ఉత్తరకొరియాకు ప్రపంచ దేశాల మద్దతు అవసరం: రష్యా అధ్యక్షుడు పుతిన్

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా భద్రతపై ప్రపంచ దేశాల నుంచి గట్టి హామీ దొరికితేనే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అణ్వస్త్ర కార్యక్రమాలకు ముగింపు పలకగలరని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
కిమ్ చాలా ఓపెన్‌గా మనిషని.. అజెండాలోని అన్ని అంశాలపై స్వేచ్ఛగా మాట్లాడుకున్నామని పుతిన్ చెప్పారు. కొరియా ద్వీపకల్పం అణ్వస్త్ర రహితంగా మారాలని తాను కోరుకుంటున్నాని.. అయితే, ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం జరగాలే కానీ, బలమైన రాజ్యాల ఇష్టప్రకారం జరగకూడదని అన్నారు.
కొరియాలో శాంతికి రష్యా ఏం చేయాలో తెలుసుకునేందుకు ఈ సమావేశం తోడ్పడుతుందని పుతిన్ అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని పుతిన్ ఆకాంక్షించారు.
మరోవైపు కిమ్ కూడా పుతిన్‌తో తన సమావేశం చాలా అర్థవంతంగా సాగిందని చెప్పారు.
కిమ్, పుతిన్‌ల సమావేశం రష్యాలోని వ్లాదివోస్తోక్ ఫార్ ఈస్ట్ స్టేట్ యూనివర్సిటీలో జరిగింది.
ఒక రోజు ముందే కిమ్ అక్కడకు చేరుకోగా.. ఈ రోజు అక్కడకు చేరుకున్న పుతిన్.. కిమ్ వద్దకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
కిమ్ 2011లో ఉత్తరకొరియా పాలన బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన భేటీ అయిన ఆరో దేశాధినేత పుతిన్. పైగా.. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో రెండో విడత చర్చలు అర్ధాంతరంగా ముగిసిన కొద్ది కాలానికే కిమ్ ఇలా పుతిన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కిమ్, పుతిన్‌ల ఈ తొలి భేటీలో రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలూ తమ నిబద్ధత వ్యక్తం చేశారు.
కిమ్, పుతిన్ మధ్య ఈ సమావేశం ఒక కాలేజ్ క్యాంపస్‌లో జరిగింది. దీని కోసం కాలేజీ తరగతులు కూడా రద్దు చేశారు. కానీ కొంతమంది విద్యార్థులు నేతలిద్దరినీ చూడ్డానికి సమావేశం స్థలంలోనే ఉండిపోయారు.
కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య ఈ ఏడాది మొదట్లో వియత్నాం రాజధాని హనోయిలో శిఖరాగ్ర సదస్సు జరిగింది. అందులో ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చ జరిగింది.
అయితే ఇద్దరు నేతల మధ్య జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ఎలాంటి ఒప్పందాలూ లేకుండానే ముగిసింది. రష్యా చేరుకున్న తర్వాత ఉత్తర కొరియా నేత రష్యా అధికారులను ఉత్సాహంగా కలిశారు.
రష్యా బ్యాండ్‌తో కిమ్‌కు స్వాగతం పలికింది. ఆ తర్వాత కిమ్ కార్లో కూచుని వెళ్లారు.
అంతకు ముందు కిమ్ రష్యా టీవీతో "ఈ పర్యటన విజయవంతం అవుతుందని, గౌరవ అధ్యక్షుడు పుతిన్‌తో కొరియా ద్వీపకల్పానికి సంబంధించిన అంశాలు, ఇరుదేశాల సంబంధాల బలోపేతం గురించి అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని" చెప్పారు.
ఫొటో సోర్స్, AFP
సమావేశం గురించి ఇప్పటివరకూ తెలిసింది
రష్యా సిక్స్-పార్టీ టాక్స్ ద్వారా కొరియా ద్వీకపల్పం అణ్వాయుధాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించుకోవచ్చని రష్యా అధ్యక్షుడి ప్రతినిధి దిమిత్రి పెసకోవ్ చెబుతున్నారు.
ప్రస్తుతానికి ఈ చర్చలు నిలిచిపోయున్నాయి.
2003లో ప్రారంభమైన ఈ చర్చల్లో ఉభయ కొరియా దేశాలతోపాటు చైనా, జపాన్, రష్యా, అమెరికా పాల్గొన్నాయి.
పెసకోవ్ మీడియా మసావేశంలో "ఇప్పుడు దీనికంటే మెరుగైన అంతర్జాతీయ వ్యూహం ఏదీ లేదు. కానీ మరోవైపు, రెండో దేశం వైపు నుంచి కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ రెండు కొరియా దేశాల సమస్యలను పరిష్కరించి, అణునిరాయుధీకరణను కోరుకున్నప్పుడే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి" అన్నారు.
ఫొటో సోర్స్, AFP
కిమ్ జోంగ్-ఉన్ తన ఆర్మర్డ్ రైలులో రష్యా చేరుకున్నారు
రెండు దేశాలు ఏం కోరుకుంటున్నాయి
బీబీసీ దక్షిణ కొరియా ప్రతినిధి లారా బికర్ ఈ పర్యటనను ఉత్తర కొరియాకు ఒక అవకాశంగా చూడవచ్చని అంటున్నారు.
అమెరికాతో చర్చలు విఫలమైన తర్వాత, ఇప్పటికీ తమకు ఒక శక్తివంతులైన సహచరుడు ఉన్నట్టు ఆ దేశం చూపించవచ్చు.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వల్లే హనోయిలో చర్చలు విఫలమయ్యాయని ఉత్తర కొరియా ఆరోపించింది.
అమెరికా అణు చర్చల నుంచి ఆయన్ను తొలగించాలని ఉత్తర కొరియా ఈ నెల మొదట్లో డిమాండ్ చేసింది.
ఆయన పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. అందుకే ఆయన స్థానంలో ఎవరైనా ఎక్కువ జాగ్రత్తగా ఉండేవారిని చేర్చాలని చెప్పింది.
భవిష్యత్తులో తాము పూర్తిగా అమెరికాపై ఆధారపడి లేమని చూపించడానికి ఉత్తర కొరియాకు ఈ సమావేశం ఒక అవకాశం అని బీబీసీ ప్రతినిధి చెబుతున్నారు.
కిమ్ ఆంక్షలను సడలించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తారు.
ఫొటో సోర్స్, Reuters
కిమ్-పుతిన్ సమావేశం జరిగే రస్కీ ద్వీపం
రష్యా-ఉత్తర కొరియా సంబంధాలు
కొరియా ద్వీపకల్పంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తున్నామని చూపించుకోడానికి రష్యాకు కూడా ఈ సమావేశం ఒక అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రపతి పుతిన్ గత కొంత కాలంగా ఉత్తర కొరియా నేతను కలవాలని అనుకుంటున్నారు. కానీ ట్రంప్, కిమ్ సమావేశాలతో రష్యా పక్కకు ఉండిపోయింది.
అమెరికా, చైనా లాగే రష్యా కూడా ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశం కావడంపై అసౌకర్యంగా ఉంది.
కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్‌కు ఉత్తర కొరియాతో మంచి సైనిక, వాణిజ్య సంబంధాలుండేవి.
1991లో సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత రష్యా, ఉత్తర కొరియా మధ్య వాణిజ్య సంబంధాలు బలహీనం అయ్యాయి. ఉత్తర కొరియా, చైనాను తమ ప్రధాన సహచరుడుగా చేసుకుంది.
అధ్యక్షుడు పుతిన్ పాలనలో రష్యా ఆర్థికంగా బలోపేతమైంది. 2014లో ఉత్తర కొరియా సోవియట్ కాలంలో తీసుకున్న చాలా రుణాలు ఆయన మాఫీ చేశారు.
అయితే ప్రస్తుతం రష్యాకు ఉత్తర కొరియా ఇంకా ఎంత బాకీ ఉందనే విషయంపై చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
- ఓటర్ ఐడీ కోసం ట్రాన్స్జెండర్లకు ఇన్ని ఇబ్బందులా
- అనంతలో కియా ఫ్యాక్టరీ: "భూములిచ్చినవారికి ఉద్యోగాలన్నారు, మా చదువునుబట్టే ఇవ్వమని అడుగుతున్నాం"
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- ట్రంప్-కిమ్ భేటీ: ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి!
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)