అమెజాన్ బ్లూ మూన్‌: చంద్రుడి మీదికి మనుషులు, ఉపగ్రహాలు.. అక్కడే అంతరిక్ష కాలనీలు

  • 10 మే 2019
జెఫ్ బెజోస్ Image copyright Reuters

చంద్ర మండలానికి మనుషులను, ఇతర పరికరాలను తీసుకెళ్లే అంతరిక్ష వాహక నౌక నమూనాను అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ గురువారం ఆవిష్కరించారు.

"బ్లూ మూన్‌"గా పిలిచే ఈ మానవరహిత, పునర్వినియోగ వాహనం ద్వారా 2024లోగా చంద్రుడి మీదికి మనుషులతో పాటు సాంకేతిక పరికరాలను, ఉపగ్రహాలను, అంతరిక్ష యంత్రాలను (రోవర్లు) తీసుకెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ వాహనంలో వినియోగించనున్న బీఈ-7 అనే సరికొత్త రాకెట్ ఇంజిన్‌ను కూడా వాషింగ్టన్ డీసీలో ఆవిష్కరించారు. ఆ ఇంజిన్‌ను ఈ వేసవిలో పరీక్షిస్తామని జెఫ్ బెజోస్ చెప్పారు.

బెజోస్‌కు చెందిన ఏరోస్పేస్ సంస్థ బ్లూ ఆరిజన్ వీటిని అభివృద్ధి చేస్తోంది.

బ్లూ మూన్ వాహనం 3.6 టన్నుల బరువైన వస్తువులను మోసుకెళ్లగలదని బెజోస్ తెలిపారు. ఏకకాలంలో నాలుగు స్వయం-చోదిత రోవర్ల(యంత్రాలు)ను తీసుకెళ్తుంది, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుందన్నారు.

2016 నుంచి ఈ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నామని, 2024లోగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

ఇంధనం నింపినప్పుడు భూమి మీద ఈ బ్లూ మూన్ వాహనం బరువు దాదాపు 15 టన్నులు ఉంటుంది. చంద్రుని మీద ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ బరువు సుమారు 3.2 టన్నులకు తగ్గుతుంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బ్లూ ఆరిజిన్ సంస్థ అభివృద్ధి చేసిన అధునాత రాకెట్ ఇంజిన్ బీసీ-7ను జెఫ్ బెజోస్ ఆవిష్కరించారు

చంద్రుని మీద ఇంధనం తయారీ

మంచు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించిన చంద్రుడి దక్షిణ ధృవం మీద బ్లూ మూన్ వాహనాన్ని ల్యాండ్ చేయిస్తారు.

ఆ మంచు నీటి (H2O) నుంచి హైడ్రోజన్‌(H)ను ఉత్పత్తి చేస్తారు. అక్కడి నుంచి మరిన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా బ్లూ మూన్ వాహనానికి ఆ హైడ్రోజన్ ఇంధనంగా పనికొస్తుంది.

2024 ఆఖరులోగా అమెరికా వ్యోమగాములను చంద్రుని మీదకు తీసుకెళ్తామని ఈ ఏడాది మార్చిలో ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటించిన గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తవుతుందని జెఫ్ బెజోస్ అన్నారు.

భవిష్యత్తులో ప్రజలు చంద్రుడి మీద నివాసం ఉంటూ, అక్కడే పనిచేసుకుంటారని, అందుకు అనుగుణంగా భూమికి, చంద్ర మండలానికి మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయాలన్న దీర్ఘ దృష్టితో జెఫ్ బెజోస్ ఉన్నారు.

భవిష్యత్తులో ప్రజలకు, జంతువులకు, మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉండే అంతరిక్ష కాలనీల నమూనా చిత్రాలను కూడా ఆయన ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)