా కాళ్ల మీదే ఉన్నా అనిపించింది.

అందరిముందు నవ్వాను. కానీ, మా గుడారంలోకి వెళ్లాక దిండుకు ముఖం పెట్టి బోరున ఏడ్చాను. కొద్దిసేపటికి కన్నీళ్లు తుడుచుకుని, మామూలు స్థితికి వచ్చాను.

మళ్లీ బైకు బోల్టులు, నట్లను బిగించేందుకు సిద్ధమయ్యా. అలా ఇబ్బందులు వచ్చినా నేను వెనకడుగు వేయలేదు" అని అనస్తాసియా నిఫొంటోవా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)