మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ

  • 26 ఏప్రిల్ 2019
రేంజర్‌తో సెల్ఫీ దిగిన గొరిల్లాలు Image copyright Ranger Mathieu Shamavu
చిత్రం శీర్షిక మనుషుల్లా నిలబడి రేంజర్‌తో సెల్ఫీ దిగిన గొరిల్లాలు

రెండు గొరిల్లాలు రేంజర్ అధికారులతో సెల్ఫీ దిగడం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

ఫొటోలో ఈ గొరిల్లాలు సెల్ఫీకి చాలా స్టైలుగా ఫోజిస్తూ కనిపిస్తున్నాయి.

రేంజర్ అధికారులు ఈ రెండు గొరిల్లాలను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కాపాడారు.

ఈ సెల్ఫీ కాంగోలోని వీరుంగా నేషనల్ పార్క్‌లో తీసుకున్నారు.

వేటగాళ్ల దాడుల్లో ఏవైనా జంతువులు తల్లి లేనివి అయినప్పుడు వాటిని ఇక్కడకు తీసుకొస్తారు.

పార్క్‌ డిప్యూటీ డైరెక్టర్ బీబీసీతో మాట్లాడుతూ.. గొరిల్లాలు తమను చూసుకునే వారిని అనుకరిస్తాయని చెప్పారు.

రేంజర్ అధికారులను అవి తమ తల్లిదండ్రుల్లా చూస్తుంటాయని అన్నారు.

వీరుంగా డిప్యూటీ డైరెక్టర్ ఇనసెంట్ మబ్యూరంబే బీబీసీతో మాట్లాడుతూ.. "ఈ రెండు గొరిల్లాల తల్లులను 2007లో వేటగాళ్లు కాల్చి చంపేశారు. అప్పుడు వీటి వయసు రెండు నెలలు, నాలుగు నెలలు. కాసేపటి తర్వాత వాటిని వీరుంగాలో అభయారణ్యంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అవి అక్కడే ఉంటున్నాయి" అన్నారు.

ఈ రెండు గొరిల్లాలు రేంజర్ అధికారులతోపాటే పెరిగాయి. వాటిని కాపాడింది వాళ్లే. అవి మనుషులను అనుకరిస్తుంటాయి. మనుషుల్లాగే రెండు కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తుంటాయి.

కానీ ఎప్పుడో ఒకప్పుడు అలా జరుగుతుంటుంది.

"నేను ఆ ఫొటో చూసి ఆశ్చర్యపోయా. అది సరదాగా ఉంది. ఒక గొరిల్లా మనిషిలా నిలబడడం, వారిని అనుకరించడం చూస్తుంటే చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది" అని మబ్యూరంబే చెప్పారు.

ఒక రేంజర్ పని ఎప్పుడూ సరదాగా ఉండదు. అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

గత ఏడాది వీరుంగా నేషనల్ పార్క్‌లో ఐదుగురు రేంజర్లపై గుర్తు తెలియని తిరుగుబాటుదారులు దాడి చేశారు. 1996 నుంచి ఇప్పటివరకూ అలాంటి ఘటనలు 130కి పైనే జరిగాయి.

తూర్పు కాంగోలో ప్రభుత్వానికి, వివిధ సాయుధ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.

వీరిలో కొన్ని సాయుధ గ్రూపులు ఈ అభయారణ్యాన్ని తమ స్థావరంగా మార్చుకున్నాయి. అక్కడ వారు తరచూ జంతువులను వేటాడుతుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)