కిమ్-పుతిన్ సదస్సు: రష్యా చేరుకున్న కిమ్.. తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు

ఫొటో సోర్స్, AFP
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తొలిసారిగా సమావేశం అయ్యేందుకు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ రష్యా చేరుకున్నారు.
ఈ భేటీలో పాల్గొనేందుకు కిమ్ తన ప్రైవేటు రైలులో రష్యా వెళ్లారు.
కిమ్, పుతిన్ సమావేశం రష్యా తూర్పు తీర నగరమైన వ్లాడివోత్సోక్‌లో ఉండనుందనే ప్రచారం జరుగుతోంది.
ఉత్తర కొరియా-రష్యా సరిహద్దులకు ఇది కొన్ని గంటల ప్రయాణ దూరంలోనే ఉంటుంది.
కొరియా ద్వీపకల్ప ‘‘న్యూక్లియర్ సమస్య’’పై గురువారం ఈ భేటీ జరుగుతుందని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హనోయిలో కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో కిమ్, పుతిన్ భేటీ జరగబోతోంది.

ఫొటో సోర్స్, AFP
ఫిబ్రవరిలో హనోయిలో కిమ్, ట్రంప్ జరిపిన చర్చలు ఫలించలేదు
కిమ్, ట్రంప్ సదస్సు ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఎలాంటి ఒప్పందం, పురోగతి సాధించలేకపోయింది.
కిమ్-ట్రంప్ చర్చలతో అమెరికా వైఖరి మెత్తబడుతుందని, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న అంతర్జాతీయ ఆంక్షలు కొంతైనా సడలుతాయని ఉత్తర కొరియా ఆశించింది. కానీ అలా జరగలేదు.
ఈ పరిస్థితుల్లో ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకొనేందుకు ఇతర దేశాలతో సంబంధాల పెంపుదల కోసం ఉత్తర కొరియా ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పుడు కిమ్, పుతిన్ ఇద్దరూ వేర్వేరు అజెండాలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
రష్యా, ఉత్తర కొరియా మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సమావేశం 2011లో జరిగింది. అప్పటి రష్యా అధ్యక్షుడు కిమిత్రీ మెద్వెదేవ్, నాటి ఉత్తర కొరియా పాలకుడు, ప్రస్తుత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి అయిన కిమ్ జాంగ్ ఇల్ చర్చలు జరిపారు.

ఫొటో సోర్స్, EPA/Reuters
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో రష్యా, ఉత్తర కొరియా చాలా సన్నిహితమైన మిత్రదేశాలు
ఉత్తర కొరియా వ్యూహం ఏమిటి?
ఉత్తర కొరియా తాము ఏకాకి కాదనే సందేశాన్ని అమెరికాకు పంపించాలనుకుంటోందని ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కుర్టిన్ యూనివర్శిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అలెక్సీ మురవీవ్ అభిప్రాయపడ్డారు.
శక్తిమంతమైన దేశాలు తమకు మద్దతిస్తున్నాయని ఉత్తర కొరియా చాటుకోగలిగితే, అమెరికా, చైనా లాంటి దేశాలతో బేరసారాలు సాగించేందుకు ఉత్తర కొరియాకు మరింత శక్తి వస్తుందని ఆయన తెలిపారు. ఈ తరుణంలో ఉత్తర కొరియాకు రష్యా ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉన్నతస్థాయి దౌత్య వ్యవహారాలు నెరపడంలో కిమ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని అలెక్సీ మురవీవ్ ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తుందని రష్యా భావించడం లేదు
ఒకవైపు క్షిపణి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే, మరోవైపు రష్యా లాంటి ఇతర దేశాలతో చర్చలకు ఉత్తర కొరియా సమాయత్తమవుతోంది. తద్వారా అమెరికా తిరిగి తనతో చర్చలు జరిపేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
శక్తిమంతమైన వేర్వేరు దేశాలతో సంబంధాలను పెంపొందించుకొనేందుకు ప్రయత్నిస్తూ, ఈ క్రమంలో తనకు కావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడమనే వ్యూహాన్ని ఉత్తర కొరియా ఎప్పుడూ అనుసరిస్తూ వస్తోందని 'కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ యూనిఫికేషన్'కు చెందిన పరిశోధకురాలు పార్క్ యాంగ్-జా తెలిపారు.
పుతిన్‌తో కిమ్ భేటీ కూడా ఇందుకు అనుగుణంగానే జరుగుతుండొచ్చని, అమెరికా, చైనాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమావేశాన్ని ఉత్తర కొరియా ఉపయోగించుకోవచ్చని ఆమె చెప్పారు.
కిమ్‌తో సమావేశం కావాలనే ఆసక్తి పుతిన్‌లో కొంత కాలంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా అణ్వాయుధాలే తన ప్రధాన బలమని విశ్వసిస్తోంది.
రష్యా ఆలోచన ఏమిటి?
ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశంగా ఉండటం అమెరికా, చైనాలకు మాదిరే రష్యాకూ ఇష్టం లేదు. అయితే ఉత్తర కొరియాను అణు నిరాయుధీకరణకు ఒప్పించే విషయంలో అమెరికా, రష్యా వైఖరుల్లో వ్యత్యాసం ఉంది.
ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణ అనేది ఆచరణ సాధ్యమైన పని కాదని రష్యా భావిస్తోంది. దీనికోసం పట్టుబట్టకుండా పరిస్థితులను అదుపులో, నిలకడగా ఉంచడం కోసం ఉత్తర కొరియాతో చర్చలు జరపాలని రష్యా కోరుకొంటోంది.
ఉత్తర కొరియా, అమెరికా సంబంధాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయనేదానితో నిమిత్తం లేకుండా ఉత్తర కొరియా వ్యవహారాల్లో తనకూ పాత్ర ఉండాలని, ఇది తన ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని కూడా రష్యా భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా సైన్యం పరేడ్
గతంలో సంబంధాలు ఎలా ఉండేవి?
లోగడ సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు పెద్ద మిత్రపక్షంగా ఉండేది. సోవియట్ యూనియన్ ఆర్థిక సహకారం అందించేది. రెండు పక్షాల మధ్య సాంస్కృతికపరమైన అంశాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండేవి.
సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అణు విజ్ఞానంలోనూ తోడ్పాటు అందించింది. తదనంతర కాలంలో సంబంధాలు బలహీనపడ్డాయి.
వాణిజ్యంలో రష్యాకు ఉత్తర కొరియా అంత ఆకర్షణీయమైన భాగస్వామి కాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలను భరించగల స్థితిలో ఉత్తర కొరియా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
21వ శతాబ్దం తొలినాళ్ల నుంచి పాశ్చాత్య దేశాలతో రష్యా సంబంధాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అప్పుడు ఉత్తర కొరియా, రష్యా సంబంధాలు కొంత వరకు మెరుగుపడ్డాయి.
"నా శత్రువుకు శత్రువు నాకు మిత్రుడు" అనే చిరకాల సూత్రం ప్రాతిపదికగా ఉత్తర కొరియా లాంటి దేశాలతో రష్యా సంబంధాలను పెంపొందించుకొందని దక్షిణ కొరియా రాజధాని సోల్‌లోని కుక్‌మిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆండ్రీ లంకోవ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
క్రిమియా వ్యవహారంలో అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా ఆర్థికవ్యవస్థ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
కిమ్-పుతిన్ చర్చలతో ఏం జరగొచ్చు?
కిమ్, పుతిన్ సమావేశంలో కీలకమైన ఒప్పందాలేవీ కుదిరే అవకాశం లేదని విశ్లేషకుల్లో అత్యధికులు అంచనా వేస్తున్నారు.
అమెరికాతో భావి చర్చలకు తోడ్పడే వెసులుబాటును సృష్టించుకోవడం, అంతర్జాతీయంగా వీలైనంత గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు, రష్యా నుంచి ఆర్థిక సహాయం రూపంలో నిధులు తెచ్చుకోవడంపై ఉత్తర కొరియా దృష్టి కేంద్రీకరించింది. ఆంక్షల సడలింపు, వాణిజ్యం వృద్ధిలోనూ రష్యా తోడ్పాటునూ ఆశిస్తోంది. ఈ రెండు అంశాల్లో ఎందులోనూ రష్యా అండగా నిలిచే అవకాశాలు కనిపించడం లేదు.
క్రిమియా వ్యవహారంలో అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా ఆర్థికవ్యవస్థ కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రష్యా నుంచి ఉత్తర కొరియా పొందే గలిగేది పెద్దగా ఏమీ ఉండదని గతంలో రష్యాలో దక్షిణ కొరియా రాయబారిగా చేసిన లీ జై-చున్ తెలిపారు.
ట్రంప్‌తో కిమ్ సమావేశం విఫలమైందనే విషయం ఉత్తర కొరియా ప్రజలకు తెలుసని, ఈ నేపథ్యంలో, ఏదో సాధించినట్లుగా ఉత్తర కొరియా ప్రజలకు చూపించుకొనేందుకు పుతిన్‌తో సమావేశాన్ని ఉపయోగించుకొంటుండవచ్చని ఈ మాజీ రాయబారి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- BBC Reality Check: భారత దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- సముద్రంలోని ఇంట్లో కాపురమున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- ట్రంప్-కిమ్ భేటీ: ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి!
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)