శ్రీలంకలో మరో పేలుడు

శ్రీలంక పేలుళ్లు,

ఫొటో సోర్స్, AFP

శ్రీలంకలో గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ పేలుడు వెనక ఉన్న కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

ఈ ఉదయం 9.30కు బాంబు పేలిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని శ్రీలంక పోలీసులు తెలిపారు.

గత ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది. మృతదేహాలకు బాధిత కుటుంబాలు అంత్యక్రియలు కూడా పూర్తి చేశాయి.

కాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారిలో ఒకరు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో చదువుకున్నాడని లంక రక్షణ శాఖ సహాయ మంత్రి తెలిపారు.

పేలుళ్ల వెనుక ఐఎస్ హస్తం ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘె అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఐఎస్ కూడా ఈ దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించుకున్నప్పటికీ ఇంతవరకు ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images

పేలుళ్లకు పాల్పడింది ఎవరు? ఇప్పుడేం జరుగుతోంది?

ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించినదిగా చెబుతున్న 'అమాక్' అనే మీడియా పోర్టల్ ఈ దాడులకు బాధ్యులు తామేనని చెప్పుకుంది.

కానీ దానిని ధ్రువీకరించలేం. ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ సాధారణంగా దాడుల తర్వాత ఆ దాడి చేసినవారి ఫొటోలు పోస్ట్ చేసి, దాడులు తామే చేశామని వెంటనే ప్రకటిస్తుంది.

శ్రీలంకలో దాడులు జరిగిన మూడు రోజుల తర్వాత వచ్చిన ఈ ప్రకటన నిజం అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.

శ్రీలంక ప్రభుత్వం 'నేషనల్ తౌహీద్ జమాత్' అనే ఒక స్థానిక జీహాదీ గ్రూప్ ఈ దాడులకు కారణమని చెబుతోంది. ఈ బాంబు పేలుళ్లు ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్ సాయంతో చేశారని అధికారులు చెప్పారు.

బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకూ 60 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 26 మందిని సీఐడీ, ముగ్గురిని యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్, 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టు చేసిన వారిలో 9 మందిని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టారు. వీరందరూ వెల్లంపట్టిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)