శ్రీలంక పేలుళ్లు: ఆసుపత్రుల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయంటూ భారతీయుల ఆగ్రహం

శ్రీలంక పేలుళ్ల బాధితులు

ఫొటో సోర్స్, Getty Images

శ్రీలంక బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 359కి చేరింది. మరో 500 మందికి పైగా గాయపడ్డారు.

భద్రత విషయంలో భారీ తప్పిదం జరిగిందని శ్రీలంక ప్రభుత్వం అంగీకరించింది. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన రక్షణ మంత్రి, పోలీస్ చీఫ్‌లను వారి పదవుల నుంచి తొలగించారు.

ఇటు దాడికి ప్రధాన కుట్రదారులుగా భావిస్తున్న జహరాన్ హషిమ్ సోదరి హషిమ్ మదానియా బీబీసీతో మాట్లాడుతూ తన సోదరుడు చేసిన దానిని తీవ్రంగా ఖండించారు. కుట్ర గురించి తనకు ఏ విషయం తెలియదన్నారు.

"అతడు చేసిన ఘోరం నాకు మీడియా ద్వారానే తెలిసింది. తను అలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతడు చేసిన కుట్రను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తను నా సోదరుడైనా సరే ఇలాంటి వాటికి నేను విరుద్ధం. నాకిప్పడు తన గురించి ఏ దిగులూ లేదు" అని మదానియా అన్నారు.

ఇటు ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన భారతీయుల కుటుంబాలు శ్రీలంకలో భద్రత లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, IMRAN QURESHI

ఆగ్రహంతో భారతీయుల ప్రశ్నలు

పేలుళ్లలో చనిపోయిన భారతీయుల మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటున్నాయి. ఈ ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బెంగళూరు మృతుల బంధువులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. కానీ మృతదేహాలు తీసుకువచ్చినవారు అక్కడి భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

"భద్రతలో జరిగిన తప్పిదానికి శ్రీలంక బాధ్యత వహించాలి. అది సెవెన్ స్టార్ హోటల్, కానీ అక్కడ కనీసం మెటల్ డికెక్టర్ కూడా లేదు" అని తండ్రి మృతదేహంతో బెంగళూరు చేరుకున్న అభిలాష్ లక్ష్మీనారాయణ బీబీసీతో అన్నారు.

అభిలాష్ తండ్రి కేఎం లక్ష్మీనారాయణ నీలమంగళ తాలూకా పంచాయతీ మాజీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన జనతాదళ్ సెక్యులర్ కార్యకర్త కూడా. ఏప్రిల్ 18న జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీకి చెందిన మరో ఏడుగురు కార్యకర్తలతోపాటూ విహారయాత్రకు ఆయన కొలంబో వెళ్లారు.

లక్ష్మీనారాయణ, మృతి చెందిన మిగతా జేడీఎస్ కార్యకర్తల మృతేహాలను చివరి చూపుల కోసం గ్లాస్ బాక్సుల్లో ఉంచి ఒక కాలేజీ మైదానంలో ఉంచారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC

పోలీసులు ఎక్కడా కనిపించలేదు

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ, ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విషాదంలో ఉన్న కుటుంబాలను కలిశారు. మృతులకు నివాళులు అర్పించారు.

శ్రీలంకలో జరిగిన దాడుల్లో మృతి చెందిన 11 మంది భారతీయుల్లో 8 మంది జనతాదళ్ సెక్యులర్ కార్యకర్తలే. వారికి నివాళులు అర్పించడానికి కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ కూడా అక్కడికి వచ్చారు.

"మా అమ్మ చాలా షాక్‌లో ఉంది. ఆమె మాట్లాడలేకపోతోంది. మా నాన్న తన జీవితాంతం చాలా కష్టపడ్డారు. ఇది ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. నేను వ్యాపార బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించాను" అని వృత్తిరీత్యా డెంటిస్టు అయిన డాక్టర్ ఎస్.మంజునాథ్ అన్నారు.

తన బంధువు ఎస్ఆర్ నాగరాజ్ రెడ్డిని వెతకడానికి, గాయపడ్డ పురుషోత్తం రెడ్డిని తీసుకురావడానికి కొలంబో వెళ్లిన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ కూడా శ్రీలంకలో భద్రత లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అంతపెద్ద దాడులు జరిగాయి, ఇప్పటికీ బాంబులు స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా ఎయిర్‌పోర్టులో మాకు ఎక్కువ మంది సైనికులు కనిపించలేదు. ఈ దాడుల తర్వాత ఆదివారం రాత్రి మేం కొలంబో చేరుకున్నప్పుడు అక్కడ చౌరస్తాల్లో ఎక్కడా పోలీసులే లేరు" అని విశ్వనాథ్ చెప్పారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC

సుపత్రుల్లో కుళ్లిపోతున్న మృతదేహాలు

నాగరాజ రెడ్డి, పురుషోత్తం రెడ్డి కింగ్స్‌బరీ హోటల్ కెఫేలో టిఫిన్ చేయడానికి వెళ్లినప్పుడు పేలుడు జరిగింది. వారితోపాటు టిఫిన్ చేయడానికి రాలేకపోయిన ఇద్దరు స్నేహితులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

పురుషోత్తం రెడ్డిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా బెంగళూరు తీసుకొచ్చి ఒక ఆస్పత్రిలో చేర్చారు.

ఇటు శ్రీలంక నుంచి తన బావ మృతదేహం తీసుకొచ్చిన ఎస్ శివకుమార్ కూడా ఇదే ఫిర్యాదు చేశారు. "ఆస్పత్రుల్లో మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ అన్ని మృతదేహాలు పెట్టడానికి తగినన్ని ఫ్రీజర్లు లేవు. మేం మృతదేహాన్ని పూర్తిగా కప్పేయాల్సి వచ్చింది. దాని పరిస్థితి దారుణంగా ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

సూసైడ్ బాంబర్ ఉన్నత విద్యావంతుడు

తొమ్మిది మంది సూసైడ్ బాంబర్లలో 8 మందిని శ్రీలంక పౌరులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు సోదరులు దేశ రాజధాని కొలంబోలోని పోష్ కాలనీలో ఉండే సంపన్న వ్యాపారులు.

ఆత్మాహుతి దాడులు చేసిన వారిలో ఒకరు శ్రీలంక రావడానికి ముందు బ్రిటన్, ఆస్ట్రేలియాలో చదువుకున్నట్లు కూడా తెలిసింది.

అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని బ్రిటన్‌ యాంటీ టెర్రరిజం సెక్యూరిటీ ఆఫీస్ మాజీ చీఫ్ క్రిస్ ఫిలిప్స్ అన్నారు.

"మిలిటెంట్లు చాలా డబ్బున్నవారని అనిపిస్తోంది. అంటే వాళ్లు ప్రపంచ యాత్ర చేయగలిగినంత సంపన్నులు".

"వాళ్లు యూరప్ లేదా బ్రిటన్ వచ్చారని తెలిసి మేం ఆశ్చర్యపోలేదు. మా బ్రిటన్ సెక్యూరిటీ ఏజెన్సీల దగ్గర మొదటే వారి గురించి ఎలాంటి సమాచారం లేదనేదే ఆందోళన కలిగించింది. కానీ అంతమాత్రాన ఆగిపోవడం ఉండదు. అతడు శ్రీలంక వెళ్లాక సూసైడ్ బాంబర్ అయ్యాడు. వీటన్నిటి గురించీ దర్యాప్తు చేస్తాం" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఇంకా భయం గుప్పిట్లో శ్రీలంక

శ్రీలంక ప్రభుత్వం ఈ ఆత్మాహుతి దాడులకు స్థానిక జిహాదీ సంస్థే కారణమని చెబుతోంది.

ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు 60 మందికి పైగా అరెస్టు చేశారు. దేశంలో అత్యవసర స్థితి కొనసాగుతోంది.

ఇస్లామిక్ స్టేట్ కూడా ఈ దాడులు తమ పనే అని చెప్పుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇటు శ్రీలంక ఈ దాడుల నుంచి ఇంకా కోలుకోలేకపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు బాంబు పేలుస్తారోనని దేశమంతా భయంలో గడుపుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)