న్యూజిలాండ్ మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంక చర్చిల్లో దాడులు: శ్రీలంక మంత్రి రువాన్ విజయవర్ధనె

శ్రీలంక పేలుళ్లు

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంకలో 321 మందిని పొట్టన పెట్టుకున్న భీకర బాంబు పేలుళ్లపై ఆ దేశ మంత్రి ఒకరు కీలక వివరాలు వెల్లడించారు.

ఈస్టర్ రోజున పలు చర్చిల్లో జరిగిన ఈ పేలుళ్లు.. గత నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా జరిపినవని దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.

పేలుళ్ల తరువాత పార్లమెంటు అత్యవసరంగా సమావేశం కాగా.. రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజయవర్ధనె ''న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన పేలుళ్లకు ప్రతీకారంగానే మన దేశంలోని చర్చిల్లో దాడులు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది'' అని చెప్పారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది

ఫొటో సోర్స్, Getty Images

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలోని మసీదుల్లో మార్చి 15న జరిగిన పేలుళ్లో సుమారు 50 మంది మరణించారు.

ఇప్పుడు శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన పేలుళ్లలో 321 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడ్డారు.

ఈ పేలుళ్లలో 10 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

తమ పనేనంటున్న ఐఎస్

తాజాగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమంటూ తన వార్తా సంస్థ ద్వారా ప్రకటించుకుంది.

అయితే, శ్రీలంక ప్రభుత్వం ఈ పేలుళ్లకు స్థానిక ఇస్లామిస్ట్ గ్రూప్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) పనేనని చెబుతోంది.

శ్రీలంకలోని బీబీసీ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ఐఎస్ ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఐఎస్ ఏమైనా చేస్తే వెంటనే తన మీడియా పోర్టల్‌లోనూ ఆ చిత్రాలనూ పోస్ట్ చేస్తుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఐఎస్ స్వయంగా ప్రకటించుకున్నప్పటికీ దీనిపై ఇంకా నిర్ధరణకు రావాల్సి ఉంది.

మరోవైపు పేలుళ్లతో సంబంధం ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసిన 40 మందిలో ఒక సిరియా పౌరుడూ ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)