శ్రీలంక పేలుళ్లు: ‘మా ఊరి మనిషికి సంబంధాలుండటం బాధాకరమే.. మేమంతా షాక్‌లో ఉన్నాం’

  • 26 ఏప్రిల్ 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారి’గా భావిస్తున్న హషీమ్ చెల్లెలు ఏమంటున్నారంటే

శ్రీలంక పేలుళ్లలో జహ్రాన్ హషీమ్ ప్రధాన ముద్దాయి అని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నాక, హషీమ్ సోదరి హషీమ్ మదానియా దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన సోదరుడు ఆత్మాహుతి బాంబర్ల బృందానికి నాయకుడన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోతున్నారు.

జహ్రాన్ హషీమ్.. శ్రీలంకలోని తీరప్రాంత పట్టణం కట్టంకుడికి చెందిన వ్యక్తి. ఈ పట్టణంలో ముస్లిం జనాభా ఎక్కువ.

చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా జరిగిన ఈ పేలుళ్లలో 350కు పైగా మరణించారు. తన సోదరుడు చేసిన పని గురించి, భవిష్యత్తులో ఇంకా ఏం జరుగుతుందోనని మదానియా ఆందోళన చెందుతున్నారు. మదానియా.. జహ్రాన్ హషీమ్ సోదరి అనే విషయం తెలిశాక, ఆమెతో పోలీసులు మాట్లాడారు. కానీ ఈ పేలుళ్లతో మదానియాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు భావించడం లేదు.

ఆత్మాహుతి బాంబర్లకు నాయకత్వం వహించినట్లు ఆరోపణలు వస్తున్న హషీమ్ ఈ దాడుల్లో మరణించారు.

పేలుళ్లకు, తన సోదరుడు హహీమ్‌కు సంబంధాలున్నాయని వార్తలు రావడంతో, చాలామంది దృష్టి మదానియాపై మళ్లింది. ఈ పరిణామంతో ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు. మదానియా తల్లిదండ్రులకు ఐదుగురు పిల్లలు. వీరిలో ఈమెనే అందరికంటే చిన్నవారు. 40ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్న హషీమ్ పెద్ద కుమారుడు.

2017లో రెండు ముస్లిం వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో, హషీమ్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినపుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, అప్పటినుంచి తన అన్నను ఎప్పుడూ చూడలేదని మదానియా చెబుతున్నారు.

ఆదివారం జరిగిన పేలుళ్ల తర్వాత ఓ వీడియో వెలుగు చూసింది. ఆ వీడియోలో.. జహ్రాన్ హషీమ్‌గా భావిస్తున్న వ్యక్తి, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నాయకుడు అబు బకర్ అల్ బగ్దాదీని ప్రార్థిస్తూ కనిపిస్తాడు. వీడియోలోని 8 మందిలో హషీమ్ మాత్రమే కనిపిస్తాడు. శ్రీలంక పేలుళ్లకు పాల్పడింది ఈ ఎనిమిదిమందేనని ఐఎస్ చెబుతోంది.

చిత్రం శీర్షిక కట్టంకుడిలోని ముస్లిం ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు

‘నిందితులంతా మధ్యతరగతి వారే’

అయితే, పేలుళ్లకు పాల్పడింది మొత్తం 9 మంది అని, వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరంతా శ్రీలంకకు చెందిన చదువుకున్న, మధ్యతరగతి ప్రజలేనని, ఒకరు మాత్రం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో చదువుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

వీరిలో ఇద్దరు వ్యక్తులు, శ్రీలంకలోని ప్రముఖ వ్యాపారి కుమారులు. ప్రస్తుతం ఆ వ్యాపారి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఆ వ్యాపారి కుమారుల ఇళ్లలో ఆదివారంనాడు పోలీసులు సోదా చేయడానికి ప్రయత్నించినపుడు, వారిలో ఒకరి భార్య, తన ఇద్దరు పిల్లలతోపాటు కొందరు పోలీసు ఆఫీసర్లను చంపి, తాను కూడా కాల్చుకుని చనిపోయినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

''తన కార్యకలాపాల గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాను. తను ఇలా చేస్తాడని ఎప్పుడూ ఊహించలేదు'' అని తన అన్న గురించి మదానియా చెప్పారు.

''అతను చేసిన పని గురించి బాధపడుతున్నాను. నా అన్న అయినప్పటికీ, తను చేసిన పనిని అంగీకరించలేను. ఇకపై అతని గురించి ఏమాత్రం ఆలోచించను'' అన్నారు.

మతం పట్ల విశ్వాసం లేనివారిని నిందిస్తూ కొన్నేళ్ల క్రితం యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వీడియోలు పోస్ట్ చేయడంతో హషీమ్.. స్థానికంగా ప్రాచుర్యం పొందారు.

ఈ వీడియోలు.. ఇతర మైనారిటీ ముస్లింలలో ఆందోళన కలిగించాయి. ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని అక్కడి ఇస్లాం మతపెద్దలు చెబుతున్నారు. అయితే, అజ్ఞాతంలోకి వెళ్లాక హషీమ్‌ జాడ తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.

కానీ, కట్టంకుడి లాంటి ఓ చిన్న పట్టణంలో మత బోధకుడిగావున్న ఓ సాధారణ వ్యక్తి ఏదో ఒకరోజు ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడి, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాడని, స్థానిక అతివాద సంస్థలు-ఐఎస్ లాంటి అంతర్జాతీయ సంస్థలకు మధ్య కొత్త సంబంధాలకు తెరలేపుతాడని కొందరు ముందే ఊహించి ఉండొచ్చు.

చిత్రం శీర్షిక పేలుళ్లలో చనిపోయినవారికి నివాళి అర్పిస్తూ కట్టంకుడి పట్టణంలో కట్టిన తెల్ల రిబ్బన్లు

''చిన్నప్పుడు మేం అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఇరుగుపొరుగువారితో మా అన్న ఎంతో స్నేహంగా ఉండేవాడు. కానీ గత రెండేళ్లుగా తన ఆచూకీ లేదు'' అని మదానియా అన్నారు.

అయితే హషీమ్‌కు ఐఎస్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయా లేక ఇతను తనకుతానే జిహాదీగా మారి, ఐఎస్‌ పట్ల భక్తిభావంతో ఉన్నవాడా అన్న విషయంలో స్పష్టత లేదు. కట్టంకుడి పట్టణానికి సమీపంలో మట్టంకలప్పు నగరం ఉంది. ఆదివారం జరిగిన పేలుళ్లలో ఈ నగరంలోని జియోన్ చర్చిలో 28మంది చనిపోయారు.

50వేల మంది కంటే తక్కువ జనాభా ఉన్న కట్టంకుడి పట్టణం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది.

హషీమ్ ఇంటిని వెతుకుతున్నపుడు, చాలా మంది సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. హషీమ్ గురించి మాట్లాడటానికి అందరూ భయపడుతున్నారు.

పేలుళ్ల ఘటన తర్వాత ముస్లిం వర్గం మొత్తం భయాందోళనలో ఉంది.

''మా ఊరికి చెందిన వ్యక్తికి పేలుళ్లతో సంబంధాలుండటం మాకు బాధాకరమే. ఈ ఘటనతో మేమంతా షాక్‌లో ఉన్నాం. ఇలాంటివారిని మేం అంగీకరించం. మేమంతా ఐకమత్యాన్ని విశ్వసిస్తాం'' అని కట్టంకుడి మసీదుల సమాఖ్య నాయకుడు మొహమ్మద్ ఇబ్రహీం మొహమ్మద్ జుబైర్ అన్నారు.

నేను కట్టంకుడి వెళ్లినపుడు, పేలుళ్లకు నిరసనగా ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. చనిపోయినవారికి నివాళులు అర్పిస్తూ, రహదార్ల గుండా నలుపు-తెలుపు రిబ్బన్లు కట్టారు.

చిత్రం శీర్షిక జహ్రాన్ హషీమ్ నిర్మించిన మసీదు

ఒక చిన్న మతప్రబోధకుడిగా జీవితం ప్రారంభించిన హషీమ్, తన ప్రసంగాలతో అనతికాలంలోనే చాలామందిని ఆకర్షించారని మదానియా అన్నారు. పేరుప్రఖ్యాతులు వచ్చాక, ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి ఆ ప్రాంతమంతా పర్యటించారని ఆమె చెప్పారు.

ప్రధాన స్రవంతిలోని ఇస్లామిక్ సంస్థలు, హషీమ్ భావజాలంతో విభేదించి, తమ సభలు, సమావేశాల్లో హషీమ్ ప్రసంగించకుండా అడ్డుకున్నాయి. అప్పుడే హషీమ్.. 'ద నేషనల్ తౌహీద్ జమాత్' (ఎన్‌టీజే) సంస్థను కట్టంకుడి కేంద్రంగా ప్రారంభించారు.

సాగర తీరానికి దగ్గర్లో ఒక మసీదును నిర్మించి, అందులో ప్రార్థనలు, తరగతులను నిర్వహించారు. సోషల్ మీడియాలో హషీమ్ విద్వేషకర ప్రసంగాలు వెలుగుచూశాక, ఆయనను ఎన్‌టీజే నుంచి బహిష్కరించారని స్థానికులు చెబుతున్నారు.

బహిష్కరణకు గురయ్యాక కూడా, రెచ్చగొట్టే వీడియోలను అజ్ఞాతం నుంచి పోస్ట్ చేసేవారు. అయితే, ఎన్‌టీజే సంస్థతో హషీమ్ నిజంగానే తెగతెంపులు చేసుకున్నారా లేదా అన్న అంశంలో ఇంకా అనుమానాలు ఉన్నాయి.

ఎన్‌టీజే సంస్థ నుంచే మరో సంస్థ ఉద్భవించిందని శ్రీలంక డిప్యూటీ రక్షణ శాఖ మంత్రి రువాన్ విజేవర్ధనే అన్నారు.

చిత్రం శీర్షిక హషీమ్ లాంటివారిని తాము సమర్థించం అని చెబుతున్న మొహమ్మద్ ఇబ్రహీం మొహమ్మద్ జుబైర్

ఆత్మాహుతి పేలుళ్లలో జహ్రాన్ హషీమ్ కూడా మరణించారు. ఈ దాడులకు విదేశీ గడ్డపై నుంచి సహాయం అందిందన్న విషయం స్పష్టమైనట్లే ఉంది.

పేలుళ్లు జరగడానికి కొన్నిరోజుల ముందే, తమ తల్లిదండ్రులు కూడా ఇల్లు వదిలి వెళ్లినట్లు మాటల సందర్భంలో మదానియా చెప్పారు. అప్పటినుంచి వారెక్కడ ఉన్నారన్న విషయం తనకు తెలీదని అన్నారు.

''మా అమ్మానాన్నలతో హషీమ్‌ టచ్‌లో ఉన్నారని నాకు అనిపిస్తోంది'' అని మదానియా చెప్పారు. హషీమ్ తమ్ముడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

హషీమ్ చర్యను స్థానిక ముస్లిం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడుల పట్ల తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రతీకార జ్వాలలు ఎప్పుడు రేగుతాయోనని ఈ చిన్న పట్టణం ఇంకా భయపడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)