శ్రీలంక పేలుళ్లు: మృతుల్లో 10 మంది భారతీయులు ‘ఏప్రిల్ మొదట్లోనే హెచ్చరించిన భారత్, అమెరికా’

శ్రీలంక బాంబు పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆదివారం జరిగిన బాంబు పేలుళ్ల గురించి నిఘా సంస్థలు ముందే హెచ్చరించినా శ్రీలంక నేతల మధ్య విబేధాల కారణంగా ప్రభుత్వం వాటిని అడ్డుకోలేకపోయినట్లు సోమవారం బయటపడింది.

హోటళ్లు, చర్చిలపై జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 359కి చేరింది. దాదాపు 500 మంది గాయపడ్డారు. మరిన్ని పేలుళ్లు జరగకుండా ముందుజాగ్రత్తగా దేశంలో ఎమర్జెన్సీ విధించారు.

మృతుల్లో 31 మంది శ్రీలంకేతరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో బ్రిటన్, భారత్, డెన్మార్క్, సౌదీ అరేబియా, చైనా, టర్కీ దేశస్థులు ఉన్నారు.

10 మంది భారతీయులు ఈ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అయిదుగురు కర్నాటకలోని జనతాదళ్(ఎస్) పార్టీ కార్యకర్తలు. కర్నాటకలో పలు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తరువాత వారు విహారానికి అక్కడకి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images

తమ పనేనంటున్న ఐఎస్

తాజాగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమంటూ తన వార్తా సంస్థ ద్వారా ప్రకటించుకుంది.

అయితే, శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లకు స్థానిక ఇస్లామిస్ట్ గ్రూప్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) పనేనని చెబుతోంది.

శ్రీలంకలోని బీబీసీ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఐఎస్ ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఐఎస్ ఏమైనా చేస్తే వెంటనే తన మీడియా పోర్టల్‌లోనూ ఆ చిత్రాలనూ పోస్ట్ చేస్తుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఐఎస్ స్వయంగా ప్రకటించుకున్నప్పటికీ దీనిపై ఇంకా నిర్ధరణకు రావాల్సి ఉంది.

మరోవైపు పేలుళ్లతో సంబంధం ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసిన 40 మందిలో ఒక సిరియా పౌరుడూ ఉన్నాడు.

ముందే హెచ్చరించినా

నేషనల్ తౌహీద్ జమాత్ జీహాదీ గ్రూప్‌పై నిఘా పెట్టిన భద్రతా ఏజెన్సీలు వారు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులను ముందే హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ప్రధాని రణిల్ విక్రమసింఘె, క్యాబినెట్‌కు నిఘా హెచ్చరికల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ దేశ మంత్రులు చెబుతున్నారు.

బాంబు పేలుళ్లలో అమాయకుల మృతిపై మంగళవారం దేశంలో సంతాపదినం పాటిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ట్వీట్ చేశారు.

"మాటలకందని ఇలాంటి విషాదం ఎదురైనప్పుడు శ్రీలంక ప్రజలందరూ ఏకమవడం అత్యవసరం" అని ఆయన అందులో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

భారీ నిఘా వైఫల్యం

గత ఏడాది అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో విభేదాలు వచ్చినప్పటి నుంచి దేశ భద్రతకు సంబంధించిన వివరాలు ప్రధానికి తెలీడం లేదని క్యాబినెట్ ప్రతినిధి రంజిత సేనారత్నె మీడియాకు తెలిపారు.

ప్రధాని విక్రమసింఘె, ఆయన క్యాబినెట్‌ను సిరిసేన అక్టోబర్‌లో తొలగించారు. దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందంటూ మరో ప్రధానిని నియమించడానికి ప్రయత్నించారు.

దేశ సుప్రీంకోర్టు ఒత్తిడితో ఆయన విక్రమసింఘెను తిరిగి ప్రధాని స్థానంలో ఉంచాల్సి వచ్చింది. కానీ భద్రతా సమావేశాలకు విక్రమసింఘెను దూరంగా ఉంచినట్లు స్పష్టమవుతోంది.

"ఏప్రిల్ 4 నుంచి మిలిటెంట్ సంస్థకు సంబంధించి నిఘా ఏజెన్సీలు హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభించాయి. దీనిపై పోలీస్ శాఖను హెచ్చరించిన రక్షణ శాఖ వారికి ఆ వివరాలు కూడా పంపించింది. ఏప్రిల్ 11న వివిధ భద్రతా విభాగాల అధిపతులకు మెమోలు ఇచ్చాం" అని సేనారత్నె తెలిపారు.

మిలిటెంట్ గ్రూప్ దాడులు చేసే అవకాశం ఉందన్న విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరికలతోపాటూ ఆ సమాచారం మొత్తం పోలీసులకు పంపించాం అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

"రానున్న ముప్పు గురించి భారత, అమెరికా నిఘా సంస్థలు ఏప్రిల్ మొదట్లో హెచ్చరించాయని శ్రీలంక అధికారులు చెప్పినట్లు" అమెరికా మీడియా పేర్కొంది.

కానీ, అధ్యక్షుడు సిరిసేనకు ఈ నిఘా హెచ్చరికల గురించి ముందే తెలుసా, లేదా అనేదానిపై సోమవారం స్పష్టత రాలేదు.

"ఈ విషయంపై పోలీసులకు, భద్రతా దళాలకు తగిన సమాచారం అందించినట్లు మాకు తెలిసింది" అని సిరిసేన సీనియర్ అడ్వైజర్ షిరల్ లక్తిలక బీబీసీకి చెప్పారు.

నిఘా హెచ్చరికల తర్వాత ఏం జరిగింది అనేదానిపై విచారించేందుకు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో రాష్ట్రపతి ఒక ప్రత్యేక కమిటీని నియమించినట్లు ఆయన చెప్పారు.

శ్రీలంకలో జరిగిన ఆత్మాహుతి దాడులను 'భారీ నిఘా వైఫల్యం'గా శ్రీలంక టౌన్ ప్లానింగ్ మంత్రి రౌఫ్ హకీమ్ వర్ణించారు. "ఇది మాకందరికీ సిగ్గుచేటు, ఈ దాడులకు మేమంతా సిగ్గుపడుతున్నాం" అన్నారు.

"కొంతమంది నిఘా అధికారులకు ఈ ఘటన గురించి తెలుసు. అయినా చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగింది. ఈ హెచ్చరికలను ఎందుకు నిర్లక్ష్యం చేశారనేదానిపై కఠిన చర్యలు చేపట్టాలి" అని టెలీ కమ్యూనికేషన్ మంత్రి హరీన్ ఫెర్నాండో అన్నారు.

ఫొటో సోర్స్, EPA

ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టింది

శ్రీలంక ప్రభుత్వం దేశంలో అత్యవసర స్థితి ప్రకటించింది. అది సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

అత్యవసర స్థితి ప్రకటనతో కోర్టు ఆదేశాలు లేకుండానే అనుమానితులను అదుపులోకి తీసుకోవడానికి, వారిని విచారించడానికి దేశ సైన్యానికి, పోలీసులకు పూర్తి అధికారాలు ఉంటాయి.

దీనిని ఇంతకు ముందు దేశంలో అంతర్యుద్ధం సమయంలో ఉపయోగించారు.

సోమవారం రాత్రి నుంచి కర్ఫ్యూ కూడా అమలు చేయడంతో కొలంబోలోని వీధులన్నీ బోసిపోయాయి.

శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియాను కూడా బ్లాక్ చేసింది.

దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు 24 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. తర్వాత పెట్టాలోని బాస్టియన్ మవథా ప్రైవేట్ బస్ స్టేషన్‌లో 87 బాంబు డిటొనేటర్స్ గుర్తించారు.

సోమవారం రాజధాని కొలంబోలో మరో పేలుడు జరిగింది. బాంబును నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది పేలింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

దాడులు ఎలా జరిపారు

ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.45 వెంటవెంటనే ఆరు పేలుళ్లు జరిగాయి.

నెగోంబో, బట్టికలోవా, కొలంబో కచ్చికడే జిల్లాలోని మూడు చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనల సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.

రాజధాని కొలంబోలోని షాంగ్రీ-లా, కింగ్స్‌బరీ, సిన్నమన్ గ్రాండ్ హోటళ్లలో కూడా పేలుళ్లు జరిగాయి.

ఈ దాడులన్నీ ఆత్మాహుతి దళాల వల్లే జరిగాయని అధికారులు తెలిపారు.

తర్వాత రెండు ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ పేలుడు పదార్థాలు గుర్తించారు.

తర్వాత దక్షిణ కొలంబోలోని డెహివాలా, కొలంబోకు సమీపంలోని డెమటగోడా జిల్లాలో తనిఖీలు చేసిన పోలీసులు అక్కడ కూడా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

డెమటగోడాలో ఒక సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.

కొలంబో విమానాశ్రయంలో కూడా ఆరు అడుగుల పొడవున్న ప్లాస్టిక్ పైపులో ఉన్న ఐఈడీని పోలీసులు గుర్తించారు.

ఫొటో సోర్స్, AFP

బాధితులు ఎవరు

మృతుల్లో చాలా మంది శ్రీలంక దేశీయులే. వీరిలో ఆదివారం చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలకు హాజరైన క్రైస్తవులే ఎక్కువ మంది ఉన్నారు.

బాంబు పేలుళ్లలో మృతి చెందిన 31 మంది విదేశీయులను గుర్తించినట్లు శ్రీలంక విదేశాంగ శాఖ తెలిపింది. మరో 11 మంది వివరాలు తెలీలేదు. మృతుల్లో 8 మంది బ్రిటిష్ పౌరులు, 8 మంది భారతీయులు ఉన్నారు.

మృతుల్లో డెన్మార్క్ బిలియనీర్ ఆండర్స్ హోల్చ్ పోల్సెన్ ముగ్గురు పిల్లలు ఉన్నట్టు ఆ కుటుంబానికి చెందిన వారు బీబీసీకి చెప్పారు.

షాంగ్రి-లా హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ వరుసలో నిలబడిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకోవడంతో బ్రిటన్ లాయర్ అనిత నికొల్సన్ తన ఇద్దరు పిల్లలతోపాటు చనిపోయారు.

ఆమె భర్త బెన్ నికొల్సన్ ప్రాణాలతో బయటపడ్డారు.

చైనా కూడా తమ దేశస్థులకు శ్రీలంక వెళ్లవద్దని సూచించింది. ఆ దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు అమెరికా ఇప్పటికే తమ దేశస్థులను హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)