మూడు కళ్ల పామును ఎప్పుడైనా చూశారా?

  • 5 మే 2019
మూడు కళ్ల పాము Image copyright NT PARKS AND WILDLIFE
చిత్రం శీర్షిక గుర్తించిన కొన్ని వారాల్లోనే ఈ మూడు కళ్ల పాము మరణించింది.

ఆస్ట్రేలియాలోని ఓ హైవే పక్కన మూడు కళ్లున్న ఓ పామును వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు.

"ఇది ఓ అసాధారణమైన పాము ఫొటో" అంటూ 'నార్తర్న్ టెర్రిటరీ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్' దీని ఫొటోలను విడుదల చేసింది.

'మాంటీ పైథాన్‌'గా పిలుస్తున్న ఈ పామును మార్చిలో తొలిసారి గుర్తించారు. కానీ కొన్నివారాల్లోనే అది చనిపోయింది.

తల పైభాగంలో ఉన్న మూడో కన్ను సహజసిద్ధంగా ఉన్నట్లే ఉందని నిపుణులు అంటున్నారు.

డార్విన్ నగరానికి 40 కి.మీ. దూరంలో ఉన్న హంప్టీ డూ పట్టణ సమీపంలో అధికారులు దీన్ని గుర్తించారు. 40 సెం.మీ. (15 అంగుళాలు) పొడవున్న ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను కారణంగా ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడిందని అధికారులు బీబీసీతో అన్నారు.

Image copyright NT PARKS AND WILDLIFE
చిత్రం శీర్షిక మూడుకళ్ల పాము తనకున్న ఈ అసాధారణ జన్యు పరివర్తనం కారణంగా ఆహరం తినడంలో చాలా ఇబ్బంది పడింది.

అయితే, ఈ పాముకు రెండు తలలు లేవని ఎక్స్-రేలో స్పష్టమైందని వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు.

"చూడటానికి ఒకే తల (పుర్రె)లా ఉంది. కానీ అదనంగా ఓ కంటి కుహరం ఉంది. దీనివల్లే ఈ పాముకు మూడు కళ్లు వచ్చాయి" అని వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

పరిణామక్రమంలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకోవడం సాధారణ విషయం అని పాములపై పరిశోధన చేసిన క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ ఫ్రై తెలిపారు.

"ప్రతి జీవిలో ఏదో ఒక పరివర్తనం జరుగుతుంది. అయితే ఈ పాములో అది కొద్దిగా అసహజంగా జరిగింది. ఇంతకు ముందెప్పుడూ నేను మూడు కళ్లున్న పామును చూళ్లేదు. కానీ మా ల్యాబ్‌లో రెండు తలల పాము ఉంది. ఇది మనం చెప్పుకునే సయామీ కవలల విషయంలో జరిగిన జన్యుమార్పుల వంటి వాటివల్ల జరిగినదే" అని ప్రొఫెసర్ ఫ్రై అన్నారు.

బహుశా ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను పూర్తిగా తయారు కాని దాని కవల పాముకు చెందినది కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionరెండు తలల పామును చూశారా

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)