మెషీన్లు ఆటోమేటిగ్గా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా ఉంటుంది?

  • 13 మే 2019
ఇగ్లండ్‌లోని పీటర్స్‌బర్గ్ అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌లో పార్శిళ్లు తీసుకెళ్తున్న కార్మికుడు Image copyright Getty Images
చిత్రం శీర్షిక మీరు ఆఫీసులో చేసే ప్రతి పనినీ ఒక మెషిన్ గమనిస్తుంటే ఏం జరుగుతుంది

"రోబో ఆటోమేషన్ భవిష్యత్తులో మీ ఉద్యోగానికే ఎసరు పెట్టబోతోంది".

ఈ శీర్షికను మీరింతకు ముందు చాలాసార్లు చూసే ఉంటారు.

ఆన్‌లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్‌లో ఇది ఇప్పటికే జరుగుతోంది. కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు.

అమెజాన్ తమ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో కార్మికులను గమనించేందుకు, వారిని తొలగించేందుకు ఆటోమేషన్‌ను ఉపయోగిస్తున్నట్టు టెక్ న్యూస్ వెబ్ సైట్ ది వెర్జ్ గుర్తించింది.

న్యూస్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం ఇదంతా వారి ఉత్పాదకత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆటోమేషన్ ఎలా పనిచేస్తుంది

అమెజాన్ సిస్టమ్ ప్రతి ఉద్యోగి ఉత్పాదకత వేగాన్నీ ట్రాక్ చేస్తుంది. అందులో నాణ్యతను బట్టి వారికి ఆటోమేటిగ్గా హెచ్చరికలు పంపించడం, సూపర్ వైజర్లతో పనిలేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడం చేస్తుందని వెర్జ్ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది.

తక్కువ వేతనాలు, కఠినమైన పనులపై ఫిర్యాదులు రావడంతో అమెజాన్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అమెజాన్ గిడ్డంగిలో పనిచేసే ఒక కార్మికురాలు "మాకు ఇచ్చే లక్ష్యాలతో టాయిలెట్ వెళ్లడానికి కూడా సమయం ఉండదు, దాంతో, టాయిలెట్ వెళ్లాల్సి వస్తుందని నేను ఎక్కువ నీళ్లు కూడా తాగడం లేదు" అని చెప్పారు.

అమెజాన్‌లో పనిచేసిన ఒక మాజీ కార్మికుడు "అక్కడ ఉద్యోగులను మర మనుషుల్లా చూస్తారు, అసాధ్యమైన టార్గెట్లు ఇచ్చి వాటిని అందుకోలేకపోయిన కార్మికులను తరచూ ఉద్యోగం నుంచి తీసేస్తుంటారు" అని చెప్పారు.

వెర్జ్ రిపోర్ట్ ప్రకారం ప్యాకేజీలను తగినంత వేగంగా కదిలించలేదనే కారణంతోనే కంపెనీ ఏటా కొన్ని వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తోంది.

ఈ కృత్రిమ మేధ ఎలా పెత్తనం చలాయిస్తుంది.. మనుషుల జోక్యం లేకుండానే ఉద్యోగులను తొలగించే అల్గారిథం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు బాగా అర్థమవుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భవిష్యత్తులో ఉద్యోగులను యంత్రాలే తొలగిస్తాయా

మనుషులను రోబోల్లా చూసే యంత్రాలు

"అమెజాన్లో పనిచేసే వారిని రోబోట్లు మరమనుషుల్లా చూస్తున్నాయి" అని స్థానిక స్వావలంబన కోసం పనిచేసే ఒక సంస్థకు చెందిన స్టాసీ మిచెల్ అన్నారు.

"వాళ్లు జనాలను తమ యంత్రాల్లో సులభంగా మార్చేసే ఒక చక్రంలా చూస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చే టార్గెట్లు, ఉత్పాదకత ప్రమాణాలు, ఆటోమేషన్ పరిధి గురించి సంస్థలకు పెద్దగా స్పష్టత లేదు" అన్నారు.

దీనిపై స్పందించిన అమెజాన్‌ బీబీసీతో, ఈ వార్త గురించి ప్రచురించిన మిగతా సంస్థలకు ఒకే ఒక మాట చెప్పింది.

"ఆటోమాటిక్ సిస్టం ద్వారా ఉద్యోగులను తొలగిస్తున్నామనే మాట నిజం కాదు. కార్పొరేట్ అయినా, ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ అయినా ఉద్యోగుల పనితీరుపై మాకు కూడా మిగతా కంపెనీల్లా కొన్ని అంచనాలు ఉంటాయి."

"మొట్టమొదట ఉద్యోగులకు ప్రత్యేకమైన కోచింగ్, సాయంతోపాటు మా పూర్తి మద్దతు అందిందా లేదా అనేది తెలుసుకోకుండా మేం ఎవరినీ తొలగించండం ఉండదు. మాది అంతకంతకూ అభివృద్ధి చెందే సంస్థ, అందుకే మా ఉద్యోగులకు లాంగ్ టర్మ్ కెరీర్ డెవలప్‌మెంట్ అవకాశాలుండేలా చూసుకోవడం మా వ్యాపార లక్ష్యం" అని చెప్పింది.

కానీ, ఆటోమేషన్ విస్తరణపై వచ్చిన ప్రశ్నల గురించి కంపెనీ సమాధానం చెప్పలేదు.

వారం క్రితం తమ ప్రైమ్ సర్వీస్ వినియోగదారుల కోసం ప్రపంచవ్యాప్తంగా డెలివరీ సమయంలో కోత విధిస్తామని అమెజాన్ కంపెనీ హామీ ఇచ్చింది. కానీ, గిడ్డంగుల్లో పనిచేసేవారి గోడు పట్టించుకునేదెవరు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక న్యూయార్క్‌లోని అమెజాన్ గిడ్డంగి

భవిష్యత్తులో ఏం జరుగుతుంది?

యంత్రాలు ఉద్యోగులను తొలగించడం, ఇది మొదటిసారి కాదు. కానీ, ఇదే చివరిది కాబోతోందని కూడా కచ్చితంగా చెప్పలేం.

ఉద్యోగుల పనితీరును పరిశీలించి, దానిని నమోదు చేయడానికి కంపెనీలు ఎన్నో ఏళ్ల నుంచి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

దీని వాడకం అమ్మకాల పనితీరుపై డిజిటల్ విశ్లేషణ నుంచి ఫ్యాక్టరీలో బయటికెళ్లే సమయం వరకూ ఉంటుంది.

"ఇది దాదాపు అనివార్యం అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఉంది. అందుకే మరిన్ని కంపెనీలు దాని వాడకంపై ప్రయోగాలు చేస్తున్నాయి" అని చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్ (సీఐపీడీ) డైరెక్టర్ డేవిడ్ డిసౌజా చెప్పారు.

ఇక్కడ, ఒక యంత్రంపై అతివిశ్వాసం ఎందుకు వస్తుంది, మనుషులు-మానవ సంబంధాలను మనం ఏ పరిధి వరకూ మార్చవచ్చు అనే ప్రశ్న చాలా కీలకం.

ఆటోమేషన్ ద్వారా కంపెనీలు ఉద్యోగుల ఉత్పాదకతను గుర్తించడం అనేది జరిగితే, అందులో ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వాటిలో కొన్ని-

ఎక్కువ మందిని తీసుకోవడంపై ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది?

ఉద్యోగులపై, సంస్థ గురించి వారికి ఉన్న అభిప్రాయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

Image copyright Getty Images

మనుషుల జోక్యం అవసరమా...

ఒక ఆఫీసులో ఇది ఎలా ఉంటుందో చెప్పడానికి ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ ఎడిటర్ విల్ నైట్ ఒక ఉదాహరణ ఇచ్చారు.

జనం రకరకాలుగా పనిచేయవచ్చు, ఒక పని చేయడానికి అక్కడ ఒకదాన్ని మించి చాలా రకాల పద్ధతులు ఉండవచ్చు.

అంటే ఉత్పాదకతను గుర్తించేందుకు సెట్ చేసిన ఒక అల్గోరిథం ఆ ఉద్యోగి పంపించే ఈమెయిళ్ల సంఖ్యను బట్టి ఉంటే, ఎక్కువ ఈమెయిళ్లు పంపిస్తాడు కాబట్టి ఒక ఉద్యోగి ఎక్కువ ఉత్పాదకత ఉన్నవారు కావచ్చు. కానీ అక్కడే ఇంకొకరు కూడా వారిలాగే పనిచేసేవారు ఉండచ్చు.

ఉత్పాదకత ప్రమాణాలు పూర్తిగా లేకుండా, లేదా దానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? దీనికి అమెజాన్ కేసు కొన్ని ఆధారాలను చూపిస్తుంది.

వెర్జ్ కథనం చూస్తే ఆటోమేషన్ సిస్టమ్‌పై ఆధారపడే అమెజాన్ ఉత్పాదకత ప్రమాణాలు నిరంతరం మారుతూనే ఉంటాయి.

కార్మికులను తమ ప్రమాణాలకు తగ్గట్టు మార్చే ప్రక్రియలో వారికి తిరిగి శిక్షణ ఇవ్వడం ఒక భాగం అని అమెజాన్ చెబుతుంది.

సంస్థలోని 75 శాతానికి పైగా ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాత్రమే తాము వాటిని మారుస్తామని అంటోంది.

Image copyright Getty Images

"అంటే, ఒక గిడ్డంగిలో ఉన్న ఎక్కువ మంది కార్మికులు అమెజాన్ ఉత్పాదకత వేగాన్ని అందుకోగానే, అది మళ్లీ మారుతుంది" అని స్టాసీ మిచెల్ చెప్పారు.

"తర్వాత ఆ కొత్త వేగాన్ని అందుకోడానికి ప్రతి ఒక్క కార్మికుడూ పరుగులు తీయాల్సుంటుంది. చివరికి దాన్ని అందుకోలేక విఫలమైనవారు, ఉద్యోగం పోగొట్టుకుంటారు."

"అంటే, అందరికంటే వెనకబడిపోకుండా ఉద్యోగం కాపాడుకోడానికి ఇది పిచ్చిగా పరుగులు తీయడం లాంటిదే" అంటారు స్టాసీ.

"అయితే, ఏడాది క్రితం మీరు మిగతా కార్మికుల కంటే ఎక్కువ ఉత్పాదకత చూపించినా, అది లెక్కలోకి రాదు. ఇప్పుడు ఎలా చేస్తున్నారనేదే ముఖ్యం".

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionతాజాగా రోబోలు బార్ టెండర్ అవతారం కూడా ఎత్తాయి

ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది

"ఉద్యోగులను తీసుకోవడం, తొలగించడం లాంటి కీలకమైన ప్రక్రియల్లో ఆటోమేషన్ అవసరం ఏ మేరకు ఉంది, అనేది ఒకసారి ఆలోచించాలి" అని డేవిడ్ డిసౌజా సంస్థలను కోరారు.

"ఈ ప్రక్రియను ఆటోమేటెడ్ చేయచ్చు అన్నంత మాత్రాన అలా చేయాలనేం లేదు. అది మనిషి కంటే మెరుగ్గా చేయడం ఉండదు".

ఉద్యోగులు పనిలో ఒక గౌరవం కోరుకుంటారు. మనం భవిష్యత్తులో ఒక మెషిన్ నుంచి దాన్ని పొందాలని ఊహించుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది.

Image copyright Getty Images

2018లో ఇబ్రహీమ్ డియాల్లోను ఆయన మేనేజర్ కాదు, ఒక మెషీన్ ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పుడు ఆయన బాస్ గందరగోళంలో పడ్డారు, కానీ ఏం చేయలేకపోయారు.

"నా ఉద్యోగం పోయింది. అప్పుడు మా మేనేజర్ ఏం చేయలేకపోయారు. డైరెక్టర్ కూడా దాన్ని ఆపలేకపోయారు. నేను నా వస్తువులన్నీ తీసుకుని ఆ భవనం నుంచి వచ్చేస్తుంటే వాళ్లు అలా చూస్తుండిపోయారు" అని డియాల్లో బీబీసీతో అన్నారు.

ఆటోమేషన్‌పై అతిగా ఆధారపడే కంపెనీలకు తన కేసు ఒక ప్రమాదకరమైన హెచ్చరికలా అవుతుందని డియాల్లో భావిస్తున్నారు.

"లేదంటే అది ఉద్యోగుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగుల అనుభవం విషయానికే వస్తే ఇలా టెక్నాలజీని ఉపయోగించడం, ఒక విధంగా మమ్మల్ని శతాబ్దాల వెనక్కు తీసుకెళ్లడమే అవుతుంది" అని డియాల్లో చెప్పారు.

పని అనేది ప్రజల కోసం చేయాల్సుంటుంది. ఉద్యోగులను నీచంగా చూడడం వల్ల వచ్చే ఆర్థిక చిక్కులు, ప్రతికూల గుర్తింపును సంస్థలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

మీరు ఇది చదువుతుంటే, ఒక ఉద్యోగిగా మీ సామర్థ్యం, మీరు ఏం చేయగలరో మీకు తెలిసుంటే, డేవిడ్ డిసౌజా ఒక మంచి సలహా ఇస్తారు.

"ఆటోమేషన్ ముప్పు ఉన్న ఇలాంటి పనులను ఎప్పుడైనా వదిలేయడానికి సిద్ధంగా ఉండండి. మీ సామర్థ్యానికి తగిన మంచి కెరీర్ ఎంచుకోండి".

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం