‘నన్ను కాపాడి అమ్మ కోమాలోకి వెళ్లిపోయింది.. 27 ఏళ్ల తరువాత మళ్లీ మామూలు మనిషైంది’

ఫొటో సోర్స్, Science Photo Library
మెదడుకు గాయమైతే ఏళ్ల తరబడి కోమాలో ఉండిపోయే పరిస్థితులు తలెత్తుతాయి
పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఆశలు వదులుకోవద్దని అంటున్నారు యూఏఈకి చెందిన ఒమర్ వీబేర్. తమ కుటుంబంలో జరిగిన ఓ అద్భుతాన్ని వివరిస్తూ ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
ఒమర్ తల్లి మునీరా 27 ఏళ్ల పాటు కోమాలో ఉండి.. గత ఏడాది స్పృహలోకి వచ్చారు.
1991లో కారు ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అప్పడు ఆమె వయసు 32 ఏళ్లు కాగా, ఒమర్‌కు నాలుగేళ్లు.
ఒమర్‌ను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ బస్సును ఢీకొట్టింది. వెనుక సీట్లో ఒమర్‌తోపాటు ప్రయాణిస్తున్నారు మునీరా. ప్రమాద సమయంలో అతడికి గాయాలు కాకూడదని గట్టిగా హత్తుకుని కూర్చున్నారు.
అనుకున్నట్లుగానే ఆమె తన కుమారుడిని జాగ్రత్తగా కాపాడుకోగలిగారు. అతడికి ఓ చిన్న గాయం మాత్రమే తగిలింది. కానీ, మునీరా తలకు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది.
చాలా సమయం తర్వాత గానీ ఆమెకు వైద్యం అందలేదు. ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.
అప్పటి నుంచి వివిధ ఆసుపత్రుల్లో మునీరాకు ఆమె కుటుంబ సభ్యులు చికిత్సలు చేయిస్తూ వస్తున్నారు.
27 ఏళ్ల తర్వాత ఆశ్చర్యకరంగా జర్మనీలోని ఓ ఆసుపత్రిలో మునీరా కళ్లు తెరిచారు.
తమ కథను యూఏఈకి చెందిన 'ద నేషనల్' దినపత్రికతో ఒమర్ పంచుకున్నారు.
ఏదో ఒక రోజు తన తల్లి స్పృహలోకి వస్తారని తాను గట్టిగా నమ్మానని, ఎప్పుడూ ఆశలు కోల్పోలేదని ఒమర్ ఆ పత్రికకు చెప్పారు.
''మీ ఆత్మీయులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వారు మరణించారని అనుకోవద్దు. ప్రియమైనవారిపై ఎప్పుడూ ఆశలు కోల్పోవద్దని సందేశం ఇచ్చేందుకే మా కథను బయటకు చెబుతున్నా'' అని అన్నారు.
ఏళ్లపాటు సాగిన చికిత్సలు
ప్రమాదం జరిగిన తర్వాత మునీరాను కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం లండన్ ఆసుపత్రికి తరలించారు.
మునీరా కోమాలో ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె ప్రతిస్పందించలేరని, నొప్పిని మాత్రం అనుభవిస్తారని వారు తెలిపారు.
తిరిగి యూఏఈలోని అల్ ఎయిన్ నగరంలోని ఆసుపత్రికి మునీరాను తరలించారు. ఇన్సూరెన్స్ కారణాల రీత్యా అక్కడే వివిధ ఆసుపత్రులు మార్చుతూ వచ్చారు.
కొన్నేళ్ల పాటు ఆమెకు చికిత్సలు సాగాయి. ట్యూబ్ ద్వారా ఆమెకు వైద్యులు ఆహారం అందించేవారు. కండరాలు బలహీనపడకుండా ఫిజియోథెరపీ చేసేవారు.
2017 మునీరా కుటుంబానికి అబుదాబిలోని క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ గ్రాంట్ మంజూరు చేసింది. దీంతో ఆమెను మెరుగైన చికిత్సల కోసం జర్మనీకి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు.
అక్కడ ఆమెకు వైద్యులు వివిధ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. క్షీణించిన ఆమె కండరాలను సరిచేశారు.
గొడవ సమయంలో..
ఓ రోజు ఆసుపత్రిలో మునీరా ఉన్న గదిలో ఒమర్‌కు కొందరితో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు ఆమె స్పందించారు.
''వాగ్వాదం జరుగుతున్నప్పుడు నేను ప్రమాదంలో ఉన్నానని ఆమె అనుకున్నారు. కొన్ని వింత శబ్దాలు చేశారు. ఆమెను పరీక్షించమని వైద్యులను నేను కోరాను. వారంతా సవ్యంగా ఉందనే చెప్పారు'' అని ఒమర్ అన్నారు.
''మూడు రోజుల తర్వాత నన్ను ఎవరో పిలుస్తుండటంతో నిద్ర లేచా. పిలిచింది మా అమ్మే. నన్ను పేరు పెట్టి ఆమె పిలుస్తున్నారు. ఈ క్షణం గురించి ఏళ్ల నుంచి కలలు గన్నా. ఆనందంతో పరవశించిపోయా'' అని ఆయన చెప్పారు.
ఇప్పుడు మునీరా బాగా ప్రతిస్పందిస్తున్నారు. ఆమె నొప్పిని తెలుసుకోగలుతున్నారు. కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారు.
అబు దాబీకి మునీరాను కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. అక్కడ ఫిజియోథెరపీతోపాటు ఆమెకు వివిధ చికిత్సలు అందిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
మునీరా తరహా కేసులు వైద్య చరిత్రలో చాలా అరుదు.
అమెరికాలో 2003లో ఇలాగే టెర్రీ వాలీస్ అనే వ్యక్తి 19 ఏళ్ల కోమా తర్వాత కళ్లు తెరిచారు.
ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ మైకేల్ షూమేకర్ కూడా 2013లో ఫ్రాన్సులో తీవ్రంగా గాయపడి ఆరు నెలల పాటు కోమాలో ఉన్నారు.
ఇలా ఏళ్లపాటు కోమాలో ఉన్నవారు తిరిగి స్పృహలోకి వచ్చినా.. వారు కోలుకునేందుకు చాలా సమయం పట్టొచ్చని వైద్యులు అంటున్నారు.
కోమాలోకి వెళ్లినవారు తిరిగి కోలుకునే అవకాశాలను అంచనా వేయడం సాధ్యం కాదని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్‌సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- అమిత్ షా ప్రస్థానం: పోస్టర్లు అంటించే స్థాయి నుంచి పోస్టర్లపై చిత్రాల వరకూ
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- రఫేల్ తీర్పు సమీక్షపై కేంద్రం అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)