ఇరాన్ అణు ఒప్పందం: ట్రంప్ తాజా ఆంక్షలు... లోహ ఉత్పత్తులపై అదనపు సుంకాలు

  • 9 మే 2019
ఇరాన్ Image copyright AFP
చిత్రం శీర్షిక ఇటీవల తాము తీసుకున్న నిర్ణయాలు ఒప్పందానికి అనుగుణంగానే ఉన్నాయని ఇరాన్ అంటోంది

చరిత్రాత్మక అణు ఒప్పందం నుంచి కొన్ని అంశాలకు ఉద్వాసన పలుకుతున్నట్లు ఇరాన్ ప్రకటించిన రోజుే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ దేశం మీద మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

ఇరాన్ లోహ పరిశ్రమ మీద ఆంక్షలను విధించే ఆదేశాల మీద ట్రంప్ సంతకాలు చేశారు. ఇరాన్ ఎగుమతులలో చమురు తరువాత స్థానం లోహ ఉత్పత్తులదే.

అయితే, ఇరాన్‌తో ఒక అంగీకారానికి వచ్చేందుకు ఆ దేశ నేతలతో సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నానని కూడా ట్రంప్ అన్నారు.

2015 నాటి అణు ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి ఉండేది లేదంటూ ఇరాన్ చేసిన ప్రకటన అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.

ఆ ఒప్పందంలో భాగమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఆ అంగీకారాన్ని విస్మరించకూడదని ఇరాన్‌ను హెచ్చరించాయి.

ఇరాన్ నిర్ణయం 'అహ్వానించదగినది కాదు' అని వ్యాఖ్యానించిన పశ్చిమ దేశాలు, ఇరాన్ కనుక తన హామీలకు కట్టుబడి ఉంటే, ఆ ఒప్పందానికి తాము మద్దతు కొనసాగిస్తామని తెలిపాయి.

ఇరాన్ అణు కార్యక్రమాలను నిరోధించి, దానికి ప్రతిఫలంగా ఆ దేశానికి ఆంక్షల నుంచి విముక్తి కల్పించే లక్ష్యంతోనే 2015 అణు ఒప్పందం కుదిరింది.

Image copyright AFP

ఇరాన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది...

అంతర్జాతీయ అణు ఒప్పందం 2015లో జరిగింది. కానీ, అమెరికా ఏడాది క్రితమే ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది.

"మిగతా సూపర్ పవర్స్ అన్నీ ఇప్పుడు కూడా ఈ ఒప్పందానికి బద్ధులై ఉన్నాయని" ఇరాన్ అధ్యక్షుడు హసన్ రుహానీ అన్నారు.

ఇరాన్ తమ అణు కార్యకలాపాలను తగ్గిస్తే, బదులుగా ఆ దేశంపై ఆంక్షలు సడలించడానికి ఈ ఒప్పందం కుదిరింది.

అయితే, అమెరికా ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి.

ఇరాన్‌ చమురు, ఆర్థిక రంగాలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించింది. దాంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది.

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో హఠాత్తుగా ఇరాక్‌ పర్యటనకు వెళ్లారు.

బెర్లిన్ పర్యటన రద్దు చేసుకున్న పాంపేయో ఇరాక్ రాజధాని బగ్దాద్‌లో నాలుగు గంటలు ఆగారు. ఇరాక్ నేతలతో సమావేశం అయ్యారు.

దీనికి కొన్ని రోజుల ముందే అమెరికా ఈ ప్రాంతంలో తమ విమానవాహక యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్‌ను మోహరించింది.

ఇరాన్ నుంచి తమ సహచరులకు ఎదురయ్యే ప్రమాదానికి సమాధానంగా అమెరికా తన దళాలను మోహరించిందని అధికారులు చెబుతున్నారు.

అమెరికా మంగళవారం బి-52 బాంబర్లను కూడా ఇదే ప్రాంతంలో మొహరించినట్లు తెలిసింది.

Image copyright AFP

మైక్ పాంపేయో ఇరాక్ ఎందుకు వెళ్లారు

అమెరికా పాంపేయో ఇరాక్ పర్యటన గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించింది. ఆయన ఇరాక్ ప్రధాన మంత్రితో భేటీ అయ్యారని తెలిపింది.

సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాంపేయో క్లుప్తంగా ఈ సమావేశం ఇరాన్‌కు సంబంధించినదని చెప్పారు.

ఇంధన ఒప్పందం కోసం ఇరాన్‌పై తక్కువగా ఆధారపడాలని అనుకుంటున్న దేశాలకు సాయం చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

అమెరికా ఇక్కడకుబాంబర్లు ఎందుకు పంపిస్తోంది

పెంటగాన్ ప్రతినిధి చార్ల్స్ సమర్స్ ఒక ప్రకటనలో "అమెరికా ఇరాన్ ప్రభుత్వంతో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు. కానీ మా అమెరికన్లను, మా సహచరులను, ఆ ప్రాంతంలో ఉన్న మా ప్రయోజనాలను కాపాడుకుంటాం" అన్నారు.

"అమెరికా దళాలకు, మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా దూకుడు చూపిస్తున్న ఇరాన్ ప్రయత్నాలకు సమాధానంగానే, యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ కెరియర్ స్ట్రైక్ గ్రూప్, ఒక బాంబర్ టాస్క్ ఫోర్స్ మోహరించాం" అని చెప్పారు.

ఆదివారం యుద్ధ నౌకలను ఈ తీరానికి పంపిస్తున్నట్టు కూడా అధికారులు ముందే ప్రకటించారు.

"అమెరికా ప్రయోజనాలు, లేదా మా సహచరులపై ఎలాంటి దాడి జరిగినా దానికి గట్టి జవాబు చెబుతామని మేం ఇరాన్ పాలకులకు స్పష్టమైన సందేశం పంపాలనుకుంటున్నాం" అని అప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పారు.

Image copyright EPA

ఇరాన్-అమెరికా మధ్య అంత శత్రుత్వం ఎందుకు?

1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అప్పుడు ఇక్కడ షా మద్దతుదారులను పదవి నుంచి తొలగించడంతో అమెరికా వ్యతిరేక సంప్రదాయ వాదుల పాలన వచ్చింది.

కానీ, అధ్యక్షుడు ట్రంప్ 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ఘోరంగా మారాయి.

అమెరికా స్వయంగా అణు ఒప్పందం నుంచి తప్పుకుంది. ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యకలాపాలను పరిమితం చేసేందుకు అంగీకరించింది.

ప్రస్తుతం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, టర్కీలకు ఆంక్షల నుంచి ఇచ్చిన మినహాయింపులు రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్‌లో వైట్ హౌస్ ప్రకటించింది.

అమెరికా దానితోపాటు ఇరాన్ 'రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్'ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనం అయ్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)