ముఖంపై ముసుగు ధరించడం ఏయే దేశాల్లో నిషిద్ధం?

  • 1 మే 2019
నిఖాబ్ ధరించిన యువతి Image copyright Getty Images

బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ముసుగు ధరించడాన్ని శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. శ్రీలంకలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం వెల్లడించింది. తాజా నిబంధనలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి.

వ్యక్తి గుర్తింపును మరుగుపరిచేలా ధరించే ఎలాంటి ముసుగు లేదా వస్త్రాన్ని ముఖంపై ధరించరాదని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నవారు, ప్రజల రక్షణకు ఇది చాలా కీలకమని, శ్రీలంకలో మైనారిటీ మతస్థులు కూడా ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు, ఈ నిర్ణయం ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపేలా ఉందని, ముసుగు ధరించడం కొందరికి మతపరమైన అంశమని మితవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇలాంటి నిషేధాజ్ఞలు ప్రపంచంలో ఇంకా ఏయే దేశాల్లో ఉన్నాయి?

ఫ్రాన్స్

ముఖాన్ని పూర్తిగా కప్పేసే ఇస్లామిక్ ముసుగు ధరించడాన్ని బహిరంగ ప్రదేశాల్లో నిషేధించిన మొదటి యూరప్ దేశం ఫ్రాన్స్.

2011సంవత్సరంలో ఫ్రాన్స్ ఈ నిషేధం విధించింది.

2014 జూలైలో 'యూరప్ మానవ హక్కుల న్యాయస్థానం' కూడా ఈ నిషేధాన్ని సమర్థించింది.

డెన్మార్క్

2018 ఆగస్టు నెలలో ముఖంపై ముసుగు ధరించడాన్ని నిషేధిస్తూ డెన్మార్క్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిబంధన అమల్లోకి వచ్చాక, దేశంలో నిరసనలు చెలరేగాయి.

అప్పట్లో డెన్మార్క్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పేస్తూ ముసుగు ధరించినవారు ఇప్పటి డాలర్ ధర ప్రకారం 10వేల రూపాయలు చెల్లించాలి.

నిబంధనను ఉల్లంఘించి ముసుగు ధరించడం పునరావృతమైతే, అపరాధ రుసుమును పదింతలు చేస్తారు.

నెదర్లాండ్స్

2018 జూన్‌లో నెదర్లాండ్స్ కూడా ఇలాంటి నిషేధాన్ని అమలు చేసింది.

పాఠశాలలు, హాస్పిటల్స్, ప్రభుత్వ రవాణాలో ప్రయాణిస్తున్నపుడు ముఖం కనిపించకుండా ముసుగు ధరించడాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధించింది.

అయితే, బహిరంగ ప్రదేశాలకు ఈ నిబంధన వర్తించదు.

జర్మనీ

డ్రైవింగ్ చేస్తున్నపుడు ముఖానికి ముసుగు ధరించడం జర్మనీలో చట్టవిరుద్ధం.

న్యాయమూర్తులు, ప్రజా సేవకులు, సైనికులకు కూడా ఈ నిషేధాన్ని పాక్షికంగా వర్తింపచేయడాన్ని జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ ఆమోదించింది.

ముఖానికి ముసుగు ధరించే మహిళలు కూడా, తనిఖీలు లాంటి ఆనవాళ్ల ధృవీకరణ సందర్భాల్లో తమ ముసుగులను తీసేయక తప్పదు.

ఆస్ట్రియా

కోర్టులు, పాఠశాలలు లాంటి ప్రభుత్వ సంస్థలు, ప్రాంతాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పివేసే ముసుగు ధరించడంపై ఆస్ట్రియా విధించిన నిషేధం 2017 అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చింది.

మరెన్నో దేశాలు

బెల్జియంలో 2011 జూలైలో ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. పార్కులు, వీధుల్లో మనిషి ఆనవాళ్లను కనపడనీయకుండా ముసుగు ధరించడాన్ని బెల్జియం నిషేధించింది.

విద్యాసంస్థల్లో ముఖాన్ని దాచేలా ముసుగు ధరించడాన్ని 2018 జూన్‌లో నార్వే నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ముసుగు ధరించడాన్ని 2016లో బల్గేరియా పార్లమెంట్ ఆమోదించింది. మహిళలు అలాంటి ముసుగు ధరిస్తే, వారికి అపరాధ రుసుము విధించడంతోపాటు, ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను రద్దు చేయాలని కూడా చట్టం చేశారు.

హాస్పిటల్స్, న్యాయస్థానాలు, ప్రభుత్వ సంస్థల్లో ముసుగు ధరించడంపై లక్సంబర్గ్‌ కూడా కొన్ని నిబంధనలు విధించింది.

మరికొన్ని యూరోపియన్ దేశాలు, ప్రత్యేకించి కొన్ని నగరాలు, ప్రాంతాలకు మాత్రమే ఈ నిబంధనలను పరిమితం చేశాయి. ఉదాహరణకు ఇటలీలోని నోవారా నగరంలో 2010 సంవత్సరం నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది. ఆ ప్రాంతంలో, అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేక వైఖరి ఉన్న 'నార్తర్న్ లీగ్' పార్టీ అధికారంలో ఉంది.

స్పెయిన్‌లోని బార్సెలోనా నగరంలో కూడా, మున్సిపల్ కార్యాలయాలు, బహిరంగ మార్కెట్‌లు, లైబ్రరీలు లాంటి ప్రాంతాల్లో 2010 సంవత్సరం నుంచి ముసుగు ధరించడంపై నిషేధం ఉంది.

స్విట్జర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన ఉంది.

Image copyright Getty Images

ఆఫ్రికా

2015లో ముఖానికి ముసుగు ధరించిన కొందరు మహిళలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘటనలతో, ఛాద్, గబోన్, కేమరూన్ ఉత్తర ప్రాంతం, నైజీరియాలోని డిఫా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలలో.. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి ముసుగు ధరించడంపై నిషేధం విధించారు.

విధి నిర్వహణలో ముఖానికి ముసుగు ధరించకూడదంటూ ప్రభుత్వ అధికారులపై అల్జీరియా ప్రభుత్వం 2018 అక్టోబర్ నుంచి, నిషేధం విధించింది.

చైనా

ముఖానికి ముసుగు ధరించడం, పొడవుగా గెడ్డం పెంచడంపై చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో నిషేధం ఉంది.

ఈ ప్రాంతంలో వీగర్ ముస్లిం తెగ ప్రజలు ఉంటారు. తాము వివక్షకు గురవుతున్నామని వీరి వాదన. ఈ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలకు, ఇస్లామిస్ట్ మిలిటెంట్లే కారణమని ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’

‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ

టీకాలు ఎలా పనిచేస్తాయి.. టీకాల విజయం ఏమిటి.. టీకాలపై కొందరిలో సంశయం ఎందుకు

సుజనా చౌదరి మీద ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఏమిటి

14 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్తున్నారు

పాకిస్తాన్‌ జైళ్లలో మత్స్యకారులు: 'ఎదురుచూపులతోనే ఏడు నెలలు .. వస్తారో రారో తెలియదు'

గుజరాత్ లాకప్‌డెత్ కేసులో ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు

వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు