సోషల్ మీడియాలో యువతులకు వలవేసి.. ఇండియాకు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు..

  • 4 మే 2019
నేపాల్ యువతుల అక్రమ రవాణా
చిత్రం శీర్షిక విదేశాల్లో ఉద్యోగం ఆశ చూపి యువతులు దిల్లీ తీసుకువచ్చి అమ్మేస్తున్నారు

ఆ భవనంలో యువతుల నవ్వులు, పాటలు.. బయటి ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, హారన్ల మోతల్లో కలగలిసి మార్మోగుతున్నాయి.

గోడలకు నారింజ, గులాబీ రంగు పరదాలు వేలాడుతున్నాయి. అక్కడ నివసించే వారికి ఇది కొంత హాయినిస్తున్నట్లు కనిపిస్తోంది.

కఠ్మాండూలోని ఒక మహిళా సంరక్షణ గృహమిది. అక్రమ రవాణా బారినపడి బలవంతపు వ్యభిచారకూపంలో కూరుకుపోయిన మహిళలు ఇప్పుడు సాధారణ జీవితాలకు తిరిగి రావటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారికి ఇక్కడ మద్దతు అందిస్తున్నారు.

నేపాల్‌లో 2015 నాటి భూకంపం తర్వాత మహిళల అక్రమ రవాణా అమాంతం పెరిగిపోయిందని, సోషల్ మీడియా వల్ల అక్రమ రవాణాదారుల దందా మరింత సులభంగా మారిందని బీబీసీ ప్రతినిధి విక్కీ స్ప్రాట్ గుర్తించారు.

అక్కడి పరిస్థితులు ఆయన మాటల్లోనే..

చాందిని వయసు 35 సంవత్సరాలు. ఆమెను కలవటానికి నేను ఇక్కడికి వచ్చాను.

ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రాఫికింగ్ నుంచి కాపాడిన బాలికలకు శక్తి సమూహ సంరక్షణ గృహంలో చదువు నేర్పిస్తున్నారు

ఏడాది కిందట ఆమెకు ఫేస్‌బుక్‌లో ఒక అపరిచితుడు తారసపడ్డాడు. అతడు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఆమె అంగీకరించారు. అతడు ఆమెకు నేరుగా సందేశాలు పంపించాడు. ఆమె స్పందించారు. ఇద్దరూ ఆన్‌లైన్‌లో ప్రైవేట్ మెసేజ్‌లు పంపించుకోవటం మొదలుపెట్టారు. కానీ ఆ అపరిచితుడు ట్రాఫికర్ల ఏజెంట్‌గా తేలాడు.

చాందినీ కోసం నిరీక్షిస్తూ కిటికీ నుంచి బయటకు చూస్తున్నాను. వర్షపు నీటిలో పసుపురంగు ధూళి కలిసిపోయి సుడులు తిరుగుతోంది. హిమాలయాలు మేఘాల వెనుక దాగున్నాయి. మంచు తెర వాటిని కప్పేసింది.

ఆ ధూళి నిర్మాణ పనుల్లో బయటకు వస్తోందని చెప్పారు సుజాత. ఆమె నాకు అనువాదకురాలిగా సాయం చేస్తున్నారు.

''ఈ నగరాన్ని పునర్నిర్మిస్తున్నారు'' అని ఆమె వివరించారు. 2015 భూకంపంలో కఠ్మాండూ నగరం చాలా వరకూ ధ్వంసమయింది.

ప్రకృతి విపత్తులు నిర్మాణ రంగానికి, మనుషులను అక్రమ రవాణా చేసే వారికి చాలా లాభదాయకంగా ఉన్నట్లు తేలింది.

Image copyright Getty Images

ఇక్కడ కార్మికుల అక్రమ రవాణాలో ఆధునిక బానిస వ్యాపారం ఇప్పటికే సుసంపన్నమవుతోంది. భూకంపం వల్ల ఇక్కడి ప్రజలు మరింత బలహీనపడ్డు. తమ కుటుంబాలకు దూరమయ్యారు. పని కోసం దేవులాడుతున్నారు.

భారత సరిహద్దు భద్రతా దళం అంచనా ప్రకారం.. ట్రాఫికింగ్ బాధితుల సంఖ్య అమాంతంగా 500 శాతం పెరిగింది.

1990ల్లో తనను కూడా అక్రమ రవాణా చేశారని చరిమయా తమాంగ్ చెప్పారు. ఈ సంరక్షణ గృహం నిర్వహణలో ఆమె సాయం చేస్తున్నారు.

''నాకు మత్తుమందు ఇచ్చి అపహరించుకెళ్లారు. ఇండియాలో ఒక వేశ్యాగృహానికి తీసుకెళ్లారు'' అని ఆమె వెల్లడించారు.

''ఇప్పుడు ఈ వ్యాపారానికి టెక్నాలజీ కొత్త రక్తం ఎక్కించింది'' అని చెప్పారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక అనుమానిత ట్రాఫికింగ్ బాధితులను పోలీసులు విచారిస్తారు

''ఈ ట్రాఫికింగ్ ఏజెంట్లకు సోషల్ మీడియా చాలా సాయపడుతోంది. ఇప్పుడు ఆడపిల్లలను వెదకటానికి వాళ్లు మారుమూల గ్రామాలకు వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆడపిల్లలను ఎంచుకుని వారికి ఒక క్లిక్‌తో మెసేజ్ పంపించ వచ్చు'' అని వివరించారు.

ఇంటి తలుపు తెరుచుకుని చాందిని వచ్చారు. నన్ను ఆలింగనం చేసుకుని పలకరించారు. ఆమె కథ ఒక చెప్పారు.

''ఫేస్‌బుక్‌లో నా అక్కతో ఒక వ్యక్తి చాట్ చేస్తుండే వాడు. అతడు నన్ను ఫ్రెండ్‌గా యాడ్ చేశాడు. నాకు మెసేజ్‌లు పంపటం మొదలుపెట్టాడు'' అని వివరించారు.

''నాకు ఇరాక్‌లో మంచి జీతం ఉండే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. నేను అతడిని ఎప్పుడూ కలవలేదు. కానీ ఒక రోజు నాకు వీసా, పాస్‌పోర్ట్ అందించటానికి ఒక వ్యక్తిని పంపించాడు'' అని తెలిపారు చాందిని.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఖట్మాండు నుంచి బయలుదేరే బస్సుల్లో ట్రాఫికింగ్ బాధుతులు ఉన్నారేమోనని వలంటీర్లు తనిఖీ చేస్తుంటారు

భూకంపంలో చాందిని కుటుంబం ఇల్లు కోల్పోయింది. ఈ ట్రాఫికర్ ఆమెకు మెసేజ్ పంపించినపుడు ఆమె ఒక తాత్కాలిక షెల్టర్‌లో నివసిస్తున్నారు. అతడు అప్పటికే ఆమె అక్కతో కొన్ని నెలలుగా మాట్లాడుతున్నాడు. అంటే వాస్తవానికి ఇద్దరితోనూ చనువు పెంచుకుంటున్నాడు. భూకంపం సృష్టించిన ఉత్పాతంలో అతడు అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు.

చాందినికి పాస్‌పోర్ట్ అందించిన తర్వాత ఇరాక్‌లో ఆమె కోసం ఓ హౌస్‌కీపర్ (ఇంట్లో పనిమనిషిగా) ఉద్యోగం సిద్ధంగా ఉందని చెప్పాడతడు. ఆమెను దిల్లీ వరకూ తీసుకెళ్లడానికి తన సోదరుడు అంటూ ఒక వ్యక్తిని ఏర్పాటు చేశాడు.

అలా చాందినిని దిల్లీకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక ముందుగా హామీ ఇచ్చినట్లు ఆమెను ఇరాక్ విమానం ఎక్కించలేదు. ఒక హోటల్ గదిలో ఉంచి తాళం వేశారు. ఆ గదిలో మరో 18 మంది యువతులు కూడా ఉన్నారు. అలా కొన్ని వారాల పాటు హోటల్‌లోనే బందీలుగా ఉన్నారు.

చిత్రం శీర్షిక నేపాల్‌లో 30 ఏళ్ల లోపు యువతులు సంక్షకుడు లేదా భర్త అనుమతి లేకుండా విదేశాలకు వలస వెళ్లటానికి వీలు లేదని చట్టం కూడా చేశారు

ఇంకా వివరంగా చెప్పాలని అడిగినపుడు చాందిని చూపు తిప్పేసుకున్నారు.

ఆ గదిలో ఉంచి తాళం వేసినపుడు ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను అడిగిన ఈ ప్రశ్నకు ఆమె కళ్లలో నీళ్లు తిరగటం కనిపించింది.

''నన్ను అమ్మేస్తారని నాకు అర్థమైపోయింది'' అని ఆమె చెప్పారు. ఎందుకంటే యువతుల అక్రమ రవాణా గురించిన కథలు నేపాల్ అంతటా ఉన్నాయి. ''ఇలా మీకు జరగకుండా జాగ్రత్తగా ఉండాల''న్న హెచ్చరికలు చిన్నప్పటి నుంచీ వింటూనే నేపాల్ మహిళలు పెరుగుతారు.

ఈ ప్రమాదం ఉందని ఆమెకు తెలుసు. కానీ తన కుటుంబాన్ని గట్టెక్కించాలన్న ఆశతో ఆమె సాహసించి వచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వ్యభిచార వృత్తి చేయటానికి నిరాకరించిన నేపాల్ యువతులను అనేక రకాలుగా హింసించి బలవంతంగా చేయిస్తున్నారు

పని కోసం, ఉపాధి కోసం, ఉద్యోగం కోసం దేశం వదిలి వెళ్లటం నేపాల్‌లో అసాధారణమైన విషయమేమీ కాదు. కానీ.. కొత్త జీవితం, ఆర్థిక స్వేచ్ఛ కోసం అడుగులు వేసే యువతులకు ఆ ప్రయాణం ప్రమాదకరంగా మారగలదు.

నిజానికి ఇది ఎంత ప్రమాదకరమంటే.. నేపాల్‌లో 30 ఏళ్ల లోపు వయసున్న యువతులు కానీ మహిళలు కానీ తమ సంరక్షకుడు లేదా భర్త అనుమతి లేకుండా వలస వెళ్లటానికి సాంకేతికంగా వీలు లేదని ఒక వివాదాస్పద చట్టం నిర్దేశిస్తోంది.

నేపాల్ గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది యువతుల్లాగానే చాందిని కూడా మెరుగైన జీవితం గడిపే అవకాశాలు లేక చాలా కాలం నిస్పృహలో గడిపారు. చివరికి ఆమె పరిస్థితిని అవకాశంగా తీసుకుని ట్రాఫికింగ్ ఏజెంట్ వల విసిరాడు.

''నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ పొలంలో పని చేస్తారు. అది చాలా కష్టం. నాకు ఇష్టం ఉండదు. అవసరమైనంత డబ్బూ రాదు'' అని ఆమె చెప్పారు.

Image copyright Getty Images

అలాగని పెళ్లి చేసుకోవాలని కూడా ఆమెకు లేదు. ''చాలా మంది యువతులు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్లు నాకు కనిపించలేదు. కానీ చాలా మంది మగవాళ్లు మోసం చేయటం నేను చూశాను'' అంటారామె.

ఆమె మాటలను అనువాదం చేసి చెప్తూ సుజాత నవ్వారు. నేను కూడా కన్నీళ్లు ఆపుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నవ్వకుండా ఉండలేకపోయాను.

జీవితంలో ముందుకు వెళ్లటానికి తనకు ఒక పురుషుడు అవసరం అన్న ఆలోచన తనకు రోతపుట్టిస్తుందని చాందిని అంటారు.

నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు.. ఆమె చుట్టూ చూసి నాతో ఇలా దృఢంగా చెప్పారు.

''నాకు మంచి ఆదాయం వస్తే ఎక్కడికైనా వెళ్తాను. విదేశాలకు వెళ్లటానికి నేను మళ్లీ ప్రయత్నిస్తాను.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)