ఈ తిమింగలం రష్యా గూఢచారా

  • 3 మే 2019
తెల్ల తిమింగలం Image copyright EPA
చిత్రం శీర్షిక పట్టీతో ఉన్న తెల్ల తిమింగలం

ఒక తిమింగలం ద్వారా నిఘా సమాచారం సేకరించడం సాధ్యమేనా?

నార్వే తీరానికి వచ్చిన ఒక తెల్ల తిమింగలాన్ని చూసి, అది రష్యా గూఢచారి అయ్యుంటుందని ఆ దేశ నిపుణులు భావిస్తున్నారు.

దాని శరీరంపై ప్రత్యేకంగా వారికి ఒక పట్టీ కనిపించింది. తిమింగలానికి రష్యా నావికా దళం స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటుందని నార్వే నిపుణులు చెబుతున్నారు.

సముద్ర జీవుల నిపుణులు, ప్రొఫెసర్ అయిన ఆదున్ రికర్డ్‌సన్ "తిమింగలం శరీరంపై వేసిన ఆ పట్టీ ఒక గోప్రో కెమెరా హోల్డర్. దానిపై సెయింట్ పీటర్స్‌బర్గ్ గురించి సూచించే ఒక లేబుల్ అతికించి ఉంది" అని చెప్పారు.

నార్వేలో ఒక మత్స్యకారుడు చాలా కష్టపడి తిమింగలం శరీరంపైనున్న ఆ పట్టీని తీయగలిగాడు.

"ఇది రష్యా శాస్త్రవేత్తలు ఉపయోగించే కిట్‌లా లేదని" తన స్నేహితుడైన ఒక రష్యా శాస్త్రవేత్త చెప్పినట్టు రికర్డ్‌సన్ అన్నారు.

తిమింగలం కనిపించిన అదే ప్రాంతంలో రష్యా నావికాదళానికి చెందిన ఒక స్థావరం కూడా ఉంది.

Image copyright EPA

తిమింగలం శరీరంపై కెమెరా హోల్డర్

అర్కిటిక్ ద్వీపం ఇంగోయాలో ఈ తిమింగలం చాలాసార్లు నార్వే పడవలకు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు.

ఇక్కడికి 415 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్మనస్క్‌లో రష్యా ఉత్తర దళం స్థావరం ఉంది. తెల్ల తిమింగలాలు అర్కిటిక్ నీళ్లలోనే కనిపిస్తుంటాయి.

నార్వే ఛానల్ ఎన్ఆర్‌కే ఒక వీడియో విడుదల చేసింది. అందులో తెల్ల తిమింగలం శరీరంపై ఒక పట్టీని తొలగిస్తుంటూ ఉంటారు.

ప్రొఫెసర్ రికర్డ్‌సన్ బీబీసీతో ఈ పట్టీని తిమింగలం శరీరం ముందు భాగంలో చాలా గట్టిగా కట్టారు. అంటే అందులో గోప్రో కెమెరా హోల్డర్ ఉండుండచ్చు. కానీ కెమెరా లేదు" అని తెలిపారు.

ఆయన "ఒక రష్యా ఫ్రెండ్ తమ దగ్గర అలాంటి ప్రయోగాలు చేయరని చెప్పాడు. కానీ రష్యా నావికాదళం కొన్ని తెల్ల తిమింగలాలకు కొన్నేళ్లపాటు ట్రైనింగ్ ఇచ్చిందన్నాడు. ఇది దానికి సంబంధించినదై ఉండచ్చు" అన్నారు.

Image copyright Getty Images

యుద్ధాల్లో డాల్ఫిన్ల ఉపయోగం

ఇంతకు ముందు సైన్యం కోసం సముద్ర జీవులను ఉపయోగించిన ఒక రష్యా రిజర్వ్ కల్నల్, నార్వే వాదనల గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఈ తిమింగలం రష్యా నావికాదళ స్థావరం నుంచి వచ్చుండచ్చు అనే విషయాన్ని తోసిపుచ్చలేదు.

రష్యా చానల్ గోవోరిత్ మోస్కావాతో మాట్లాడిన కల్నల్ విక్టర్ బెరెంట్స్ "ఒక వేళ మేం ఈ తిమింగలంతో నిఘా పెట్టడం నిజమే అయితే, దానిపైన ఈ నంబరుకు ఫోన్ చేయండి అని అలా స్టిక్కర్ అతికించి వదులుతామా" అన్నారు.

"మా సైన్యం యుద్ధానికి సంబంధించిన పనుల కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది నిజమే. దానిని మేం దాచడం లేదు".

"క్రాయిమియాలో మా మిలిటరీ డాల్ఫిన్స్ కేంద్రం ఉంది. అక్కడ మేం వాటికి రకరకాల పనుల కోసం ట్రైనింగ్ ఇస్తుంటాం. వాటిలో సముద్ర ఉపరితల విశ్లేషణ నుంచి ఒక పరిధిలోని జలాల రక్షణ, విదేశీ డైవర్లను గుర్తించడం, విదేశీ నౌకల కింద పేలుడు పదార్థాలు పెట్టడం లాంటి పనులుంటాయి" అని విక్టర్ చెప్పారు.

క్రాయిమియాలో ఉన్న డాల్ఫిన్ ట్రైనింగ్ సెంటర్ మొదట్లో ఉక్రెయిన్‌ నియంత్రణలో ఉండేది. కానీ 2014లో రష్యా నావికాదళం దానిని తమ అధీనంలోకి తెచ్చుకుంది.

యూనివర్సిటీ ఆఫ్ ట్రోమ్సో ప్రొఫెసర్ రికర్డ్స్‌సన్ "తెల్ల తిమింగలం కూడా డాల్ఫిన్ లాగే చాలా తెలివైనది. దానికి ఒక కుక్కలా ట్రైనింగ్ ఇస్తారు అన్నారు.

"ఆ తిమింగలం రెండుమూడు రోజుల్లో పడవల దగ్గరకు చాలాసార్లు వచ్చింది. అది ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. దాని నోరు కూడా తెరిచుంది" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక డాల్ఫిన్

అమెరికా నావికా దళం డాల్ఫిన్స్

అయినా యుద్ధాల్లో సముద్ర జీవులను ఇంతకు ముందు కూడా ఉపయోగించేవారు.

కోల్డ్‌వార్ సమయంలో అమెరికా నావికా దళం కాలిఫోర్నియాలో డాల్ఫిన్లు, సీ లయన్స్‌కు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించింది.

అందులో సముద్ర జీవులకు పేలుడు పదార్థాలు, ఇతర ప్రమాదకరమైన పదార్థాలను గుర్తించేలా ట్రైనింగ్ ఇచ్చారు.

జలాల అడుగున అక్రమంగా ప్రవేశించేవారి గురించి తెలుసుకోడానికి కూడా ఈ జీవులను ఉపయోగిస్తారని నావికాదళం వెబ్‌సైట్ చెబుతోంది.

2003లో జరిగిన ఇరాక్ యుద్ధంలో కూడా అమెరికా సైన్యంలో పేలుడు పదార్థాలను గుర్తించే నిఘా పెట్టే ఒక టీమ్ డాల్ఫిన్ల సాయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)