సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం: మంచిదేనా? ప్రజలు ఏమనుకొంటున్నారు?

  • 30 ఏప్రిల్ 2019
శ్రీలంక దాడులు Image copyright Reuters

శ్రీలంకలో ఈ నెల 21న చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నమైన స్వరం వినిపిస్తోంది.

దాడుల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

గతంలో వివిధ దేశాల్లో ఇంటర్నెట్‌పై, సోషల్ మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించినప్పుడు ఉదారవాదులు తప్పుబట్టారు. ఆంక్షలను ఆన్‌లైన్ స్వేచ్ఛపై ప్రమాదకర దాడులుగా వారు ఆక్షేపించారు. కానీ ఇప్పుడు శ్రీలంక విషయంలో భిన్నమైన స్వరం వినిపిస్తోంది.

అమెరికాలోని ప్రముఖ పత్రిక 'ద న్యూయార్క్ టైమ్స్‌'లో టెక్నాలజీ జర్నలిస్టు కారా స్విషర్ రాసిన వ్యాసానికి పెట్టిన శీర్షికను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. "సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం మంచి చర్య" అనే అర్థంలో ఆమె శీర్షిక పెట్టారు.

Image copyright Reuters

సోషల్ మీడియాపై నిషేధం మంచిదేనని అంగీకరించడం సిగ్గుపడాల్సిన విషయమే అయినప్పటికీ, విద్వేషం, తప్పుడు సమాచారం వ్యాప్తిలో సోషల్ మీడియా వేదికలు పోషిస్తున్న పాత్ర తనను ఈ చర్యను సమర్థించేలా చేసిందని ఆమె స్పష్టం చేశారు.

ఇంటర్నెట్‌ అంతా మంచే చేస్తుందనే భావన వాస్తవ విరుద్ధమనే ఆలోచన చాలా మందిలో ఉంది. ఈ ఆలోచనకు ఆమె వ్యాసం అద్దం పట్టింది.

ఫేస్‌బుక్‌పై నీలినీడలు

నిరంకుశ ప్రభుత్వాలపై పోరాటానికి సరికొత్త వజ్రాయుధంగా ఫేస్‌బుక్ 'అరబ్ స్ప్రింగ్' ఉద్యమ సమయంలో అందరి మన్ననలు అందుకుంది.

మయన్మార్‌లో రోహింజ్యాలపై హింసను ప్రేరేపించడానికి, న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో మసీదులో కాల్పులను ఓ దుండగుడు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఇదే ఫేస్‌బుక్‌ను వాడినప్పుడు దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Image copyright Reuters

శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం గురించి ఆ దేశానికి చెందిన బ్లాగర్, సోషల్ మీడియా యాక్టివిస్టు సంజనా హత్తోతువా అభిప్రాయాన్ని అడిగితే, ఈ చర్య మంచిదా, కాదా అనేది ప్రజలు ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. కానీ చాలా మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపారు.

తప్పుడు సమాచారం వ్యాప్తిని నియంత్రించడంలో ఈ చర్య తోడ్పడుతుందనే భావన వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు.

ప్రభుత్వ వైఫల్యాలను, పౌర స్వేచ్ఛపై దాడుల వివరాలను నమోదు చేసేందుకు ఆయన శ్రీలంకలో తొలిసారిగా పౌర పాత్రికేయ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.

సాధారణంగా సోషల్ మీడియా మంచి పాత్ర పోషిస్తుందని, నిషేధం కొనసాగితే దీనికి అడ్డంకులు ఏర్పడొచ్చని ఈ యాక్టివిస్టు ఆందోళన వ్యక్తంచేశారు. "ఈ నిషేధం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే, శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలకు తమ సంబంధీకులతో మాట్లాడుకోవడం అంత కష్టం అవుతుంది" అని వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

"ఉగ్రవాద దాడులకు ప్రభుత్వ నిష్క్రియాపరత్వమే కారణమనే విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ విమర్శలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాను నియంత్రిస్తోందనే భావనా చాలా మందిలో ఉంది" అని హత్తోతువా వివరించారు.

సోషల్ మీడియాతో హానిపై చర్చ జరగాల్సి ఉందని ఆయన అంగీకరించారు. అదే సమయంలో, శ్రీలంకలో ప్రభుత్వం, ప్రధాన మీడియాపై ప్రజలకు నమ్మకం లేదని, ఇక్కడ సమాచార వినిమయానికి సోషల్ మీడియా ఒక ముఖ్య సాధనమని ప్రస్తావించారు.

గత సంవత్సరం డేటా, వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనలు బయటపడినప్పుడు ప్రజాగ్రహం వ్యక్తమైన సమయంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో #deletefacebook అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.

అలాంటి డిమాండ్‌కు శ్రీలంక లాంటి దేశంలో ఎన్నడూ మద్దతు ఉండబోదని హత్తోతువా చెప్పారు. సోషల్ మీడియా అనేది శ్రీలంక రాజకీయాలు, సమాజం డీఎన్‌ఏలో వేరుచేయలేని భాగమైపోయిందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)