పాకిస్తాన్: దైవదూషణ కేసులో మరణశిక్ష తప్పించుకుని దేశం వదిలివెళ్లిన క్రిస్టియన్ ఆసియా బీబీ

  • 8 మే 2019
ఆసియా బీబీ Image copyright HANDOUT

దైవదూషణ కేసులో దోషిగా మరణశిక్ష పడి ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన పాకిస్తానీ క్రిస్టియన్ ఆసియా బీబీ ఆ దేశం వదిలి వెళ్లియారని పాక్ అధికారులు ధ్రువీకరించారు.

పాక్ సుప్రీంకోర్టు గత ఏడాది ఆసియా బీబీ మరణశిక్షను రద్దు చేసింది. ఆమె నిర్దోషి అని తీర్పు ఇచ్చింది.

పక్కింటి వారితో గొడవ జరిగినపుడు మహమ్మద్ ప్రవక్తను అవమానించారనే ఆరోపణలతో ఆసియా బీబీపై 2010లో దైవదూషణ కేసు నమోదైంది.

ఆసియా బీబీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో, ఎప్పుడు వెళ్లారో పాక్ అధికారులు వివరాలు ఇవ్వలేదు.

కానీ, ఆసియా బీబీ లాయర్ సైఫ్ ఉల్ మలూక్ బీబీసీతో "ఆమె ఇప్పటికే కెనడా చేరుకున్నారు. అక్కడ ఆమె ఇద్దరు కూతుళ్లకు ఆశ్రయం ఇవ్వడానికి అనుమతి లభించినట్లు తెలిసింది" అని చెప్పారు.

ఆసియా బీబీ అసలు పేరు ఆసియా నోరీన్. పాకిస్తాన్ వదిలి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు ఆమెను ఒక రహస్య ప్రాంతంలో ఉంచారు.

గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆసియా బీబీ మరణశిక్షను రద్దు చేయడంతో దేశంలో కఠిన దైవదూషణ చట్టాలకు మద్దతిచ్చే మత సంస్థలు హింసాత్మక ఆందోళనలు నిర్వహించాయి.

ఆ దేశంలోని కొందరు ఉదారవాదులు మాత్రం ఆసియా బీబీని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

Image copyright EPA

ఆమెపై వచ్చిన ఆరోపణలు

2009 జూన్‌లో నీళ్లు పట్టుకుంటున్నప్పుడు ఆసియా బీబీ కొంతమంది మహిళలతో గొడవపడడంతో ఈ వివాదానికి బీజం పడింది.

గొడవ జరుగుతున్నప్పుడు ఒక మహిళ ఆసియా బీబీని "ఇస్లాం మతంలోకి మారమని" చెప్పారు. దాంతో ఆమె మహమ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.

తర్వాత దైవదూషణ చేసినట్లు అంగీకరించిందని ఆసియా బీబీని ఆమె ఇంట్లోనే కొట్టారు. దీనిపై కేసు నమోదవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

జనం 'చంపేస్తామని బెదిరించడం' వల్లే ఆమె దానిని అంగీకరించిందని, ఆసియా బీబీ దైవదూషణ చేసినట్లు నమ్మదగిన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది.


పాకిస్తాన్‌ దైవదూషణ చట్టాలతో ఇబ్బందులు

ఇలియాస్ ఖాన్, ఇస్లామాబాద్ బీబీసీ ప్రతినిధి విశ్లేషణ

పాకిస్తాన్ ప్రభుత్వం మౌనం, ఆసియా బీబీ దేశం వదిలి వెళ్లిందని అక్కడి అధికారులు అంగీకరించడం, ఆ దేశానికి తలవంపులు తెచ్చిన ఒక కేసు మూసివేయడాన్ని సూచిస్తోంది.

సుదీర్ఖ కాలం నుంచీ మతపరమైన మూఢత్వం ఉన్న చోట చివరికి న్యాయం జరిగిందనే భావన కూడా ఏర్పడింది.

గత కొన్ని దశాబ్దాలుగా దైవదూషణ ఆరోపణలు ఎదుర్కున్న వందలాది పాకిస్తానీ పౌరుల్లో ఆసియా బీబీ ఒకరు.

కానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు, దేశంలోని అతిపెద్ద ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ 2011లో హత్యకు గురైనప్పుడు ఆసియా బీబీ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆసియా బీబీ పట్ల సల్మాన్ బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేశారు, దైవదూషణ చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని చెప్పారు.

దాంతో రాజుకున్న ఈ వివాదంలో ఆమె కేంద్ర బిందువుగా మారారు.

ఈ కేసు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంతో దీనిని చల్లార్చేందుకు పాకిస్తాన్ అధికారులు చివరికి తెరవెనుక ప్రయత్నాలు చేశారు. ఆమె విడుదలైతే ఒక పెద్ద ఉపద్రవం తొలగిపోతుందని భావించారు.


Image copyright Asia bibi
చిత్రం శీర్షిక ఆసియా బీబీ

కెనడా, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడె ఆసియా బీబీకి ఆశ్రయం కల్పిస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఎక్కడుంది అనేది ఇంకా చెప్పడం లేదు.

2018 నవంబర్‌లో ట్రుడె ఆసియా బీబీ గురించి పాకిస్తాన్‌తో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. కెనడాను "ఆహ్వానం పలికే దేశం"గా వర్ణించారు.

ఆశ్రయం కల్పించాలని ఆసియా బీబీ భర్త ఆషిక్ మసియా బ్రిటన్, అమెరికా, కెనడాను కోరడంతో తాము వారితో చర్చలు జరిపినట్లు ఆయన ధ్రువీకరించారు.

ఆసియా బీబీ నిర్దోషిగా విడుదలయ్యాక జరిగిన ఆందోళనలకు తెరదించడానికి పాక్ అధికారులు టీఎల్పీతో ఒప్పందం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ తనకు, తన కుటుంబానికి చాలా 'ప్రమాదకరం'గా మారిందని ఆషిక్ తనకు చెప్పారని ట్రుడే తెలిపారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా "ఆమె సురక్షితంగా ఉందని, త్వరలో తమ దేశం నుంచి వెళ్లిపోతుందని" చెప్పారు.

Image copyright EPA

ఈ కేసులో ఇంత విభజన ఎందుకు

పాకిస్తాన్ జాతీయ మతం ఇస్లాం. అది అక్కడి చట్ట వ్యవస్థను నియంత్రిస్తుంది. దేశంలోని కఠోరమైన దైవదూషణ చట్టాలకు ప్రజల మద్దతు చాలా బలంగా ఉంది.

మద్దతుదారులను పెంచుకోడానికి ఇక్కడి రాజకీయ నేతలు కూడా కఠిన శిక్షలకు తరచూ మద్దతు పలుకుతుంటారు.

కానీ దైవదూషణ చట్టాలను తరచూ ప్రతీకారం తీర్చుకోడానికి, వ్యక్తిగత వివాదాలకు ఉపయోగిస్తున్నట్లు విమర్శకులు చెబుతున్నారు. ఈ కేసులో చిన్న ఆధారం దొరికినా దోషులుగా ఖరారు చేస్తున్నారు.

ఈ కేసులో దోషులుగా నిలిచిన వారిలో ఎక్కువ మంది ముస్లింలు అహ్మదీ సమాజానికి చెందిన వారే. వీరు తమకు తాము ముస్లింలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ వీరిని సనాతన ఇస్లాంకు విరోధులుగా భావిస్తున్నారు.

1990 నుంచి క్రైస్తవులపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్‌లో క్రైస్తవ జనాభా 1.6 శాతం మాత్రమే ఉంది.

గత కొన్నేళ్లుగా క్రైస్తవులు లక్ష్యంగా ఇక్కడ ఎన్నో దాడులు జరిగాయి. ఎంతోమందిలో ప్రమాదకరమైన వాతావరణంలో బలహీనంగా ఉన్నామనే భావనను కలిగించాయి.

పాకిస్తాన్‌లో 1990లో దైవదూషణ ఆరోపణలతో సుమారు 65 మందిని హత్య చేశారు.

1971లో పుట్టిన ఆసియా బీబీకి నలుగురు పిల్లలు. ఈమె దైవదూషణ చట్టాల ప్రకారం మరణశిక్ష పడిన మొట్టమొదటి మహిళగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)