కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?

కిమ్

ఫొటో సోర్స్, Getty Images

కిమ్ జోంగ్ ఉన్.. సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో ఆ పేరే ఒక సంచలనం. అమెరికాతో వైరం.. ఢీ అంటే ఢీ అన్న వైనం మొత్తం ప్రపంచం చూసింది. ఆ తరువాత ప్రపంచానికి అణుయుద్ధం ముప్పు తప్పించే లక్ష్యంతో ఉత్తరకొరియా, దాని చిరకాల ప్రత్యర్థి అమెరికా మధ్య సయోధ్య కోసం ప్రయత్నమూ జరిగింది.

కానీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఒకసారి సమావేశమైనా రెండో భేటీ మాత్రం అర్ధంతరంగా ముగిసింది.

ఆ ప్రతిష్టంబన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తాజాగా ఇప్పుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్ ఎవరు.. ప్రపంచ రాజకీయాల్లో ఆ పేరు ఎందుకంత సంచలనం?

ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఎవరిని కలిసినా ప్రపంచం ఎందుకంత ఆసక్తిగా చూస్తుంది?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ నేపథ్యంలో.. కిమ్ అధ్యక్షుడు కావడం నుంచి అమెరికాకు దడపుట్టించడం వరకు.. వరుస క్షిపణి ప్రయోగాల నుంచి ఎంత దూరమైనా సొంత రైలులోనే ప్రయాణించే అలవాటు వరకు పలు ఆసక్తికర అంశాలివి.

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర కొరియా పగ్గాలు అందుకోవడమే సంచలనాలకు ఆరంభం.

కిమ్ జోంగ్ ఉన్ 2011లో ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారు. 2011 డిసెంబరు 17న ఉత్తర కొరియా అప్పటి అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించడంతో ఆయన చిన్న కుమారుడు కిమ్ జోంగ్ ఉన్‌ను ఈ పదవి వరించింది.

తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా, దేశ సైన్యాధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు.

కిమ్ జోంగ్ ఉన్ 27 ఏళ్లకే ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యారు. తన తాత కిమ్ ఇల్ సంగ్ పోలికలతో కనిపించడం కోసం ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్తారు. తాత కిమ్ ఇల్ సంగ్ ఉత్తర కొరియాకు తొలి పాలకుడు. 1948 నుంచి 1994లో మరణించే వరకు ఆయన ఉత్తర కొరియా ప్రీమియర్‌గా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడుయ్యారు. 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పగ్గాలు అందుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కిమ్ ప్రయాణించే సాయుధ రైలు

ఎవరికీ అర్థం కాని నేత

కిమ్ జోంగ్ ఉన్‌ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారో, ఏ ప్రయోగం చేస్తారో ఎవరికీ అర్ధం కాదు.

2016 జనవరిలో ఆయన భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్ష మొదలుపెడుతున్నానని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త ప‌రిస్థితి సృష్టించారు.

ఓ వైపు ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, మరోవైపు ‘అగ్రరాజ్యం’ అమెరికా ఒత్తిడి.. అయినా దేనికీ తలొగ్గకుండా దూకుడును కొనసాగించే కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామను సైతం వదల్లేదు.

రాజకీయంగా తనపై కుట్ర చేస్తున్నాడంటూ 2013లో ఆయనను ఉరితీసి సంచలనం సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కిమ్ తాత, తండ్రి చిత్రపటాలు

కిమ్ జోంగ్ ఇల్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్ జోంగ్ ఉన్. ఆయన 1983 లేదా 1984 లో జన్మించారు. ఆయన తండ్రికి వారసుడిగా దేశాధ్యక్షుడవుతాడని ఎవరూ అనుకోలేదు.

అందరూ అతడి సోదరులు కిమ్ జోంగ్ నామ్, లేదా కిమ్ జోంగ్ చొల్ లో ఎవరో ఒకరు అవుతారని అనుకున్నారు. కానీ కిమ్ జోంగ్ ఉన్ 27 ఏళ్లకే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.

ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్‌ని 27 ఏళ్లలోపే అంత పెద్ద పదవి ఎలా వరించింది? ఇద్దరు సోదరులు రాజకీయంగా బలహీనంగా ఉండటం వల్లనే కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పదవిని అధిష్టించారని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.

అంతకు ముందు ఆయన ఉత్తర కొరియా ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించడం కూడా కలిసివచ్చిందని అంటారు.

స్విట్జర్లాండ్‌లో విద్యాభ్యాసం

స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కింగ్ జోంగ్ ఉన్ మాత్రం ఎప్పుడూ పాశ్చాత్య ప్రభావాలకు లొంగలేదు.

యూరోపియన్లతో ఎక్కువగా కలిసేవారు కాదు. అప్పట్లో ఆయన స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తరువాత ఉత్తర కొరియా రాయబారితో కలిసి భోజనం చేసేవారు.

అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ ఇల్ సాంగ్ మిలిటరీ యూనివర్సిటీలో చేరారు.

ఫొటో సోర్స్, Getty Images

"మార్నింగ్ స్టార్‌ కింగ్"

కిమ్ జోంగ్ ఉన్ తల్లి కో యోంగ్ హుయి, తండ్రికి ప్రియమైన భార్య. ఆమె అతన్ని ''మార్నింగ్ స్టార్ కింగ్" అని పిలిచేవారు.

2003లో ఒక జపాన్ రచయిత "ఐ వజ్ కిమ్ జోంగ్ ఇల్స్ చెఫ్ " అనే పుస్తకంలో కిమ్ జోంగ్ ఉన్‌ను అతడి తండ్రి ముగ్గురు కొడుకుల్లో ఎక్కువగా ప్రేమించేవారని తెలిపారు.

2010 ఆగస్టులో ఉన్ తన తండ్రితో కలిసి చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ చానల్.. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి వారసుడని ఒక వార్తలో పేర్కొంది.

కిమ్ జోంగ్ ఉన్ పోలికలు ఉత్తర కొరియా వ్యవస్ధాపకుడు, ఆయన తాత అయిన కిమ్ ఇల్ సంగ్‌ లాగా ఉన్నాయని, అందుకే ఆయన అధికారానికి వారసుడయ్యాడని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

అయితే తనలో తాత పోలికలను మరింత స్పష్టంగా చూపించేందుకు ఉన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారని కొందరు అంటారు.

తొలి బహిరంగ ప్రసంగం

కిమ్ ఇల్ సంగ్ 100వ జయంతి సందర్భంగా 15 ఏప్రిల్ 2012 లో కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఆ ప్రసంగంలో ఉత్తర కొరియా బెదిరింపులకు గురవుతోందంటూ.. దేశ రక్షణ కోసం "మిలిటరీ ఫస్ట్" అనే నినాదమిచ్చారు.

సైనిక సాంకేతికతపై ఆధిపత్యం సామ్రాజ్యవాద దేశాలకు మాత్రమే పరిమితం కాదని తమ దేశ సైన్యం కూడా సాంకేతికతలో ముందుండాలని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కిమ్ భార్య రి సోల్ జు

వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యం

కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచారు.

ఓ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్‌తో ఓ మహిళ ఉన్న ఫుటేజ్‌ని ఒక టీవీ చానల్ చూపించే వరకు అసలు ఎవరికీ కిమ్ జోంగ్ ఉన్ వైవాహిక జీవితం గురించి తెలియలేదు.

జూలై 2012లో ఆ దేశ మీడియా కిమ్ జోంగ్ ఉన్ కామ్రేడ్ రి సోల్ జుని పెళ్లి చేసుకున్నారని తెలిపింది.

ఇంతకీ రి సోల్ జు ఎవరు?

ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి కూడా ఎలాంటి వివరాలు బయటపడలేదు. చివరికి ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఆధారంగా ఆమె ఎగువ తరగతి కుటుంబానికి చెందిన మహిళగా విశ్లేషకులు అంచనా వేశారు.

కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె అన్ని విధాలా సరియైన జోడీ అని పరిశీలకులు అంటారు.

కొందరయితే రి సోల్ జు ఒక గాయని, ఓ ప్రదర్శనలో కిమ్ జోంగ్ ఆమె పట్ల ఆకర్షితులయ్యారని అంటారు. కిమ్ జోంగ్, రి సోల్ పెళ్లికి సంబంధించి ఇంతకుమించి వివరాలు ఎవరికీ తెలియవు.

అధికారిక కార్యక్రమాలే కాకుండా ఈ జంట అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఓ సారి, డిస్నీ చానల్ ప్రదర్శనలో ఓ సారి పాల్గొంది. వీరు జనాల మధ్యలోకి వచ్చింది చాలా తక్కువ.

కిమ్ జోంగ్ ఉన్‌కు ఎంతమంది పిల్లలు?

ఈ విషయం కూడా తెలియదనే చాలా మంది చెప్తారు. అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్ మాన్ 2013, 2014ల్లో కిమ్ జోంగ్ ఉన్‌ను కలిశారు. డెన్నిస్ రాడ్ మాన్ గార్డియన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిమ్ జోంగ్‌కు ఒక కూతురుందని తెలిపారు.

అయితే, ఈ మధ్యనే ఆయనకు మూడో సంతానం కలిగినట్టు వార్తలు వెలువడ్డాయి.

అంతర్జాతీయ ప్రతిస్పందన

2012లో కిమ్ జోంగ్ ఉన్ ఉన్నత స్థాయి సైనిక పునర్వ్యవస్థీకరణ జరిపారు. అందులో భాగంగా ఆయన అప్పటి ఆర్మీ చీఫ్ రి యోంగ్ హోను సైనికాధిపతి పదవి నుంచి తొలగించి అత్యున్నత సైనిక పదవి "మార్షల్"ని అధిష్టించారు.

ఈ చర్య అప్పట్లో అంతర్జాతీయ స్ధాయిలో దుమారం రేపింది. పలు దేశాలు ఈ చర్యను ఖండించాయి.

ప్రపంచ దేశాల హెచ్చరికలను, ఆంక్షలను లెక్క చేయకుండా పలు దఫాలుగా క్షిపణుల ప్రయోగంతో కిమ్ జోంగ్ ఉన్ ఎన్నో వివాదాలను సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షలకు డోంట్ కేర్

2012 ఏప్రిల్ తర్వాత ఉత్తర కొరియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రాకెట్‌ని ప్రయోగించింది. ఆ ప్రయత్నం విఫలమైంది. పలు దేశాలు ఇలాంటి ప్రయోగాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి.

ఆ తరువాత 2012 డిసెంబర్‌లో ఉత్తర కొరియా మూడు దశల రాకెట్ టెక్నాలజీతో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా జపాన్, అమెరికాలు ఉత్తర కొరియాపై మండిపడ్డాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తర కొరియా చర్యను ఖండిస్తూ, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది.

2013 ఫిబ్రవరిలో ఉత్తర కొరియా మూడో అణు పరీక్షను చేపట్టింది. ఆ పరీక్ష 2009లో చేసిన పరీక్ష కన్నా రెండు రెట్లు పెద్దది. దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది.

ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాలపై దక్షిణ కొరియా విసుగు చెందింది. రెండు దేశాల మధ్య అగాధం మరింత పెరగడంతో 2013 ఏప్రిల్‌లో ఉభయ దేశాలు సంయుక్తంగా నడిపే కైసాంగ్ వాణిజ్య పార్క్‌ను మూసేస్తున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. కానీ అదే ఏడాది సెప్టెంబరులో రెండు దేశాల మధ్య చర్చలు సఫలమవడంతో ఆ వాణిజ్య పార్క్‌ను తిరిగి తెరిచారు.

2016 జనవరిలో ఉత్తర కొరియా తన మొట్ట మొదటి భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది. దీంతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.

పలుదేశాలు ఈ పరీక్షపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉత్తర కొరియా ఈ పరీక్షతో ఆధునిక అణు సామర్ధ్యం తనకుందని ప్రకటించుకుంది.

తన మేనమామ చాంగ్ సాంగ్‌ను విధుల నుంచి తొలగించడంపై పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్తర కొరియాకు గుండెకాయ వంటి నేషనల్ డిఫెన్స్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చాంగ్ సాంగ్ ఉండేవారు.

ఆయనను ఉరి తీయడంపై కిమ్ జోంగ్ ఉన్ 2014 జనవరి 1వ తేదీన బహిరంగ ప్రకటన చేస్తూ ముఠా మురికిని తుడిచేశామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్‌తో చర్చలు

కిమ్ వరుస అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి పరీక్షలు చేస్తుండడంతో పలు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. అమెరికా బెదిరించినా కిమ్ కూడా అంతేస్థాయిలో ప్రతిస్పందించారు. అనంతరం హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, కిమ్‌ మధ్య చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

ఇద్దరు నాయకుల మధ్య ఒక విడత చర్చలు జరిగాయి. రెండో విడత చర్చలు అర్ధంతరంగా ఆగిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)