థాయ్ కింగ్ పెళ్ళి: బాడీగార్డుతో ప్రేమ వివాహం

  • 2 మే 2019
థాయి రాజు పెళ్ళి Image copyright EUROPEAN PHOTOPRESS AGENCY
చిత్రం శీర్షిక పెళ్ళి సంప్రదాయంలో భాగంగా రాణి సుతిద తల మీద పవిత్ర జలాన్ని చల్లుతున్న థాయ్ రాజు

థాయిలాండ్ రాజు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది డిప్యూటీ హెడ్‌ను పెళ్ళి చేసుకున్నారని, ఆమెకు రాణి హోదాను ప్రకటించారని రాచకుటుంబం అధికారికంగా ప్రకటించింది.

పట్టాభిషేక వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా అంతకుముందే ఈ ప్రకటన వెలువడింది.

66 ఏళ్ళ రాజా మహా వజీరాలోంగ్‌కోర్న్‌కు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. 2016లో తండ్రి చనిపోవడంతో రాజ్యాధికారం పూర్తిగా ఆయన చేతికి వచ్చింది.

ఆయన ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మూడుసార్లు విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఏడుగురు పిల్లలు.

రాచకుటుంబ ప్రకటన: రాజు వజీరాలోంగ్‌కోర్న్‌ 'జనరల్ సుతిదా వజీరాలోంగ్‌కోర్న్ న ఆయుధకు రాణి సుతిద హోదా కల్పించడానికి నిర్ణయించారు. ఆమె రాజకుటుంబంలో ఒకరుగా రాణిగా ఉంటారు.'

రాణి సుతిదా చాలా కాలంగా కింగ్ వజీరాలోంగ్‌కోర్న్ భాగస్వామిగా ఉన్నారు. వారి బంధం గురించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకపోయినప్పటికీ బహిరంగ సభల్లోనూ ఆయనతో కలిసి చాలాసార్లు కనిపించారు.

Image copyright Reuters

థాయ్ రాజు పెళ్ళి వేడుకలను అక్కడి టీవీ చానల్స్ బుధవారం నాడు ప్రసారం చేశాయి. రాజ భవనంలోని ఇతర ప్రముఖులు, రాజకీయ సలహాదారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

రాణి సుతిద తల మీద రాజు ‘పవిత్ర జలాల’ను చల్లారు. ఆ తరువాత వారిద్దరూ పెళ్ళి రిజిస్ట్రీలో సంతకాలు చేశారు.

థాయి ఎయిర్వేస్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసిన సుతిదా తిడ్జాయిని కింగ్ వజీరాలోంగ్‌కోర్న్ 2014లో తన బాడీగార్డ్ విభాగంలో డిప్యూటీ కమాండర్‌గా నియమించారు. అమెకు 2016లో పూర్తి స్థాయి ఆర్మీ జనరల్‌ హోదాను కట్టబెట్టారు.

వజీరాలోంగ్‌కోర్న్‌కు పూర్వం ఉన్న రాజు భూమిబోల్ అదుల్యతేజ్ థాయిలాండ్‌ను 70 ఏళ్ళు పాలించి 2016లో చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం ఒక దేశాన్ని పాలించిన రాజుగా ఆయన చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)