నీలి రంగును వదిలించుకుంటున్న ఫేస్‌బుక్, గోప్యతకు ప్రథమ ప్రాధాన్యం అంటున్న జుకర్‌బర్గ్

  • 1 మే 2019
ఫేస్‌బుక్‌ Image copyright Getty Images

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనేక మార్పులకు సిద్ధమవుతోంది. ఈ సామాజిక అనుసంధాన వేదికకు డిజైనర్లు కొత్త రూపును ఇస్తున్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ మార్పులు చేస్తున్నారు.

ఆరంభం నుంచి ఉన్న నీలి రంగు డిజైన్‌కూ సంస్థ వీడ్కోలు పలుకుతోంది.

ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సహా వివిధ వేదికల్లోనూ అనేక మార్పులు రానున్నాయి.

ఫేస్‌బుక్ డెవలపర్ల సదస్సులో సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'గోప్యతకు ప్రథమ ప్రాధాన్యం' ఇచ్చేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందని, సంస్థ పనితీరులో ఇదో పెద్ద మార్పు అని ఆయన తెలిపారు.

వినియోగదారుల సమాచార భద్రత విషయంలో సంస్థపై వస్తున్న విమర్శలకు స్పందనగా కొన్ని కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులను జుకర్‌బర్గ్ ప్రకటించారు.

Image copyright FACEBOOK
చిత్రం శీర్షిక వాట్సాప్ నగదు చెల్లింపు సేవలు

మార్పులు ఇవే..

  • మెసెంజర్ యాప్‌లో పంపే సందేశాలు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ కానున్నాయి. సందేశాల్లో ఏముందో తెలుసుకోవడం ఫేస్‌బుక్‌కు కూడా సాధ్యం కాదు. వాట్సాప్‌ యాప్‌తో మెసెంజర్‌ను పూర్తిగా అనుసంధానం చేయనున్నారు.
  • 'ప్రైవేట్ లైక్ కౌంట్' ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ పరీక్షిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఒక పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు వచ్చాయన్నది అది పోస్ట్ చేసినవారికి మాత్రమే కనిపిస్తుంది.
  • సందేశాల్లో పంపే కంటెంట్‌ను కొంత సమయం మాత్రమే అందుబాటులో ఉంచే విధానాలను తీసుకురానున్నారు. అంటే నిర్ణీత సమయం తర్వాత ఆ కంటెంట్ ఎవరికీ కనిపించదు.
  • వాట్సాప్ వేదికగా భారత్‌లో అందిస్తున్న నగదు చెల్లింపుల సేవలను ఈ ఏడాది చివర్లో మిగతా దేశాలకూ విస్తరించనున్నారు.
  • న్యూస్‌ఫీడ్‌కు కమ్యూనిటీ గ్రూప్స్‌ను ప్రధానంగా చేస్తూ ఫేస్‌బుక్ యాప్‌ను రీడిజైన్ చేయనున్నారు. ఫేస్‌బుక్ నీలి రంగు లుక్‌ను మారుస్తున్నారు. ఇప్పటికే దీన్ని అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. ఆ తర్వాత దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తారు.
  • ఫొటో, వీడియో లేకుండా కేవలం టెక్స్ట్, స్టిక్కర్లు, డ్రాయింగ్‌లతోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెట్టొచ్చు. కెమెరాలో 'క్రియేట్' అనే కొత్త ఆప్షన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.
Image copyright FACEBOOK

భవిష్యత్తు అంతా గోప్యతదే

వినియోగదారుల సమాచార గోప్యతను కాపాడే విషయంలో ప్రస్తుతం ఫేస్‌బుక్‌కు అంత మంచి పేరు లేదని జుకర్‌బర్గ్ అంగీకరించారు.

అయితే, భవిష్యత్తు అంతా గోప్యతదేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో అంతా చిన్న గ్రూపులు, కమ్యూనిటీల్లో మాట్లాడుకునేందుకే ఆసక్తి చూపిస్తారని చెప్పారు.

''ఒక్క రాత్రిలో అంతా జరిగిపోదు. నిజం చెప్పాలంటే, ఈ ప్రశ్నలన్నింటికీ మన దగ్గర సమాధానాలు లేవు'' అని ఆయన అన్నారు.

సీక్రెట్ క్రష్

'ఫేస్‌బుక్ డేటింగ్'లో భాగంగా తీసుకువచ్చే 'సీక్రెట్ క్రష్' అనే కొత్త ఫీచర్‌ను సంస్థ ప్రకటించింది.

తనకు నచ్చిన తొమ్మిది మందిని సీక్రెట్ క్రష్‌ జాబితాగా యూజర్ ఎంచుకోవచ్చు. ఆ జాబితాలో ఉన్నవారు ఎంచుకున్న తొమ్మిది మందిలో ఒకవేళ ఈ యూజర్ కూడా ఉంటే.. అప్పుడు ఒకరి పట్ల మరొకరికి ఆసక్తి ఉన్నట్లు తెలుపుతూ ఆ ఇద్దరికీ సందేశం వస్తుంది.

ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్ సహా 14 దేశాల్లో ఫేస్‌బుక్ డేటింగ్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుతం యూరోప్, యూఎస్‌లలో అందుబాటులో లేదు.

కంప్యూటర్, ఫోన్, గేమింగ్ కన్సోల్‌లతో కనెక్ట్ అవ్వకుండా విడిగానే పనిచేసే ఆక్యులస్ క్వెస్ట్ అనే వీఆర్ హెడ్‌సెట్‌ను మే 21 నుంచి విక్రయించనున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా