చైనాతో స్నేహానికి పాక్ చెల్లిస్తున్న మూల్యం అమాయకపు అమ్మాయిలేనా

  • 6 మే 2019
పాక్ అమ్మాయులు Image copyright AFP

ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇటీవల ఒక నివేదిక ప్రచురించాయి. ఇందులో పాకిస్తానీ యువతులను పెళ్లి పేరుతో చైనా తీసుకెళ్తున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ నివేదికలో ఆసియాలోని మరో ఐదు దేశాల్లో జరుగుతున్నట్టే పాకిస్తాన్‌లో కూడా మానవ అక్రమ రవాణా వెలుగుచూసింది.

దీనిపై పాకిస్తాన్‌ మానవహక్కుల కార్యకర్తలు "గత ఏడాది నుంచి చైనా యువకులు పెళ్లి చేసుకోడానికి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి వస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలతో చైనా వెళ్తున్నారు. కానీ, వారు వైవాహిక జీవితం కోసం అలా చేయడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచారం చేయించడానికి దీనిని ఒక ప్రధాన మార్గంగా మార్చుకుంటున్నారు" అని చెప్పారు.

ఈ వార్తల వెనుక అసలు నిజం తెలుసుకోడానికి బీబీసీ.. చైనా అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఒక ఫైసలాబాద్‌ యువతితో మాట్లాడింది. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే..

"నేను ఫైసబాలాద్‌లో ఉంటాను. నా వయసు 19 ఏళ్లు. గత ఏడాది నవంబర్‌లో మేం మా కజిన్ పెళ్లి కోసం వెళ్లాం. మా కజిన్ ఒక చైనా యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె చైనాలోనే ఉంది. అక్కడే నన్ను కూడా ఇష్టపడ్డారు. అక్కడి నుంచే మా వాళ్ల ఫోన్ నంబర్ తీసుకున్నారు. కాల్ చేసి మా ఇంటికి వచ్చారు. నన్ను ముగ్గురు అబ్బాయిలు చూడ్డానికి వచ్చారు".

"మా ఇంట్లో వాళ్లు మొదట అబ్బాయిలను మీరు క్రిస్టియన్సా అని అడిగారు. వాళ్లు మేం క్రిస్టియన్సే, ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని మాకు చెప్పారు. మాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు. మా ఇంటికి వచ్చిన తర్వాత రోజే నన్ను మెడికల్ టెస్ట్ కోసం లాహోర్ పంపించారు. టెస్ట్ అయిన రెండు రోజుల తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అన్నారు. ఇంట్లో వాళ్లు మాకు అంత త్వరగా పెళ్లి చేయాలని లేదు అన్నారు".

కానీ చైనా అబ్బాయిలతో వచ్చిన పాకిస్తాన్ ప్రతినిధులు "ఏది జరిగినా ఈ నెలలోనే జరగాలి, లేదంటే వచ్చే నెల వాళ్లు తిరిగి చైనా వెళ్లిపోవాలి. తర్వాత వాళ్లు తిరిగి రారు, మీరు పెళ్లి చేయాలంటే, ఇప్పుడే చేసుకోండి" అన్నారు. వాళ్లు మాతో మేం మీ మొత్తం ఖర్చులంతా మేమే భరిస్తామని కూడా చెప్పారు.

"మా ఇంట్లో వాళ్లు మాకొద్దు అని చెప్పారు. దాంతో వాళ్లు పాకిస్తానీ సంప్రదాయం ప్రకారం అమ్మాయికి అబ్బాయి ఇంటి వాళ్లు బట్టల కోసం డబ్బు ఇచ్చినట్టే అనుకోండి అన్నారు. తర్వాత మా బంధువులు అందరూ చెప్పడంతో మా ఇంట్లో వాళ్లు నా పెళ్లికి సరే అన్నారు. చైనా అబ్బాయితో నా పెళ్లి చేశారు".

Image copyright Getty Images

ఎక్కువ మంది బాధితులు వారే

నా ప్రయాణానికి అన్ని పేపర్లూ పూర్తయ్యేవరకూ వాళ్లు నన్ను ఏడుగురు అబ్బాయిలు, అమ్మాయిలతోపాటు ఒక ఇంట్లో ఉంచారు. వాళ్లు లాహోర్‌లోని డివైన్ రోడ్‌లో ఒక ఇల్లు తీసుకున్నారు. మొత్తం మూడు ఇళ్లున్నాయి. అక్కడంతా చైనా వాళ్లే ఉండేవారు. వారిలో చివరి పెళ్లి నాదే. మిగతా ఏడుగురికీ నాకంటే ముందే పెళ్లయిపోయింది. అబ్బాయిలంతా క్రిస్టియన్స్.

నేను నా భర్తతో గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా మాట్లాడేదాన్ని. అప్పుడప్పుడూ అది తప్పుగా చూపించేది. మాకు ఒక టీచర్‌ను కూడా పెట్టారు. మా అమ్మాయిలందరికీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ( చైనీస్ భాష నేర్చుకోడానికి) క్లాసులు తీసుకునేవారు.

చైనా వాళ్లతోపాటూ ఉన్న పాకిస్తాన్ ప్రతినిధి చాలా కటువుగా ఉండేవాడు.(అమ్మాయిల బాధ్యత అతడికే అప్పగించారు) అతడు అమ్మాయిలతో నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. అమ్మాయిల్లో ఎవరైనా నన్ను తిరిగి ఇంటికి పంపించండి అని అడిగితే.. తను చాలా అసభ్యంగా తిట్టేవాడు. బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

నన్ను పెళ్లి చేసుకున్న అబ్బాయిని నేను మూడు సార్లు మాత్రమే చూశాను. మొదట నన్ను చూడ్డానికి వచ్చినపుడు, రెండోది మెహిందీ రోజు, మూడోది నిఖా జరిగినప్పుడు, అంతే. ఆ అబ్బాయికి 21 ఏళ్లుంటాయి. పెళ్లి తర్వాత అతడు వికలాంగుడని, క్రిస్టియన్ కూడా కాదని తెలిసింది.

నేను ఆ విషయం ఆ ప్రతినిధికి చెప్పేసరికి, అతడు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. నీ పెళ్లికి ఖర్చైన డబ్బు తిరిగి తీసుకునేస్తామని, చైనా వాళ్లను మోసం చేశారని మీపైన కేసు పెడతానని బెదిరించాడు. తర్వాత నా మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నాడు. అక్కడ అమ్మాయిలందరి ఫోన్లు చెక్ చేస్తుండేవాడు.

అక్కడ నేను చైనా వెళ్లిన నా మిగతా ఫ్రెండ్సుతో కూడా మాట్లాడేదాన్ని. ఒకమ్మాయి "నన్ను ఇక్కడ ఒక గదిలో బంధించారని, సరిగా తిండి పెట్టడం లేదని, సాయంత్రం భర్త తన స్నేహితులను ఇంటికి తీసుకువస్తున్నాడని" కూడా చెప్పింది. దాంతో నాకు అక్కడ ఏం జరుగుతోందో అర్థమైంది. ఆ అమ్మాయి ఫోన్లో చాలా ఏడ్చింది.

నా పేపర్లన్నీ పూర్తయ్యాయి. ఇక వీసా రావడం మాత్రమే మిగిలింది.

వాళ్లు నన్ను మా ఇంటికి వెళ్లనిచ్చేవాళ్లు కాదు. నేను మా మామ ఆరోగ్యం సరిగా లేదని చెప్పాను. దాంతో మీ మామను ఇక్కడికే పిలిపిస్తాం, ఇక్కడే ట్రీట్‌మెంట్ చేయిస్తాం, నువ్వెక్కడికీ వెళ్లేది లేదు అన్నారు. చాలా కష్టపడి ఇంట్లో వాళ్లతో మాట్లాడగలిగా. మా ఇంట్లో వాళ్లు నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. తర్వాత నేను మళ్లీ తిరిగెళ్లలేదు. మా ఇంట్లో వాళ్లు ఇక నీకు నచ్చింది చేసుకో అన్నారు. నాకు పార్లర్ పని తెలిసుండడంతో అదే చేసుకుంటున్నాను.

ఇప్పుడు నాకు భయం లేదు. ఇదంతా తెలుసుకుని వేరే అమ్మాయిలు నాలా చైనా అబ్బాయిలను పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు.

చైనా పెళ్లిళ్ల వెనుక వాస్తవం ఏంటి

లాహోర్‌లో డివైన్ రోడ్‌, ఈడెన్ గార్డెన్ ప్రాంతంలో ఒక వరుసలో ఉన్న అన్ని ఇళ్లలో చైనా వాళ్లే ఉంటారు. వాళ్లు అక్కడ రకరకాల కంపెనీల్లో పనుల కోసం వస్తారు. చైనా వారికి వీసా ఇవ్వడంలో పాక్ ఉదారంగా ఉండడంతో చాలా మంది చైనీయులు ఇక్కడకు వచ్చి హాయిగా బతికేస్తున్నారు. వాళ్లలో కొందరు అసలు ఏ పనిచేస్తారో కూడా ఎవరికీ తెలీదు.

మానవ హక్కుల కార్యకర్తల వివరాల ప్రకారం "గత ఏడాది నుంచి పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి చైనీయులు పెళ్లిళ్లు చేసుకోడానికి వస్తున్నారు. తర్వాత అమ్మాయిలను చైనా తీసుకెళ్తున్నారు.

లాహోర్‌లోని సామాజిక కార్యకర్త సలీమ్ ఇక్బాల్ "ఇవి పెళ్లిళ్లు కాదని, అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచారానికి ఒక కీలక మార్గంగా మారాయని" చెప్పారు.

"నేను పోలీసులు, ఎఫ్ఐఏ, మిగతా భద్రతా సంస్థలకు దీని గురించి చెప్పాను. ఏడాది తర్వాత ఇప్పుడు ముస్లిం యువతులపై ఇలాంటివి జరిగినపుడు వారు ఈ కేసులపై విచారణలు ప్రారంభించారు" అని చెప్పారు.

మొదట కొన్ని నెలలపాటు గుజ్రావాలా, నావాహీ ప్రాంతాల్లో పత్రికలు, బ్యానర్ల ద్వారా చైనా అబ్బాయిల పెళ్లిళ్ల గురించి హెచ్చరిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని వారు చెప్పారు.

"కొన్ని కేసుల్లో బంధువులకు విషయం అర్థమైంది. వాళ్లు తమ ఇంటి ఆడపిల్లల్ని తిరిగి ఇంటికి పిలిపించారు. కానీ చాలా కేసుల్లో పేద కుటుంబాలకు మూడు, నాలుగు లక్షలు ఇచ్చి వారి ఇంట్లో అమ్మాయిలను పెళ్లి పేరుతో తీసుకెళ్లిపోయారు" అని ఇక్బాల్ చెప్పారు.

ఒక ఏడాది వ్యవధిలో ఇలా లాహోర్, గుజ్రావాలా, ఫైసలాబాద్, ముల్తాన్‌లో 700 పెళ్లిళ్లు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది క్రిస్టియన్ యువతులే.

ఈ విషయం మీడియాలో బయటపడ్డప్పుడు పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం అమ్మాయి కేసు కూడా వెలుగులోకి వచ్చింది. దానిని మత సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఏజెన్సీలకు ఈ వివాహాల గురించి తెలుసు

ఇర్ఫాన్ ముస్తఫా ఒక టీచర్. ఆయన గత నాలుగు నెలలుగా పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 పెళ్లిళ్లు చేయించాడు. బీబీసీతో మాట్లాడిన ఆయన "మేం ప్రతి పెళ్లిని చాలా జాగ్రత్తగా తెలుసుకుని చేస్తాం. ఈ పెళ్లిళ్లు కోర్టు ద్వారా జరుగుతాయి. ఇందులో అబ్బాయి, అమ్మాయిలను హాజరు పరుస్తాం" అన్నారు.

చైనా అబ్బాయిలతో పెళ్లైన తర్వాత వారు అమ్మాయిలను తమ దేశం తీసుకెళ్లి వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే వార్తలను ఇర్ఫాన్ ఖండించారు. ఇదంతా మీడియా సృష్టిస్తున్న అవాస్తవాలన్నారు.

"ఒక దేశం అమ్మాయిలను వేరే దేశం అబ్బాయిలు దొంగతనంగా తీసుకెళ్తుంటే, సంబంధిత ఏజెన్సీలకు అది తెలీకుండానే ఉంటుందా" అని ఆయన ప్రశ్నించారు.

అబ్బాయి సీపీఈసీలో పనిచేస్తాడు

కానీ ఇటీవల లాహోర్‌లోని నాదిరాబాద్, బట్ చౌక్, డివైన్ రోడ్ నుంచి 8 మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వీటిలో ఒక కేసు ఫరా జఫర్ పేరుతో నమోదైంది.

దీన్లో ఆమె "డబ్బుల కోసం తన తల్లి, పెళ్లిళ్లు చేసే ఒక సంస్థ బలవంతంగా తనకు పెళ్లి చేశారని" ఆరోపించింది.

లాహోర్ కచహరీ ప్రాంతంలో కూడా ఒక రిపోర్ట్ నమోదైంది. ఇందులో ఒక అమ్మాయి చైనా భర్త తనను హింసించాడని, అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును కోరింది.

కొంతమంది అమ్మాయిలు తమ ఫిర్యాదుల్లో "అబ్బాయి సీపీఈసీ(చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్)లో పనిచేస్తున్నానని చెప్పాడని, కానీ చైనా వెళ్లాక అది నిజం కాదని తెలిసిందని ఆరోపించారు. ఎక్కువ కేసుల్లో ఒక అమ్మాయిని పాకిస్తాన్ నుంచి చైనా తీసుకెళ్లాక, వారిని కాంటాక్ట్ చేయడం అసాధ్యంగా తేలింది.

పేరు బయటపెట్టదనే షరతుతో ఒక పోలీస్ అధికారి "ఈ కేసులన్నిటిలో ఒకే పద్ధతిని పాటించారు. అన్ని పెళ్లిళ్లలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఏదో ఒక ఇంటికి వెళ్తారు. పెళ్లి ఖర్చుల నుంచి చైనా తీసుకెళ్లడం వరకూ అన్ని ఖర్చులు తామే భరిస్తామని చెబుతారు" అన్నారు.

కొన్ని ఘటనల్లో పెళ్లిళ్లు సఫలం అయ్యాయి. కానీ ఆ పెళ్లి చేసుకున్న వారు అమ్మాయిలకు తమ గొంతు వినిపించే అవకాశం ఇచ్చుండకపోవచ్చు అన్నారు.

పాక్-చైనా స్నేహానికి మూల్యం చెల్లిస్తున్నారా

పాకిస్తాన్, చైనా స్నేహాన్ని సీపీఈసీకి సంబంధించిన ప్రయోజనంగా చూస్తున్నారు. అందుకే ఇటీవల జరిగిన ఘటనల గురించి నమోదైన కేసులను నిర్లక్ష్యం చేస్తున్నారు.

దీని గురించి బీబీసీతో మాట్లాడిన పంజాబ్ ఎమ్మెల్యే, మంత్రి ఆలం ఆగస్టేన్ "రెండు నెలల ముందు పాకిస్తాన్ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నాడని ఒక చైనా వ్యక్తిని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశాం" అని చెప్పారు.

పంజాబ్‌లో క్రైస్తవ మతాధికారులే ఈ పెళ్లిళ్లు చేయిస్తున్నారని చెప్పారు.

"అందుకే మేం లైసెన్సింగ్ ప్రక్రియ మొదలుపెట్టాం. ఫలితంగా చర్చిలు, అక్కడ ప్రార్థనలు చేయించే ఫాదర్లు అందరూ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ ప్రార్థనలు చేయించేవారే పెళ్లిళ్లు కూడా చేయిస్తారు. బలవంతపు పెళ్లిళ్లు ఆపడానికే మేం ఇలా చేస్తున్నాం" అని ఆలం చెప్పారు.

ప్రస్తుతం చైనాలో లైంగిక అసమానతలు ఉన్నాయి. ఇక్కడ పురుషుల సంఖ్య మహిళల కంటే చాలా ఎక్కువగా ఉంది. దీనికి అతిపెద్ద కారణం 1979 నుంచి 2015 వరకూ ఒకే బిడ్డ విధానం ఉండడమే.

పరిశీలకుల ప్రకారం చైనాలో ఈ పాలసీ తర్వాత ఎక్కువ కుటుంబాలు అబ్బాయిలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఫలితంగా స్త్రీ-పురుష సమతౌల్యం దెబ్బతింది. దాంతో దేశంలో జంటను వెతుక్కోడానికి పురుషులు వేరే దేశాల వైపు చూడాల్సి వస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఎన్నో ముఠాలు మహిళలను చైనాకు అక్రమ రవాణా చేస్తున్నాయి. పెళ్లి పేరుతో మభ్య పెట్టి వారిని అమ్మేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)